May 25,2023 06:30

భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్‌ అని రాజ్యాంగ పీఠిక చెస్తోంది. 'లౌకిక', 'సామ్యవాద' అన్న పదాలను 1976లో ఆమోదించిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో పొందుపర్చారు. ఈ పదాలను చేర్చటం ద్వారా ఆరంభంలో మన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం కాదేమో అన్న చర్చకు దారితీసింది. నేడు లౌకికతత్వం అన్న పదాన్ని దూషణగా భావిస్తున్న అతి కొద్దిమంది వ్యక్తం చేసే అభిప్రాయంగా దీన్ని కొట్టిపారేయొచ్చు. రాజ్యాంగ పరిషత్‌ భారత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు పీఠికలో లౌకికతత్వం అన్న పదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా రాజ్యాంగం దేశం ముందుంచిన ప్రాపంచిక దృక్పధం, ప్రయోగించిన భాష, అవగాహన, లౌకిక స్వభావం భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పాలి.1950 జనవరి 26 భారతదేశాన్ని లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన రాజ్యాంగం భారత చరిత్ర ప్రస్థానంలో ఓ చెప్పుకోదగ్గ మైలురాయి. రాజ్యాంగం ఆమోదించుకోనంత వరకూ మనుషులందరూ సమానులు కాదని, పుట్టుకను బట్టే మనుషులను చీల్చిన వారసత్వం గత మూడువేల ఏళ్ల వారసత్వం. దీన్నే సనాతన ధర్మ సాంప్రదాయం అని పిలుస్తారు. ఈ సాంప్రదాయం భారతదేశంలో అత్యంత క్రూరమైన అసమానతలకు, అణచివేతకు, అన్యాయమైన సమాజ నిర్మాణానికి పునాదులు వేసింది. విశాల జనబాహుళ్యం అంటరానివారని, సామాజికంగా నిమ్నస్థాయికి చెందినవారనీ ఈ సాంప్రదాయం చెస్తోంది. పవిత్ర గ్రంథాలుగా మనం చెప్పుకుంటున్నవి అన్ని రకాల అమానవీయ విలువలకు పట్టం కట్టాయి. ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే దేవుడు మానవులంతా సమానం కాదని స్వయంగా ప్రకటిస్తాడు. అటువంటి దేశంలో ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి భావనలను అందించిన గ్రంథం భారత రాజ్యాంగం. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే స్వతంత్ర భారత దేశం ఏ తరహా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే అంశాన్ని స్వాతంత్య్ర సేనానులు లోతుగా చర్చించారు. మంత్రిమండలి ద్వారా పరిపాలన సాగించే పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే మెరుగైన సాధనం అని నమ్మారు. ప్రజలకు ప్రత్యక్షంగా ప్రాతినిధ్యం వహించే పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుందని విశ్వసించారు. పార్లమెంట్‌ సవరించి ఆమోదించక ముందు అమల్లో ఉన్న హిందూ చట్టాలు పూర్తి తిరోగామి దృక్పధంతో కూడినవి. పారిశ్రామిక రంగానికి సంబంధించి, కార్మిక రంగానికి సంబంధించి, ఇతర అనేక ఉత్పాదక రంగాలకు సంబంధించి పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాలు, భారత ఆర్థిక వ్యవస్థను శిఖరాగ్రాన నిలబెట్టిన ప్రభుత్వ రంగం ఏర్పాటుకు సంబంధించిన చట్టాలు, విప్లవాలకేమీ తీసిపోవు. తొలి రోజుల్లో ఈ చట్టాలు ఆమోదించటాన్ని న్యాయస్థానాలు సవాలు చేశాయి. కానీ రాజ్యాంగ సవరణల ద్వారా ఈ సవాళ్లను పార్లమెంట్‌ అధిగమించింది. ప్రజాతంత్ర భారత నిర్మాణంలో భారత పార్లమెంట్‌ ఎదుర్కొన్న తొలితరం సవాళ్లు ఇవి. తొలినాళ్లల్లో విలువైన అభిప్రాయాల వ్యక్తీకరణకు కేంద్రంగా ఉన్న పార్లమెంట్‌...భారత రిపబ్లిక్‌ మూడు దశాబ్దాలు పూర్తి చేసుకునే నాటికి ఈ లక్షణాన్ని కోల్పోయింది.

