Nov 20,2023 09:58
  • కరువు దెబ్బతో నెల ఆలస్యంగా ప్రారంభం
  • 1.40 లక్షల ఎకరాలకుగానూ 47,599 ఎకరాల్లోనే సాగు
  • బోర్డు అనుమతిచ్చిన 142 మిలియన్‌ కిలోల పంట అనుమానమే !

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : పొగాకు సాగుపై కరువు దెబ్బ తీవ్రంగా ఉంది. వర్షాభావంతో ఖరీఫ్‌ పంటలన్నీ చేజారాయి. అరకొరగానే చేతికందే పరిస్థితి కనిపిస్తోంది. రబీలో కీలకమైన వాణిజ్య పంటగా ఉన్న పొగాకు సాగుకూ ఇప్పుడు వర్షాభావం సవాలుగా మారింది. 1.40 లక్షల ఎకరాలకుగానూ 47,599 ఎకరాల్లోనే ప్రస్తుతం నాట్లు పడ్డాయి. ఇప్పటికే నాట్లు నెల రోజులు ఆలస్యమయ్యాయి. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికి కొండపి, టంగుటూరు ప్రాంతాల్లో నాట్లు వేస్తున్నారు. పశ్చిమాన పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో ముందుగానే వేస్తారు. ఇప్పుడు అక్కడ అదును దాటిపోయింది. నాట్లు పడలేదు. పంట సాగును తాము విరమించకున్నట్టేనని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా చుక్క నీరు లేదు. వర్షాలు పడిన ప్రాంతాల్లో భూమి కొంత పదునైంది. ఇప్పటికే దున్నిన పొలాల్లో ట్యాంకర్లతో నీటిని తెచ్చి నాట్లు వేస్తున్నారు. వాస్తవానికి ఈ సమయానికి 80 శాతం వరకూ నాట్లు పూర్తి కావాలి. జనవరిలో క్యూరింగ్‌కు రావాలి. పశ్చిమ ప్రాంతంలో ఈ సమయానికి తోటలు పెరిగి పచ్చాకు కూడా తీసేవాళ్లు. ఇప్పుడు అక్కడ సాగుపై ఆశల్లేవు. ప్రత్యామ్నాయం ఏమిటనే దానిపై ఆలోచిస్తున్నారు. వారం రోజుల క్రితం కొద్దిపాటి జల్లులు పడిన ప్రాంతాల్లో ఇప్పుడు నాట్లు వేస్తున్నారు. గతేడాది ఇదే సమయానికి నాట్లు పెద్దగా పడకపోయినా ఈ నెలలో వర్షాలు కురిశాయి. దీంతో, నవంబరు చివరి నాటికి నాట్లు ముమ్మరమయ్యాయి. ప్రస్తుతం వర్షాల జాడ లేదు. కాలువలు, చెరువులు ఎక్కడా నీరు లేదు. నాట్లు నత్తనడకన సాగుతున్నాయి. పొగాకు సాగుకు ఎకరాకు రూ.20 వేలు వరకూ ఖర్చవుతుంది. ట్యాంకర్లతో నీటిని తెచ్చి నాట్లు వేయాల్సి వస్తుండడంతో రూ.2 వేల వరకూ అదనంగా ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు. పొగాకు నారు మూట రూ.2 వేలు అమ్ముతోంది. నాట్లు ఆలస్యమైనందున నారుమడులు కూడా దెబ్బతిన్నాయి.
 

                                                        ఈ ఏడాది 142 మిలియన్‌ కిలోలకు అనుమతి

పొగాకు బోర్డు రాష్ట్రంలో ఈ ఏడాది 142 మిలియన్‌ కిలోల పంటకు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఇటీవల జిల్లాను సందర్శించిన పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ వెల్లడించారు. రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పొగాకు రైతులకు అన్ని విధాలా బోర్డు నుంచి సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. గతేడాది పొగాకు ఎగుమతుల ద్వారా రూ.950 కోట్లు విదేశీ మారకద్రవ్యం వచ్చిందని, ఈ ఏడాది రూ.1200 కోట్ల నుంచి రూ.1400 కోట్ల వరకూ రావచ్చనే అంచనాల్లో మిగతా 2లో ఉన్నామని తెలిపారు. కరోనా వల్ల అనేక దేశాల్లో పొగాకు పంట తగ్గింది. దీంతో, ఎగుమతులు పెరిగాయి. ఈ ఏడాది పంట అనుమతించిన మేరకు కూడా పండుతుందా? లేదా? అనేది సందిగ్ధంగానే మారింది. గతేడాది గరిష్ట ధర కిలోకు రూ.275 వరకూ లభించింది. గతంలో ఉన్న సీలింగ్‌ వ్యవహారం కూడా తొలగిపోయింది. వేలం సజావుగా నడిచింది. రైతులకు సగటు ధర కిలోకు రూ.230 వచ్చింది. దీంతో, పొగాకు రైతులు ఈ ఏడాది ఆశాజనకంగా ఉంటుందని భావించారు. అయితే, వర్షాభావం వారి ఆశలపై నీళ్లుజల్లింది.
 

                                                    సాగర్‌ జలాలు లేకపోవడంతో ఆరుతడికీ గండమే !

ప్రకాశం రీజియన్‌ పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 80 మిలియన్‌ కిలోల పొగాకు పండుతుంది. సాగర్‌ జలాలతోనే ఆరుతడి వేస్తారు. ఈ ఏడాది సాగర్‌ రిజర్వాయర్‌లో నీరు లేదు. మాగాణితోపాటు ఆరుతడికీ నీరివ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
            గుండ్లకమ్మలోనూ నీరు లేదు. దీంతో, చాలామంది రైతులు పొగాకు సాగును వదిలేశారు. ఇంజన్లతోనూ, ట్యాంకర్లతోనూ నీటిని తెచ్చి తోటలను తడపాలన్నా సాధ్యం కాని పరిస్థితులున్నాయి. కనిగిరి వేలం కేంద్రం పరిధిలో ఇప్పటికే పొగాకు సాగును వదిలేశారు. ఈ నెలలో వర్షాలు కురిసినా ఆరుతడికి నీరు ఎలా? అనే ఆందోళనలో రైతులు ఉన్నారు.