
- అక్రమాలు జరగకుండా విజిలెన్స్‌కు అధికారాలు
- సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 305 గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లకే జగనన్న భూ హక్కు - భూరక్ష పథకం కోసం వినియోగించే సర్వే రాళ్ల కోసం ఆర్డర్లు ఇస్తున్నామని గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. సచివాలయంలో శనివారం గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. అక్టోబరు 15 నాటికి 25.42 లక్షల సర్వే రాళ్లను అందించాల్సి ఉందని, తొలి దశలో మే 23లోగా 25.80 లక్షల రాళ్లను అందించారని, రెండో విడతలో 26.15 లక్షల సర్వే రాళ్లను జులై వరకు సరఫరా చేసినట్లు మంత్రి తెలిపారు. మూడో దశలో భాగంగా రెండు వేల గ్రామాలకు గానూ 25.42 లక్షల సర్వే రాళ్లను అందించనున్నట్లు పేర్కొన్నారు. తొలిదశలో 653 గ్రామాలకు గానూ 7.3 లక్షల సర్వే రాళ్లు, తుది దశలో 1,347 గ్రామాలకు గానూ 17.42 లక్షల రాళ్లు అందించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 44.03 లక్షల సర్వే రాళ్లను సరఫరా చేశామని, ఇందుకు గానూ రూ.1153.2 కోట్లు సరఫరాదారులకు చెల్లించినట్లు మంత్రి వెల్లడించారు. ఫ్యాక్టరీలకు బదులు బయట నుంచి ట్రేడర్లు సర్వే స్టోన్స్ సరఫరా చేస్తున్నారని, తక్కువ రేటుకు ఫ్యాక్టరీల నుంచి కొనుగోలు చేసి ఎపిఎండిసికి సరఫరా చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఫ్యాక్టరీలకు నష్టం జరుగుతోందని, ఈ పద్ధతిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీల్లో సిద్ధంగా ఉన్న సర్వేరాళ్లను గనులశాఖకు చెందిన ఎడి, డిడిలు పరిశీలించి రికార్డు చేస్తారని, వాటి ఆధారంగా అన్ని ఫ్యాక్టరీలకు సమానంగా స్టోన్స్‌కు ఆర్డర్లు ఇస్తామన్నారు. ఇందులో ఎటువంటి అక్రమాలు జరగకుండా విజిలెన్స్ అధికారులకు కూడా అధికారాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎడి, డిడి స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా సర్వే రాళ్లు సప్లై చేస్తే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమీక్షా సమవేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మైన్స్) గోపాలకృష్ణ ద్వివేది, డిఎంజి విజి వెంకటరెడ్డి, గ్రానైట్ యజమానులు పాల్గొన్నారు.