
- పత్తికొండలో 20 కేజీల బాక్స్ రూ.50
ప్రజాశక్తి- తుగ్గలి (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా పత్తికొండ టమాటా మార్కెట్‌లో గురువారం 20 కేజీల టమాటా బాక్స్ ధర రూ.50 మాత్రమే పలికింది. అంటే, కిలో టమాటాకు రూ.2.50కు మాత్రమే ధర లభించింది. దీంతో, కనీసం ఆటో కిరాయి కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికొండ నియోజకవర్గ పరిధిలో గతేడాది సుమారు 6,652 ఎకరాల్లో టమాటాను సాగు చేశారు. ఈ ఏడాది 2,929 ఎకరాల్లో మాత్రమే ఈ పంట సాగులో ఉంది. అయినా, రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా రైతులు ఆటోల్లో టమాటాను పత్తికొండ మార్కెట్‌కు తెచ్చి అమ్ముతుంటారు. వర్షాలు కురుస్తుండడంతో రవాణా సమస్యలు వస్తాయనే కారణంతో టమాటా కొనుగోలుకు వ్యాపారులు మొగ్గు చూపడం లేదని, అందుకే ధర పడిపోయిందని అధికారులు చెప్తున్నారు. పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఉంటే ధర ఇంతగా పడిపోయి ఉండేది కాదని రైతులు అంటున్నారు. ఎకరా విస్తీర్ణంలో టమాటా సాగుకు రూ.50 వేల వరకు ఖర్చవుతోందని చెప్తున్నారు. జులై, ఆగస్టు టమాటాకు మంచి ధర పలికింది. ఒక దశలో కిలో రూ.200 వరకూ ధర పలికింది. ఇప్పుడు ధర పడిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించి టమాటా ప్రాసెస్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
తీవ్ర నష్టం
రాజన్న, టమాటా రైతు, హంప గ్రామం
మూడు ఎకరాల్లో టమాటా సాగు చేశాను. ఇప్పటికే రూ.50 వేలు వరకూ పెట్టుబడి పెట్టాను. తగిన ధర వస్తుందని ఎంతో ఆశ పడ్డాను. ఇప్పుడు ధర పూర్తిగా పడిపోవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. తీవ్రంగా నష్టపోతున్నాను.
ఆటో ఛార్జీలూ రావడం లేదు
శ్రీనివాసులు, టమాటా రైతు, దూదెకొండ
నాకున్న ఐదు ఎకరాల్లో ప్రస్తుతం రెండు ఎకరాల్లో టమాటా వేశాను. ప్రస్తుతం ధర పడిపోవడంతో ఆటోలు ఛార్జీలు కూడా రావడం లేదు. 20 కిలోల బాక్స్‌కు రూ.50 మాత్రమే అమ్ముడవుతోంది.
అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు
సత్తార్, టమాటా రైతు, మద్దికెర
4.5 ఎకరాల్లో టమాటా సాగు చేశాను. అప్పులు చేసి లక్షల్లో పెట్టుబడి పెట్టాను. ధర పడిపోవడంతో అప్పులెలా తీర్చాలో అర్థం కావడం లేదు. టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలి. టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి.