Feb 05,2023 06:22

కర్ణాటకలో నిర్మిస్తున్న అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయించడం రాయలసీమ నీటి వనరులకు తీవ్ర ప్రమాదంగా మారింది. కర్ణాటకలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రెండు రాష్ట్రాల్లోని కరువు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి బిజెపి సిద్ధమైంది. మతాల మధ్య, ప్రాంతాల మధ్య నిరంతరం ఘర్షణలు రాజేసి అందులోంచి అధికార పీఠాన్ని దక్కించుకోవడమే బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విధానం. నిత్యం కరువులకు గురవుతున్న రాయలసీమ జిల్లా ప్రజలకు కొంత మేరకైనా సాగు, తాగు నీరు అందించే తుంగభద్ర ప్రాజెక్టు పైన నిర్మించే 'అప్పర్‌ భద్ర' వల్ల రాయలసీమ ఎడారిగా మారనున్నది. కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బిజెపి దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకుంది. రానున్న ఎన్నికల్లో గెలవడం కోసం రాయలసీమను బలిపెట్టడానికి సిద్ధమై అప్పర్‌ భద్ర ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నది. రాయలసీమ డిక్లరేషన్‌ అంటూ హడావుడి చేసిన ఆంధ్ర బిజెపి నాయకులు మౌన ముద్రలో వున్నారు. మన రాష్ట్ర నీటి వాటాను, ప్రభుత్వ అభ్యంతరాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా 'అప్పర్‌ భద్ర'కు అనుమతులు, నిధులు ఇస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ నిరంకుశ చర్యలపై పోరాడాల్సిన వైసిపి, టిడిపి తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం తాపత్రయ పడుతున్నాయి. 'ప్రశ్నిస్తా' అంటూ ప్రసంగించే జనసేన నాయకులు 'అప్పర్‌ భద్ర' పై ఎందుకని ప్రశ్నించరు? రాయలసీమ ఏమైతేనేమి! బిజెపితో దోస్తీ చెడకుండా వుంటే మహాభాగ్యం అని ఈ పార్టీలు అనుకుంటున్నాయా?

  • తుంగభద్ర డ్యామ్‌ నిర్మాణం

అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు తుంగభద్ర నుండి వచ్చే నీరే ప్రధాన సాగునీటి వనరు. స్వాతంత్య్రానికి పూర్వం రాయలసీమ ప్రాంతాన్ని నైజాం నవాబులు బ్రిటీష్‌ వారికి దత్తత ఇచ్చారు. అందుకే ఈ ప్రాంతాన్ని దత్తమండలాలు అంటారు. ఈ దత్త మండలాలను బ్రిటీష్‌ అధికారులు పీల్చి పిప్పి చేశారు. అందువల్ల నిత్యం కరువు కాటకాలతో లక్షల మంది ఆకలి చావులకు గురయ్యారు. చరిత్రలో ప్రసిద్ధికెక్కిన డొక్కల కరువు తర్వాత రాయలనాటి చెరువుల మరమ్మతులతో పాటు, కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. అందులో భాగంగా తుంగభద్రా నది మీద కర్ణాటక లోని బళ్ళారి జిల్లా హోస్పెట్‌ వద్ద 1943లో తుంగభద్ర డ్యామ్‌ నిర్మాణం చేపట్టి 1953లో పూర్తిచేశారు. ఇది కర్ణాటక-ఆంధ్ర రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా నిర్మించబడింది. డ్యామ్‌ నిర్మించిననాటికి నీటి నిల్వ సామర్థ్యం 133 టిఎంసీలు. పూడిక కారణంగా ప్రస్తుతం సుమారు 100 టిఎంసీల నిల్వ సామర్థ్యం మాత్రమే వుంది. ఆంధ్రప్రదేశ్‌కు 72 టిఎంసీలు, తెలంగాణకు 6.51 టిఎంసీలు, కర్ణాటకకు 151.49 టిఎంసీల నీటిని కేటాయించారు. ఈ కేటాయింపుల నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవాలంటే సంవత్సరానికి రెండు పర్యాయాలు డ్యామ్‌ నిండాలి. భద్రా నదిలో వచ్చే వరదల వల్ల అత్యధిక సంవత్సరాలు డ్యామ్‌ నిండుతుంది.