  • పార్లమెంటరీ పద్ధతికే మొగ్గు

భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఎప్పుడైతే శక్తివంతమైన నాయకుడు అధికారానికొస్తాడో ఆయా సందర్భాల్లో పార్లమెంట్‌ బలహీనపడుతూ రావటం దురదృష్టకరమైన సందర్భం. శక్తివంతమైన నాయకుడికి ఎక్కడలేని ప్రాధాన్యత ఇవ్వటం అలవాటుగా మారిపోయింది. అధినేతల ముందు సాష్టాంగ ప్రమాణం చేసే వేదికగా చట్టసభలు మారిపోయాయి. 1975లో అమల్లోకి వచ్చిన అత్యవసర పరిస్థితి మన రాజకీయ వ్యవస్థ పని తీరును అర్థం చేసుకోవడానికి ఓ పెద్ద కొలమానంగా ఉపయోగపడుతుంది. రాజ్యంలో ఇమిడి ఉన్న నిరంకుశత్వ లక్షణాలను అత్యవసర పరిస్థతి తొలిసారిగా ప్రజలకు ప్రజాస్వామ్యానికి పరిచయం చేసింది. హక్కుల హననానికి పాల్పడిన రాజ్యం ముందు ప్రజల నిస్సహాయతను కూడా వెలుగులోకి తెచ్చింది. తన సొంత ప్రజలపై దాడికి రాజ్యం సిద్ధపడినప్పుడు ప్రజలను, ప్రజల హక్కులను కాపాడటంలో పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న బలహీనతలు, ఊగిసలాటను బట్టబయలు చేసింది. అధినేత తన గొంతకను మాత్రమే వినేలా పార్లమెంట్‌ గుంపు స్వరానికి వేదికైంది. వంద కోట్ల ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంటును కేవలం రబ్బరు స్టాంపుకు ఎలా పరిమితం చేయగలరో అత్యవసర పరిస్థితి నిరూపించింది. భారత పార్లమెంట్‌ ముందు నేటికీ ఈ సవాళ్లున్నాయి. ఇంకా చెప్పాలంటే అత్యవసర పరిస్థితి నాటి కంటే పదునైన సవాళ్లను పార్లమెంట్‌ ఎదుర్కొంటోంది. మన వ్యవస్థలో ప్రధానమంత్రికి వున్నంత నైతిక అధికారం మరెవ్వరికీ ఉండదు. సభాపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకులతో తన కార్యాలయంలోనే సమావేశాలు ఏర్పాటు చేయవచ్చు. అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను పరిష్కరించి ఏకాభిప్రాయ సాధన దిశగా చర్యలు తీసుకోవచ్చు. సంఖ్యాబలం ఉంది కాబట్టి ఏ చర్చ అయినా ఆమోదం పొందటమా లేక తిరస్కరించటమా అన్నది పాలకపక్షం చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి చర్చకు అంగీకరించవచ్చు. ప్రతిష్టంభన తొలగించవచ్చు. కానీ పాలకపక్షం అందుకు సిద్ధపడకపోవటమే ఆసక్తికరమైన అంశం. భారతీయ సమాజంలో నిరంకుశత్వ పోకడలు బాహాటంగా వ్యక్తమవుతున్న తరుణంలో పౌరస్వేచ్ఛపై ఉక్కుపాదం మోపటం కార్యనిర్వాహక వర్గానికి మరింత తేలికైన పనిగా మారింది. వెరసి నిరంకుశత్వ లక్షణాలు కలిగిన వాళ్ల చేతుల్లో అధికారం కేంద్రీకృతమయ్యేందుకు మార్గం తేలికైంది.

