Mar 06,2023 15:28

శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విట్టర్‌లో త్వరలో మార్పులు రానున్నాయని సిఇఓ ఎలాన్‌మస్క్‌ సోమవారం వెల్లడించారు. రాబోయే రోజుల్లో ట్విట్టర్‌లో పదివేల అక్షరాలతో పోస్ట్‌ చేసేందుకు వీలుగా మార్పులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోస్టులకు సంబంధించిన కోడ్‌లు, వీడియోలపై ఓ యూట్యూబర్‌ అడిగిన ప్రశ్నకు.. 'లాంగ్‌ ఫార్మ్‌ ట్వీట్లను పొడిగించేందుకే ట్విట్టర్‌ ప్రయత్నిస్తోంది. రాబోయే కాలంలో మైక్రో బ్లాగింగ్‌ పోస్టులను 10 వేల అక్షరాలకు పొడిగించనున్నాము ' అని ఆయన సమాధానమిచ్చారు. ఎలాన్‌ మస్క్‌ పోస్టుపై యూజర్లు రకరకాల కామెంట్లు చేశారు. పోస్టుల్లో 10 వేల అక్షరాలకు పొడిగించడంపై ఓ యూజర్‌ 'యూ ఆర్‌ ఎ క్రేజ్‌ మాన్‌' అని కామెంట్‌ చేయగా.. మరొక యూజర్‌ 'వావ్‌ ఇది నిజంగా శుభవార్త' అని కామెంట్‌ చేశారు.
కాగా, మైక్రో బ్లాగింగ్‌ పోస్టుల్లోని అక్షరాలను 4 వేలకు పొడిగిస్తూ గత నెలలోనే ట్విటర్‌ కంపెనీ వెల్లడించింది. అయితే ఈ అవకాశం బ్లూ టిక్‌ సబ్‌స్క్రైబర్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. సబ్‌స్క్రైబర్లు కానివారికి ట్వీట్లను చదివేందుకు, రీట్వీట్‌ చేసేందుకు కోట్‌ చేసే సదుపాయం మాత్రమే ఉంటుంది. గతంలో ట్వీట్లకు 280 అక్షరాలకు మాత్రమే పరిమితి ఉంది. ఇప్పటికీ ఈ సదుపాయం సబ్‌స్క్రైబ్‌ కాని వారికి కూడా ఇది వర్తిస్తుంది. అయితే మైక్రోబ్లాగింగ్‌ పోస్ట్‌ల అక్షరాలను పెంచినప్పటికీ.. నిర్దిష్టమైన సమాచారం కోసం యూజర్లకు చార్జ్‌ చేసే అవకాశముందని కూడా మస్క్‌ వెల్లడించారు.