  • రాయలసీమకు ప్రధాన నీటి వనరు తుంగభద్ర డ్యామ్‌

ఆంధ్రప్రదేశ్‌ కు కేటాయించిన నీటిని తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలు, కె.సి.కెనాల్‌ ద్వారా వినియోగించుకుంటున్నాము. ఎగువ కాలువ కింద సాగు కావలసిన మొత్తం ఆయకట్టు సుమారు 3 లక్షల ఎకరాలు. అందులో దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాలోని మొత్తం 26,75,764 ఎకరాల సాగుభూమిలో కేవలం 1,45,236 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే ఏకైక వనరు ఇదే. జిల్లాలో నిరంతరంగా వస్తున్న కరువుల వల్ల ఈ సాగునీటి పథకం క్రమంగా తాగు నీటి పథకంగా మారిపోయింది. తుంగభద్ర నుండి వచ్చే నీటితో కర్నూలు జిల్లాలో 14,744 ఎకరాలు, కడప జిల్లాలో 1,40600 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. అయితే ఇప్పుడు మూడు జిల్లాలకు కలిపి లక్ష ఎకరాలకు కూడా నికర సాగు నీరు అందడంలేదు. మైలవరం ప్రాజెక్టు కింద కడప జిల్లాలో 68,749.934 ఎకరాలు, పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ కింద 50,810 ఎకరాలు, కెసి కెనాల్‌ కింద కడప జిల్లాలో 92,001 ఎకరాలు, కర్నూలు జిల్లాల్లో 1,73,627 ఎకరాలు, తుంగభద్ర దిగువ కాలువ కింద కర్నూలు జిల్లాలో 1.51లక్షల ఎకరాల ఆయకట్టు వుంది. ఈ ప్రాజెక్టులు, కాలువలన్నీ తుంగభద్ర డ్యామ్‌ పైన ఆధారపడినవే. డ్యామ్‌ పైభాగాన వున్న కర్ణాటక రైతులు ఇప్పటికే అదనపు నీటిని వినియోగించుకుంటూ కింది ప్రాంతాలకు కేటాయించిన నీరు అందే అవకాశం క్రమంగా తగ్గిపోతున్నది. అకాల వర్షాల వల్ల వచ్చిన వరద నీటిని నిల్వ చేసుకునేందుకు గాని, హెచ్‌ఎల్‌సి కాలువకు సమాంతర కాలువ నిర్మాణానికి గాని మన రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయలేదు.

  • ఎన్నికల లబ్ధి కోసం దిగువ ప్రాంతాలకు అన్యాయం

తుంగ, భద్ర నదుల ద్వారా వచ్చే నీటిని తుంగభద్ర డ్యామ్‌లో నిల్వ చేసి అక్కడి నుండి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాలకు దామాషా ప్రకారం పంపిణీ జరిగింది. కర్ణాటకలో ప్రస్తుతం భద్రావతి నది పై భాగాన కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో 'అప్పర్‌ భద్ర' మేజర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తుంగ, భద్ర నదుల నుండి నీటిని తోడుకోవడం ద్వారా కర్ణాటక లోని వెనుకబడిన చిత్రదుర్గ, చిక్‌మగళూరు, దావణగెరె, తుముకూరు జిల్లాల్లో దాదాపు 2,25,515 హెక్టార్లకు సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో నికరమైన నీటిని ఈ జిల్లాలకు అందించడం, భూగర్భ జలాలను అభివృద్ధి చేయడం, తాగునీటి కోసం 367 చేరువులను 50 శాతం సామర్థ్యంతో నింపడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలుగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 2018-19 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా రూ.21,473.67 కోట్లు. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించడం, కేంద్రం ఆమోదించడం జరిగింది. కృష్ణా బేసిన్‌లో భాగంగా వున్న తుంగభద్ర డ్యామ్‌పై దిగువనున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాలను, అభ్యంతరాలను ఏ మాత్రం పరిగణ లోకి తీసుకోలేదు. రెండు దశల్లో పూర్తి చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొదటి దశలో 17.4 టిఎంసీలు, రెండవ దశలో 29.9 టిఎంసీల నీటిని కర్ణాటక తుంగభద్ర డ్యామ్‌ లోకి రాకుండా తోడేసుకుంటుంది. ఆ మేరకు దిగువనున్న హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సి, పోతిరెడ్డిపాడు, రాజోలి బండ డైవర్షన్‌ స్కీమ్‌ కింద వున్న ఆయకట్టు పూర్తిగా నష్టపోతుందని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు పెట్టాయి. చట్టాల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఏమాత్రం గౌరవం లేని బిజెపి ఏకపక్షంగా 'అప్పర్‌ భద్ర' నిర్మాణానికి సిద్ధమైంది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కర్ణాటక లోని కరువు ప్రాంతాలను అభివృద్ధి చేయడం కంటే ఈ ప్రాజెక్టు గురించి నాలుగు జిల్లాల్లో ప్రచారం చేసుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి లబ్ధి పొందడమే ప్రధాన అంశంగా వుంది.

