Jun 08,2023 06:22

ఎవడు నీవు?
మీ రెవరు?
నేనెవరైతే నీకెందుకు? రాజదండం గురించి నీకు విషయం తెలుసా..?
తెలియదు.
మరి తెలియకుండా ఎలా రాశావ్‌?
ఏమని?
ప్రజాస్వామ్యంలో రాజదండాలు ఎందుకని?
అవును. తప్పేముంది?
తప్పా..? తప్పున్నరా..? రాజుల్లేకుండానే పాలన వచ్చిందా..? కావాలంటే చరిత్ర చదువుకో... చేతిలో పెన్నుందీ... అచ్చేసేందుకు పత్రికలున్నాయీ... అంటే కుదరదు.
నా తప్పేంటో చెప్పకుండానే మీరు కోపగించుకుంటున్నారు.
రాజదండం ఏక పాలనకు శ్రేష్టం. ఏక్‌ భారత్‌ - శ్రేష్ట భారత్‌ సంభవించాలంటే పాలకుని చేతిలో ఆ పవిత్ర రాజదండం ఉండాల్సిందే...
ఎవరి చేతిలో?
ఇంకా ఎవరి చేతిలో అంటావేంటి? ప్రధాని మోడీగారి చేతిలో.
మన రాజ్యాంగం ఈ విషయం చెప్పలేదే..?
అంబేద్కర్‌కు ఏం తెలుసు? హిందూ రాజ్యాంగం ఔన్నత్యం గురించి. హ...హ... హ... అసలు అప్పటికి అంబేద్కరే పుట్టలేదు. వేల సంవత్సరాల హిందూ పాలన సంప్రదాయ పరంపర ఇది. పాలన మార్పిడి చిహ్నం రాజదండం. ఆ నెహ్రూ అప్పుడు పక్కన పెడితే... ఇప్పుడు వెతికి తెచ్చి, యజ్ఞయాగాది క్రతువులు చేసి, వేద మంత్రోచ్ఛారణ చేసి స్వీకరిస్తే.... మీబోటివాళ్ళు తెగ బాధపడిపోతున్నారు. మిడి మిడి జ్ఞానంతో నానాయాగి చేస్తున్నారు.
మోడీ బ్రహ్మచారి కాదు. వివాహితుడు. నేను సీనియర్‌ ఎన్టీఆర్‌ - అంజలీదేవి 'లవకుశ' సినిమా చూశాను. ఒకవేళ భార్య రాలేకపోతే ఆమె ప్రతిమతో కలసి యజ్ఞం చేయాలి కదా... మోడీ గారు అటు బ్రహ్మచారి గాక, ఇటు సంసారిగాక, వైధవ్యుడు కాని వానితో పూజలు, క్రతువులు చేయించి రాజదండం ప్రతిష్టించడం హిందూ బ్రాహ్మణ్య ధర్మశాస్త్రాల్లో ఉన్నదా..?
సినిమాలు వేరు. శాస్త్రాలు వేరు. రెండింటినీ కలగాపులగం చేస్తావేమిటి?
నేనూ అనేది అదేనండి. మీ మోడీ గారేగా పనిగట్టుకుని కేరళ స్టోరీ, కాశ్మీర్‌ ఫైల్స్‌ చూడమని ప్రజలకు ఉద్భోదించారు. ఇక అసలు విషయానికి వస్తాను. ప్రజాస్వామ్యంలో ప్రజలేకదా పాలకుడిని చేస్తారు. దేవుడు కాదు కదా? ఒకవేళ దేవుడు చేస్తాడని అనుకుంటే ఆ దేవుడు కూడా ప్రజలే అవుతారు. కాదంటారా..?
నాస్తికుడిలా మాట్లాడుతున్నావ్‌.
అంతా దేవుడే చేస్తాడు అనుకుంటే మీరెందుకు ఓట్లు అడుక్కుంటున్నారు. మోడీ గారు మొన్న కర్ణాటక ఎన్నికల్లో అంత హడావుడి ఎందుకు చేశారు చెప్మా...
నీదంతా వితండవాదం. కుసంస్కారివి నీవు.
ఎవరిది వితండవాదమో తెలుస్తూనే ఉన్నది. పరిచయం లేకపోయినా ఫోను చేసి భయపెట్టే ధోరణిలో ఏకవచన సంభోదం చేయడంలోనే ఎవరు కుసంస్కారులో అర్థమవుతున్నది.
ఛ... టైమ్‌ వేస్ట్‌... (ఫోన్‌ కట్‌)
అవును టైమ్‌ వేస్టే... (కట్‌)
(అర్థం పర్థం లేని వెర్రివాగుడు వలన కాలహరణం అని తెలిసినా ఒక్కోసారి ఇలా జరుగుతున్నది మరి).

- కె. శాంతారావు,
సెల్‌ : 9959745723