Oct 16,2022 06:51

'రెండు రెళ్ళు నాలుగన్నందుకు/ గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో/ క్షేమం అవిభాజ్యం అంటే/ జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో/...క్షణ క్షణం మారుతూన్న లోకాన్ని/ సరీగా అర్ధంజేసుకున్న వాళ్ళంతా/ పేద ప్రజల పక్షం వహించడమే/ పెద్ద అపరాధమై పోయింది' అంటాడు మహాకవి శ్రీశ్రీ. అనాదిగా మనిషే...మనిషితనానికి విఘాతం కలిగిస్తున్నాడు. అతడికి అధికారం కావాలి. కుల మతాలను పటిష్టపర్చుకోవాలి. అందుకోసం ఏ ప్రాంతాన్నీ వదలడు. హద్దులు, సరిహద్దులు దాటుతాడు. సరిహద్దుకు అవతల ఉన్నదీ తనదే అంటాడు. మత విద్వేషాలను రెచ్చగొడతాడు. హింసను ప్రేరేపిస్తాడు. ప్రశ్నించే గొంతుల పీక నులుముతాడు. ఏళ్ల తరబడి జైళ్లలో నిర్బంధిస్తాడు. అదేమంటే... దేశద్రోహి అంటాడు. 'చిత్రంగా వుంటాయి. అమ్ముడుపోతాయి. బాధకి రుద్ధమైపోతాయి. చిత్రంగా చాలా చిత్రంగా వుంటాయి ఈ మానవ కంఠాలు' అంటాడు రావిశాస్త్రి. పరిస్థితిని బట్టి చిత్ర విచిత్రంగా ఆ కంఠధ్వనులు మారుతుంటాయి.
సంఘపరివార్‌ తమకు నచ్చని భావజాలంపై దాడులకు తెగబడుతోంది. ప్రశ్నించే గొంతులను, ఎదిరించే మనుషులను ఏరివేయాలని పరితపిస్తోంది. అందుకు యుఎపిఎ వంటి చట్టాలను, ఎన్‌ఐఎ, సిబిఐ, ఐటీ వంటి వ్యవస్థలను పావుగా ఉపయోగించుకుంటోంది. అందుకు తాజా ఉదాహరణ...ప్రొఫెసర్‌ సాయిబాబా ఉదంతం. ఐదేళ్ల క్రితం తప్పుడు అభియోగాలు మోపి, అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు. బాంబే కోర్టు సాయిబాబాను విడుదల చేయాలని నిన్న తీర్పునిస్తే...ఈ కేసులో నిందితులను విడుదల చేయడం వల్ల 'జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం' ఉందని, ఆయనను జైల్లోనే వుంచాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 90 శాతం వికలాంగుడైన ఆయన... సొంతగా తన పనులు తాను చేసుకోలేనట్టివారు. ఆయన అంగవైకల్యాన్ని కూడా పట్టించుకోకుండా...ఎటువంటి సౌకర్యాలు లేని అండర్‌ సెల్‌లో బంధించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు అనేకం. ప్రశ్నించినవారిని నిర్బంధించడం, రాజకీయ ప్రత్యర్థులను వేధించడం, కేసుల్లో ఇరికించడం కోసం ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. రాజ్యసభలో ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం...4,960 మందిని ఈ విధంగా అరెస్టు చేశారు. వీరిలో కేవలం 149 మందిని మాత్రమే దోషులుగా నిర్థారించారు. వీళ్లెవరూ ఆర్థిక నేరగాళ్లు, దోపిడీ దొంగలు, టెర్రరిస్టులు కాదు. వీరంతా నిరపరాధులు... ప్రశ్నించే గొంతులు. కవులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, ఆదివాసీల కోసం పోరాడేవారు, దళిత హక్కుల కార్యకర్తలు. ఇలా అక్రమ నిర్బంధంలో వున్నవారంతా బాధితులే... వేధింపులకు గురవుతున్నవారే.
మరోవైపు గుజరాత్‌ ప్రభుత్వం బిల్కిస్‌ బానో కేసులో దోషులుగా నిర్థారించి, శిక్ష అనుభవిస్తున్న 11 మందికి క్షమాభిక్ష ప్రసాదించింది. 'ఆజాదీ కా అమత్‌ మహోత్సవ్‌' పేరుతో క్షమాభిక్ష పెట్టారు. 'మనుషుడంత మాయకాడు మరియొకడున్నాడా? ముందునకు వాడే నడచును. ఆ కాళ్లతోనే వెనుకకును వాడే నడచును' అంటాడు పానుగంటి. నచ్చని వారికి బెయిల్‌ వచ్చినా, శిక్ష రద్దయినా వారు క్షేమంగా ఇంటికి చేరతారనే నమ్మకం లేదు. వారికి బెయిల్‌ ఇచ్చీ ఇవ్వకముందే మరో కేసులో అరెస్టు చేయబడుతున్నారు. లేదా సుప్రీంకోర్టు ద్వారా నిలుపు చేస్తున్నారు. ఏడేళ్ల జైలు జీవితంలో తన భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, తనను విడుదల చేయాలని మొరపెట్టుకున్న సాయిబాబా భార్య వేదన అరణ్యరోదనగా మారింది. ఆదివాసీల కోసం పోరాటం చేసిన స్టాన్‌స్వామి జైలులోనే చనిపోవడం చూశాం. భీమా కొరెగాం కేసులో అరెస్టయిన వారు కూడా జైల్లో మగ్గుతున్నారు. జైల్లో వున్నవారి కోసం...వారి కుటుంబ సభ్యులు బయట వుండి పోరాడుతున్నారు. వేదనను అనుభవిస్తున్నారు. ఈ చీకటి చట్టాలన్నీ హింసాత్మకమైనవే. ఇవి మైండుతో గేమ్‌ ఆడతాయి. మెదడులో భయాందోళనలు నింపుతాయి. కాని పోరాడే ప్రజలు, వేదన అనుభవించే కుటుంబాలు ఈ భయాందోళనల నుంచి తేరుకోవడం, మళ్ళీ పోరాటానికి సంసిద్ధం కావటం కూడా మనిషి తత్వమే. 'నిప్పు లోంచి అప్పుడప్పుడు పొగ పడుతుంది/ నీళ్లలోంచి విద్యుత్తను సెగ పుడుతుంది/ ఈ దానవ లోకంలో ఎన్నటికైనా/ మానవులని పిలువదగిన తెగ పుడుతుంది' అంటాడు దాశరథి. ఆ నిజం రుజువవుతుంది. మనిషిలోని మనిషితనం నిజమవుతుంది.