గౌహతి : రాష్ట్రంలో కూరగాయల ధరలు పెరగడానికి మియా ముస్లిం వ్యాపారులే కారణమంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూరగాయలు ఎక్కువగా విక్రయించేది మియా ముస్లింలేనని అంటూ ఒకవేళ అస్సాం ప్రజలు వాటిని అమ్మితే వారు తమ ప్రజల నుండి ఎక్కువ ధరలు వసూలు చేయరని ఆయన చెప్పుకొచ్చారు. 'గ్రామీణ ప్రాంతాలలో రైతులు విక్రయించే కూరగాయల ధరలు ఎక్కువగా లేవు. అయితే అవే కూరగాయలను గ్రామాల నుండి కొనుగోలు చేసి గౌహతికి తీసుకొచ్చి అమ్మితే ధరలు పెరిగిపోతున్నాయి. కూరగాయలను అధిక ధరలకు అమ్మే వారు ఎవరు? వారు మియా వ్యాపారులు. వారే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు' అని తెలిపారు. తూర్పు బెంగాల్ మూలాలు ఉన్న ముస్లింలను మియా ముస్లింలు అని పిలుస్తారు. అస్సాం ప్రజల నుండి వారు ఎక్కువ రేటు వసూలు చేస్తున్నారని, గౌహతిలో స్థానిక కూరగాయల మార్కెట్లపై మియాలు పెత్తనం చెలాయిస్తున్నారని బిశ్వశర్మ ఆరోపించారు.
బిశ్వశర్మ వ్యాఖ్యలపై ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. 'ఇలాంటి వారు తమ ఇంటిలో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టకపోయినా మియాలే కారణమని నిందలు వేస్తుంటారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నెపం మోపుతారు' అని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ఆయన విమర్శలు సంధిస్తూ ప్రధానికి, విదేశీ ముస్లింలకు మధ్య గాఢమైన స్నేహం ఉన్నదని అంటూ వారిని అడిగి టమాటాలు, బంగాళదుంపలు వంటి కూరగాయలను తెప్పించుకోవాలని హితవు పలికారు. బిశ్వశర్మ వ్యాఖ్యలపై ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎఐయుడిఎఫ్‌్) అధ్యక్షుడు, ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముస్లింలు, అస్సాం ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బిశ్వశర్మ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.










