- ఎకరానికి 26 క్వింటాళ్లే కొనుగోలు
- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సిరివాడ గ్రామానికి చెందిన వై.కొండలరావు రెండు ఎకరాల్లో వరి సాగు చేశారు. 58.5 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. ఎకరానికి 26 చొప్పున 52 క్వింటాళ్లు మాత్రమే రైతు భరోసా కేంద్రం (ఆర్‌బికె) ద్వారా అమ్ముకోగలిగారు. మిగిలిన 6.5 క్వింటాళ్ల ధాన్యం రైతు వద్ద మిగిలిపోయింది. ఆరుగొలను గ్రామానికి చెందిన బి.చలమయ్య మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. 83.25 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. 78 క్వింటాళ్లు మాత్రమే ఆర్‌బికె ద్వారా అమ్ముకోగలిగారు. ఈ ఇద్దరు రైతుల పరిస్థితే కాదు... కృష్ణా జిల్లాలో పంట నూర్పిడి పూర్తయిన అన్ని ప్రాంతాల్లోనూ రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 26 క్వింటాళ్లు మించి కొనకూడదంటూ ఆర్‌బికె సిబ్బందిపై ఆంక్షలు పెట్టడమే దీనికి కారణం. పూర్తి స్థాయిలో సేకరించాలి వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది ధాన్యం దిగుబడులు పెరిగాయి. ఎకరానికి 26 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆర్‌బికెల్లో చెపుతున్నారు. రైౖతులు అమ్మదల్చుకున్న ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించాలి.
-పంచకర్ల రంగారావు, ఎపి కౌలు రైతు సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి
ప్రభుత్వానికి నివేదిక పంపాం ఎకరానికి 26 క్వింటాళ్లు రైతుల నుంచి సేకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ఏడాది ధాన్యం దిగుబడులు పెరిగాయి. ఎకరానికి 30 క్వింటాళ్లు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. సమస్యపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది.
- ఎ.శ్రీధర్, పౌర సరఫరాల సంస్థ కృష్ణా జిల్లా మేనేజర్ ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి
రైతుల నుండి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. రైతుల నుండి ఎకరాకు 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎకరాకు దాదాపు 30 క్వింటాళ్ల దిగుబడి రావడంతో ప్రభుత్వ నిర్ణయం రైతులకు పిడుగుపాటుగా మారింది. గత ఏడాది కూడా రాష్ట్ర ప్రఝభుత్వం ఎకరాకు 30 క్వింట్ళాను రైతుల నుండి కొనుగోలు చేసింది. దీంతో ఈ ఏడాది కూడా ఆ మేరకు కొనుగోళ్లు ఖచ్చితంగా ఉంటాయని రైతులు భావించారు. ముఖ్యమంత్రి పదేపదే నిర్వహించిన సమావేశాల్లో సైతం ఆర్‌బికెల్లోనే ధాన్యం కొనుగోళ్లు జరగాలని, దళారులు లేకుండా చూడాలని ఆదేశించడం కూడా రైతుల్లో నమ్మకాన్ని పెంచింది. అయితే, వాస్తవంగా కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి ఆపరిస్థితి మారింది. పైనుండి వచ్చిన ఆదేశాల ప్రకారం 26 క్వింటాళ్లనే కొనుగోలు చేస్తామని, మిగిలిన వాటిని బయట అమ్ముకోవాలని సిబ్బంది చెబుతున్నారు. దీంతో మిగిలిన ధాన్యాన్ని అనివార్యంగా ప్రైవేటు వ్యాపారులకు, దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది వాతావరణం కూడా బావుండటంతో ధాన్యం దిగుబడి గణనీయంగా వచ్చిందని, అయితే, ఆ మేరకు కొనుగోళ్లు లేకపోవడంతో నష్టపోవాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. క్వింటాలుకు సాధారణ రకానికి రూ.2,040, 'ఎ' గ్రేడ్ రకానికి రూ.2,060 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. ఆర్‌బికెల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తోంది. ఆర్‌బికెలకు అమ్మగా మిగిలిన ధాన్యాన్ని తగ్గించి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో 'ఎ' గ్రేడ్ రకం ధాన్యాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. రైతులు వద్ద మిగిలిన ఈ రకం ధాన్యాన్ని దళారులు రూ.300 వరకు తగ్గించి రూ.1,760కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో, రైతులు ఆ మేరకు నష్టపోతున్నారు. జిల్లాలో ఈ సీజన్లో 3,91,135 ఎకరాల్లో వరి సాగైంది. పలు ప్రాంతాల్లో కోతలు మొదలయ్యాయి. ఇ క్రాప్‌లో నమోదైన విస్తీర్ణానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని మాత్రమే ఆర్‌బికెల ద్వారా కొనుగోలు జరుగుతోంది. పౌర సరఫరాల సంస్థ గతేడాది జిల్లాలో 4.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈ ఏడాది 4.10 లక్షలకు లక్ష్యాన్ని ప్రభుత్వం పరిమితం చేసింది. ఎరువులు, పురుగుల మందులు, ఇతర ఖర్చులు పెరుగుతుండ డంతో సాగు ఖర్చులు అధికమవుతున్నాయి.










