Sep 16,2023 22:33
  • నేడు భారత్‌×శ్రీలంక జట్ల మధ్య టైటిల్‌ పోరు
  • అక్షర్‌ స్థానంలో సుందర్‌
  • మధ్యాహ్నం 3.00గం||ల నుంచి

కొలంబో: 16వ ఆసియాకప్‌ టైటిల్‌కు భారత్‌-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. కొలంబోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్లో లంక జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు భారతజట్టు అత్యధికసార్లు టైటిళ్లు నెగ్గిన ఉత్సాహంలో మైదానంలో అడుగిడనుంది. ఆసియా కప్‌లో ఇరుజట్లూ ఇప్పటివరకు 22సార్లు తలపడగా.. చెరో పదకొండేసి మ్యాచుల్లో విజయం సాధించాయి. సూపర్‌-4లో లంకపై భారతజట్టు ఘన విజయం సాధిస్తే.. పాకిస్తాన్‌పై సంచలనం నమోదుచేసి శ్రీలంక జట్టు ఫైనల్లోకి దూసుకొచ్చింది. ఇక ఆసియా కప్‌ ఫైనల్లోకి శ్రీలంక జట్టు 13సార్లు, భారత 11సార్లు చేరాయి. అయితే భారతజట్టు ఏడుసార్లు విజేతగా నిలవగా.. శ్రీలంక మాత్రం ఆరుసార్లు మాత్రమే టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జరిగే ఫైనల్‌ రసవత్తరంగా సాగడం ఖాయం.
డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన శ్రీలంక జట్టు సూపర్‌-4లో భారత్‌ చేతిలో ఓడినా.. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లపై గెలిచింది. మరోవైపు భారతజట్టు పటిష్ట పాకిస్తాన్‌, శ్రీలంకలపై గెలిచి... పసికూన బంగ్లాదేశ్‌ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ క్రమంలో టీమిండియాలో ఒక మార్పు చోటు చేసుకుంది! ఫైనల్లో ఇరుజట్లకు ఎడమచేతి స్పిన్నర్లు కీలకంగా మారనున్నారు. ముఖ్యంగా లంక స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలాగే రూపంలో భారత్‌కు ప్రమాదం పొంచి ఉంది. ఈ యంగ్‌స్టర్‌ సూపర్‌-4లో ఇండియా టాపార్డర్‌ను కూల్చాడు. అదేమ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ కూడా నాలుగు కీలక వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. భారత్‌, శ్రీలంక మధ్య ఇది ఎనిమిదో ఆసియా కప్‌ ఫైనల్‌.శ్రీలంక స్పిన్నర్‌ తీక్షణ గాయం కారణంగా ఫైనల్లో ఆడడం కష్టమే. ఇక బంగ్లాదేశ్‌తో సూపర్‌-4 మ్యాచ్‌ సందర్భంగా అక్షర్‌ పటేల్‌ గాయపడ్డాడు. అతడు ఫైనల్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

వర్షం ముప్పు... రిజర్వ్‌ డేకు చాన్స్‌..!

ఫైనల్‌కు వాన గండం పొంచి ఉన్నట్లు కొలంబో వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. దాంతో, మ్యాచ్‌ వర్షార్ఫణం అవుతుందా? రిజర్డ్‌ డేకు కేటాయిస్తారా? అనే సందేహం అందరిలో నెలకొంది. ఒకవేళ వర్షం పడితే కనీసం 20 ఓవర్ల మ్యాచ్‌ ఆడిస్తారు. ఒకవేళ అదీ సాధ్యం రిజర్వ్‌ డే(సెప్టెంబర్‌ 18)న యథావిధిగా మ్యాచ్‌ జరుగుతుంది. ఆ రోజూ వరుణుడు అడ్డుపడితే ఇరుజట్లను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.
జట్లు(అంచనా)..
భారత్‌
: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌(వికెట్‌ కీపర్‌), శుభ్‌మన్‌, కోహ్లి, ఇషాన్‌, హార్దిక్‌, జడేజా, బుమ్రా, కుల్దీప్‌, సిరాజ్‌, సుందర్‌/శ్రేయస్‌.
శ్రీలంక: దసున్‌ శనక(కెప్టెన్‌), కుశాల్‌ మెండీస్‌(వికెట్‌ కీపర్‌), నిస్సంక, కుశాల్‌ పెరీరా, సమరవిక్రమ, అసలంక, ధనుంజయ, వెల్లలగె, మధుశన్‌, పథీరన, రజిత/కరుణరత్నే.