
ప్రజాశక్తి-కొలిమిగుండ్ల : నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న రాంకో సిమెంట్స్ ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే దర్మరణం మృతి చెందారు. కోవెలకుంట్ల సిఐ నారాయణరెడ్డి కథనం ప్రకారం.. రాంకో సిమెంటు పరిశ్రమ వారు నిర్మాణ పనులను ఎల్‌అండ్‌టి వారికి కాంట్రాక్టు ఇచ్చారు. సిమెంట్ పరిశ్రమ నిర్మాణ పనులు చేసేందుకు కాంట్రాక్టర్ పశ్చిమ బెంగాల్ నుంచి కూలీలను ఎనిమిది నెలల క్రితం ఇక్కడికి తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో క్లింకర్ సప్లై కన్వేయర్ బెల్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెండు కన్వేయర్లు ఏర్పాటు చేసిన కూలీలు మూడో కన్వేయర్‌ను బిగిస్తున్నారు. కన్వేయర్‌కు సపోర్టుగా ఉన్న స్తంభం ఈ సమయంలో సైడ్‌కి వెళ్లిపోయింది. దీంతో కన్వేయర్‌కు బోల్టాలు బిగించేందుకు తాళ్లు కట్టుకుని పైకి వెళ్లిన కార్మికులపై కన్వేయర్ ఇనుప రాడ్లు, స్తంభాలు పడ్డాయి. ఇనుప స్తంభం మీద పడడంతో రహీం (27), తలపై రాడ్లు పడడంతో సుమన్ (22) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీని ఈ నెల 28న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డితో ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి : సిఐటియు, సిపిఎం
మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సిఐటియు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు, సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మృతుల్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.