  • మతచాందసం, హక్కుల పై దాడి

గత 72 ఏళ్లుగా భారతదేశంలో జరుగుతున్న ప్రజాస్వామిక ప్రయోగాన్ని జాగ్రత్తగా గమనిస్తే రానురాను ప్రజాస్వామ్యం పల్చబడుతోందని నిర్ధారణ అవుతుంది. లౌకిక సమాజంలో లౌకిక సూత్రాల ఆధారంగానే ప్రజా సమీకరణ జరగాలి. దీనికి భిన్నంగా సాగే సమీకరణ అయినా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమే. ఈ మధ్యకాలంలో తీవ్ర జాతీయత, మతతత్వం ఆధారంగా ప్రజా సమీరణ జరుగుతోంది. ధార్మిక భావనల్లో కూరుకుపోయిన దేశంలో మతం ఆధారంగా ప్రజలను సమీకరించట చాలా తేలికైన పని. వర్తమానంలో భారత రాజకీయాలు లౌకిక వ్యతిరేక ధోరణులను సంతరించుకుంటున్నాయి. చరిత్రలో జరిగాయని చెప్తున్న తప్పులను సరి చేయటానికి ఈ మనోభావాలు కలిగిన ఓ తరగతి ప్రజలు, వారికి దన్నుగా నిలుస్తున్న ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తోంది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటాని ఓ దైవదూత ఉద్భవిస్తాడన్న నమ్మకానికి ప్రజలు రానురానూ చేరువవుతున్నారు. మెజారిటీ మతస్తులు లౌకిక భావనలకు, బహుళత్వానికి నీళ్లొదులుతున్నారు. దాని స్థానంలో ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి అన్న భావనలను ఒంట బట్టించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నినాదాలు ఇస్తూ ఆ ధోరణిని మరింత ప్రేరేపించేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ జారవిడుచుకోకుండా పాలకులు ప్రయత్నిస్తున్నారు. 1950 నుండీ భారతదేశం అనుభవిస్తున్న లౌకిక ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న నిజమైన సవాలు ఇదే. బుల్డోజర్లు, తప్పుడు ఎన్‌కౌంటర్లు ప్రజాస్వామ్యానికి పునాదులైన శాసనబద్ధమైన పాలన కుప్పకూలడాన్ని సూచిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేసే క్రూర చట్టాల కంటే కూడా ప్రమాదకర స్థాయికి బుల్డోజర్‌ న్యాయం చేరుకుంది. భారతీయ సమాజం లౌకికేతర సమాజంగా మారటం అన్నది దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సవాళ్లలో ఒకటి. ఈ దేశం లౌకిక దేశంగా ఉంటేనే మనుగడ సాగించగలుగుతుంది. నిజమైన లౌకికతత్వం అంటే ప్రభుత్వానికి ఏ మతమూ అధికారిక మతం కాదు. ప్రభుత్వం ఏ మతాన్నీ ప్రోత్సహించదు. మత ఛాందస రాజ్యం అంతిమంగా భారతదేశాన్ని ఛిన్నాభిన్నం చేస్తుందన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఈ దేశంలో ఆరు అల్పసంఖ్యాక మతాలున్నాయి. అందులో ఓ మతాన్ని విశ్వసించే వారు కనీసం 20 కోట్లమంది ఉన్నారు. అందువలన ఈ దేశాన్ని ఏకమత ఛాందస రాజ్యంగా మార్చటం దాదాపు అసాధ్యం. ఇక రెండో కారణం మన దేశంలో ఆధిపత్య మతం ఎంత క్రూరమైనదంటే నిమ్న కులస్తులకు అధికారంలో భాగం అన్నది సాధ్యమే కాదు. అవకాశమే ఉండదు.

  • కేశవానంద భారతి కాపాడుతుందా?

