
ప్రజాశక్తి - ఎస్‌వియు క్యాంపస్ (తిరుపతి) : రాష్ట్రంలోని గనుల టెండర్లను పత్రికల ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి, ఓపెన్ టెండర్ పిలిచి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, దానికి సంబంధించిన పూర్తిస్థాయి లెక్కలన్నీ పత్రిక ముఖంగా వెల్లడించామని రాష్ట్ర భూగర్భ, గనుల మంత్రిత్వ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మైనింగ్‌పైన చేస్తున్న ఆరోపణలను చంద్రబాబు మానుకోవాలని, ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చి అవినీతి అక్రమాలకు తెరలేపిన చరిత్ర టిడిపిదని విమర్శించారు. తాము పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఇసుక పాలసీని తీసుకువచ్చామన్నారు. 14 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రాజెక్టును కూడా చంద్రబాబు పరిపాలనలో పూర్తిచేసిన దాఖలాలు లేవు అని విమర్శించారు. ఇసుక టెండర్లలో చంద్రబాబు పాల్గొని ఉంటే కాంట్రాక్టర్‌గా ఆయనకే అవకాశం వచ్చి ఉండేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అల్టిమేటం ఇస్తే.. లేని పోని వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని, 2018-19 లో టిడిపి హయాంలో 60 లక్షలు దొంగ ఓట్లు చేర్చారని, వాటిని తొలగించే పక్రియ చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎం.నారాయణస్వామి, హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్, పోకల అశోక్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.