  • అభివృద్ధి కోసం కాదు, అధికారం కోసమే

కర్ణాటక అభివృద్ధి మీద బిజెపికి చిత్తశుద్ధే వుంటే గతంలో తాను అధికారంలో వున్నప్పుడు కాని, ప్రస్తుతం దొడ్డిదారిన అధికారాన్ని ఆక్రమించుకున్న ఈ మూడు సంవత్సరాల్లో కాని సాధించిన పురోగతి ఏమిటో రేపటి ఎన్నికల్లో ప్రజలకు వివరించుకోవాల్సి వస్తుంది. అధికారాన్ని అడ్డంపెట్టుకొని నిత్యం మత ఘర్షణలు, విద్యాలయాల్లో హిజాబ్‌, మాంస విక్రయ కేంద్రాల వద్ద హలాల్‌, మసీదుల ముందు అల్లర్ల లాంటి సమస్యలను రగిలిస్తూ తమ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ను బలపరచుకునేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలను ఆ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మతతత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడం కోసం క్రూరంగా హత్యలకు పాల్పడ్డారు. జర్నలిస్టు గౌరీ లంకేష్‌, కల్బుర్గి హత్య ఇందుకు నిదర్శనాలు. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌, ప్రసిద్ధ దళిత రచయిత దేవనూరు మహదేవ లాంటి వారిపై బెదరింపులు ఏ అభివృద్ధి సాధించడానికో కర్ణాటక ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సి వుంది. సాఫ్ట్‌వేర్‌ రాజధానిగా వున్న బెంగళూరులో వేలమంది యువతీ యువకులు ఆ రంగం నుండి తొలగింపులకు గురౌతుంటే బిజెపి ఎందుకు మాట్లాడడంలేదో రేపటి ఎన్నికల్లో యువత ప్రశ్నిస్తారు. బెంగళూరు మహానగరంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన లక్షల మంది వలస కార్మికులు బానిసలుగా ఏ హక్కులు, భద్రత లేకుండా జీవిస్తున్నారు. వీరి గురించి బిజెపి నాయకులు ఎన్నడూ మాట్లడరు. గతంలో కర్ణాటకలో బిజెపి అధికారంలో వున్నపుడు ఆ పార్టీలో వున్న బళ్ళారి గాలి సోదరులు మైనింగ్‌ సామ్రాట్‌లుగా మారి సహజ వనరులను ఎలా దోచుకున్నారో దేశ ప్రజలకు తెలుసు. భావోద్రేకాలు, సున్నితమైన మత, జీవన అంశాల పైనే ప్రజలు నిత్యం స్పందించరనే విషయం ఆర్‌ఎస్‌ఎస్‌కు బాగా తెలుసు. తాము రెచ్చగొట్టడం ద్వారా మతోన్మాద కార్యకలాపాలలో పాల్గొనే వారికి కూడా అన్నం కావాలి, ఆ అన్నం కావాలంటే పని కావాలి. అది లేనినాడు తమను రెచ్చగొట్టిన వారినే ఆ యువత ప్రశ్నించడం పెరుగుతుంది. ప్రస్తుతం ఆ దిశగా కర్ణాటకలో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. దీన్ని గమనించిన బిజెపి నేతలు 'అప్పర్‌ భద్ర' ప్రాజెక్టును ఎత్తుకున్నారు.
వైసిపి లోక్‌సభ, రాజ్యసభల్లో మూడో అతిపెద్ద పార్టీగా వుండడమే కాదు, రాష్ట్రంలో అత్యధికమంది ఎంఎల్‌ఏ లు వున్న బలమైన రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఈ పార్టీ రాష్ట్ర విభజన చట్టంలోని ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి సాధించలేకపోయింది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరానికి నిధులు ఇవ్వకుండా అనేక ఆటంకాలు సృష్టిస్తున్న కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పక్షాలను కలుపుకొని నిధులు సాధించిందిలేదు. ఆంధ్రుల హక్కుగా వున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించి తీరుతామనే బిజెపి అహంకారపూరిత ప్రకటనలను గట్టిగా ప్రతిఘటించిందిలేదు. ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయలసీమను శాశ్వత ఎడారిగా మార్చే బిజెపి కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమించడంలేదు. ఎంత తొందరగా గద్దెనెక్కుదామా అని ఎదురుచూస్తున్న టిడిపి... బిజెపి కుట్రల పట్ల మౌనంగా వుంటోంది. బిజెపి రోడ్‌మ్యాప్‌ కోసం ఎదురుచూసే జనసేన నేత బిజెపి పాచిన లడ్డుల్లో రుచుల కోసం తహతహ లాడుతున్నారు. కృష్ణ బేసిన్‌కే ప్రమాదంగా మారుతున్న బిజెపి వైఖరికి వ్యతిరేకంగా విశాల ఐక్యతతో రైతాంగం ఉద్యమించడం ద్వారానే నీటి హక్కులను కాపాడుకోగలం.

1

 

 

 

 

 

 

 

 వ్యాసకర్త: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వి. రాంభూపాల్‌