Sep 24,2022 08:21

విజయవాడ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం చేపట్టిన ' దేశ రక్షణ భేరి ' ప్రచారంలో భాగంగా... శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడలో జరిగే బహిరంగ సభకు జింఖానా మైదానం ముస్తాబైంది.

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొనే ఈ బహిరంగ సభకు నగరంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. సభ జరిగే జింఖానా మైదానంలో వేదికతోపాటు దాని పరిసర ప్రాంతాలను అరుణపతాకాలు, జెండాలు, స్వాగత బ్యానర్లతో అలంకరించారు. కారల్‌మార్క్స్‌ రోడ్డు, రైల్వే స్టేషన్‌, జిఎస్‌ రాజు రోడ్డు, జింఖానా గ్రౌండ్‌ పరిసర ప్రాంతాలు, ప్రెస్‌క్లబ్‌, లెనిన్‌ సెంటర్‌, హోటల్‌ ఐలాపురం సెంటర్‌, అలంకార్‌ సెంటర్‌, రామాటాకీస్‌, జింఖానా గ్రౌండ్‌, ఏలూరు లాకులు, తదితర ప్రాంతాల్లో 300లకు పైగా స్వాగత బ్యానర్లతో ముస్తాబు చేశారు. వందల సంఖ్యలో జెండాలు, తోరణాలతో అలరకరించడంతో జింఖానా గ్రౌండ్‌ పరిసర ప్రాంతాలు మొత్తం ఎరుపెక్కాయి. 40 అడుగుల వెడల్పు, ఐదు అడుగుల ఎత్తు, 20 అడుగుల భారీ ఫ్లెక్సీతో ప్రత్యేక ఆకర్షణగా వేదిక సిద్ధమయ్యింది. 50 మందికి పైగా నేతలు, కార్యకర్తలు మూడు రోజులు ఏర్పాట్లకు అవిశ్రాంతంగా కృషి చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేదికపై 100 మంది ప్రజా నాట్యమండలి కళాకారులు వివిధ కళారూపాలు ప్రదర్శించనున్నారు. వేలాదిగా తరలివచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ, మంచినీళ్ళు ఏర్పాటు చేశారు. ఎన్‌టిఆర్‌, కృష్ణా జిల్లా, గుంటూరు, పల్నాడు, ఏలూరు, భీమవరం, జిల్లాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.