భారత రాజ్యాంగాన్ని ఇప్పటి వరకూ 105 సార్లు సవరించారు. రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించటానికి పార్లమెంటుకు హక్కు దఖలు పర్చబడింది. ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్కు ఉన్నదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మరో సందర్భంలో 1967లో గోలక్‌నాథ్‌ కు పంజాబ్‌ ప్రభుత్వానికి మధ్య జరిగిన ఓ వివాదంలో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. తర్వాత కేశవానంద భారతి కేసులో ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందని అయితే రాజ్యాంగపు మౌలిక సూత్రాలను సవరించే అధికారం ఉండదని వివరణనిచ్చింది. 13 మంది న్యాయమూర్తులు ఇచ్చిన ఈ తీర్పు భారత రాజ్యాంగ సవరణ చరిత్రలో కీలకమైన తీర్పు. రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఏమిటన్న విషయంలో ఇదమిద్దంగా స్పష్టమైన జాబితా ఏమీ లేకపోయినప్పటికీ తర్వాత వచ్చిన అనేక తీర్పుల ద్వారా సుప్రీం కోర్టు ఈ జాబితాను రూపొందించింది. రాజ్యాంగపు అత్యున్నత స్థానం, శానసబద్ద పాలన, అధికారాల విభజన, న్యాయ సమీక్ష, సమాఖ్యతత్వం, లౌకికతత్వం, ప్రాధమిక హక్కులు, పార్లమెంటంరీ వ్యవస్థ, స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగే ఎన్నికలు, స్వయంప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, న్యాయం పొందేందుకు సమాన అవకాశాలు కల్పించటం వంటివి రాజ్యాంగ మౌలిక సూత్రాలుగా స్థిరపడిపోయాయి. అందువల్ల ఈ మౌలిక సూత్రాలను తిరగదోడటం మొదలు పెడితే ప్రజాస్వామిక భారతం ప్రమాదంలో పడుతుంది. ఈ నేపథ్యంలో కేశవానంద భారతి కేసు తీర్పు చాలా ముఖ్యమైనది.
కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పార్లమెంట్‌ కానీ, పాలక పక్షం కానీ మన ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్థానంలో అధ్యక్ష తరహా పాలనను ప్రతిష్టింపచేయలేవు. సమాఖ్య వ్యవస్థ స్థానంలో కేంద్రీకృత వ్యవస్థను కూడా ఈ తీర్పు అనుమతించదు. లౌకిక ప్రజాతంత్ర దేశాన్ని ధార్మిక రాజ్యంగా మార్చటానికి పార్లమెంట్‌కు అధికారం లేదని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది. ఒకవేళ పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంది కాబట్టి ఈ దేశాన్ని ధార్మిక రాజ్యంగా మార్చేద్దామని పాలకపక్షం అనుకున్నా కేశవానంద భారతి తీర్పును తిరస్కరించే మరో తీర్పు రావాలి. అది కూడా కేశవానంద భారతి కేసులో నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనంలో 13 మంది న్యాయమూర్తులు ఉంటే ఈ తీర్పును తిరస్కరించే ధర్మాసనంలో అంతకన్నా ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉండాలి. అయితే నేడున్న పరిస్థితుల్లో ఏదీ అసాధ్యం అనుకోవడానికి లేదు.

  • అసలైన సవాలు

ఒకవేళ కేశవానంద భారతి తీర్పును మరో ఉన్నత న్యాయస్థాన ధర్మాసనం కొట్టేస్తే అప్పుడు ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు పూర్తి అధికారాలు వస్తాయి. పార్లమెంట్‌లో సంఖ్యాబలం ఉన్న ప్రభుత్వాలు ప్రస్తుత రాజ్యాంగాన్ని రూపురేఖలు కనిపించకుండా మార్చేయగలుగుతాయి. ఆ స్థాయిలో సవరించబడిన రాజ్యాంగం అధ్యక్ష తరహా పాలనకు ఆమోద ముద్ర వేయవచ్చు. సవరించబడిన రాజ్యాంగం ఆమోదిస్తే ప్రజలే నేరుగా దేశాధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు. అంటే దేశాన్ని నిరంకుశత్వం వైపు నడిపించటానికి రాజ్యాంగబద్ధంగానే రంగం సిద్ధం చేయవచ్చు. అంటే ఈ దేశాన్ని నిరంకుశ పాలన దిశగా నడిపించటానికి కొత్త రాజ్యాంగమూ అక్కర్లేదు. కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసే రాజ్యాంగ పరిషత్తూ అక్కర్లేదు. ఉన్న రాజ్యాంగాన్ని సవరించటం ద్వారా ఈ లక్ష్యాలు నెరవేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న అధికరణాల్లో ఓ మోస్తరు మార్పులు చేస్తే ఈ దేశాన్ని ఇప్పటికిప్పుడు ధార్మిక రాజ్యంగా ప్రకటించేయవచ్చు. పై పరిస్థితుల్లో అంటే కేశవానంద భారతి తీర్పును కొట్టేసే మరో తీర్పు వస్తే అప్పుడు రాజ్యాంగాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మల్చుకునేందుకు కావాల్సిన పూర్తి అధికారాలు పార్లమెంట్‌కు దఖలు పడతాయి. అటువంటి పరిస్థితుల్లో పార్లమెంటే ఫలానా మతం అధికారిక మతం అని ఓ సవరణ చేసేయొచ్చు. అన్యమతస్తులకు ఉన్న ప్రాథమిక హక్కులను రద్దు చేయవచ్చు లేదా కుదించవచ్చు. అదే అసలైన సవాలు.

22222222

 

 

 

 

 

(పుచ్చలపల్లి సుందరయ్య 38వ స్మారకోపన్యాసం సంక్షిప్తంగా)
(వక్త లోక్‌సభ పూర్వ సెక్రెటరీ జనరల్‌)