- గాజాలో ఇజ్రాయిల్ దాడులపై ఐరాస తీవ్ర ఆందోళన
-కాల్పుల విరమణ అవశ్యమని విజ్ఞప్తి
- నెతన్యాహూ యుద్ధోన్మాదంపై సర్వత్రా నిరసనల వెల్లువ
న్యూయార్క్ : ఇజ్రాయిల్ వైమానిక, భూతల దాడులతో కకావికల పరిస్థితులు నెలకొన్న గాజా పరిసర ప్రాంతాల్లో మూకుమ్మడి మారణహోమం ముప్పు పొంచివుందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. 'పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి.. తక్షణమే అంతర్జాతీయ సమాజం మేల్కవాలి' అని పాలస్తీనా ప్రాంతాల్లో మానవ హక్కుల పరిస్థితులను అధ్యయనం చేసే ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారి ఫ్రాన్సెసా అల్బనీస్ హెచ్చరించారు. 1948 నక్బా, 1967 నక్సా సంఘటనలు అంతకన్నా తీవ్రమైన స్థాయిలో పునరావృతమయ్యే ముప్పు కనిపిస్తోందని అన్నారు. ఇవి మరోసారి చోటు చేసుకోకుండా నివారించేందుకు అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని కోరారు. 1947-49 మధ్య కాలంలో ఏడున్నర లక్షల మందికి పైగా పాలస్తీనియన్లను తమ ఇళ్ళనుండి, భూభాగాల నుండి బలవంతంగా వెళ్లగొట్టిన నక్బా సంఘటన పునరావృతమవుతోందని ఇజ్రాయిల్ అధికారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సమయంలోనే 1948లో ఇజ్రాయిల్ ఏర్పడింది. నక్సా సమయంలో మూడున్నర లక్షల మందికిపైగా పాలస్తీనియన్లు నిర్వాసితులయ్యారు. 1967లో వెస్ట్ బ్యాంక్, గాజాలను ఇజ్రాయిల్ ఆక్రమించడానికి ఈ సంఘటన దారి తీసింది. ఇజ్రాయిల్ ఇప్పటికే యుద్ధం ముసుగులో పాలస్తీనియన్ల జాతి ప్రక్షాళన చేపట్టిందని ఆమె విమర్శించారు. పూర్తిగా కాల్పుల విరమణ జరగకుండా మానవతా కారిడార్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని దోహా ఇనిస్టిట్యూట్‌కి చెందిన విశ్లేషకుడు తమీర్ కార్‌మంట్ వ్యాఖ్యానించారు.
ా గాజాపై శుక్రవారం, శనివారం కూడా దాడులు యథేశ్చగా కొనసాగాయి. శనివారానికి గడిచిన 24 గంటల వ్యవధిలోనే 320 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయిల్ దాడులకు బలైపోయినట్లు గాజా సిటీ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో అత్యధికులు మహిళలు, చిన్నారులే కావడం ఆందోళనకరం. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 2500 మంది పైచిలుకు పౌరులు గాజాలో చనిపోగా, లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి ఐరాస సహాయక శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. వేలాది మంది ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. గాజాలో ఏ వైపు చూసినా రక్తమోడుతున్న శరీరాలు, శిథిలమవుతున్న భవనాలే దర్శనమిస్తున్నాయి.
ా ఇజ్రాయిల్ తక్షణమే యుద్ద నేరాలకు స్వస్తి పలకాలని, లేదంటే ఆత్మరక్షణ 'పెను భూకంపాన్ని' చవిచూడాల్సివుంటుందని ఇరాన్ హెచ్చరించింది.
ా గాజా వీడి పాలస్తీనా వెళ్లే ప్రసక్తే లేదని హమస్ ఛీఫ్ ఇస్మాయిల్ హనియేV్‌ా ప్రకటించారు. టెలివిజన్‌లో ఆయన మాట్లాడుతూ 'మన శత్రువు అమెరికా యంత్రాంగం, మరికొన్ని యూరోపియన్ దేశాలతో కలిసి ఈ దాడులకు పాల్పడుతోంది. గాజా ప్రజలు తమ మాతృభూమి ఒడిలోనే ఉంటారు. ఎక్కడికీ వెళ్లబోరు. గాజా వీడే ప్రసక్తే లేదు. ఈజిప్టు కూడా వెళ్లబోం' అని స్పష్టం చేశారు.
మానవత్వం మంట కలుస్తోంది : ఐరాస రిలీఫ్ ఛీఫ్
ఇజ్రాయిల్ దాడులతో గాజాలో మానవత్వం మంట గలుస్తోందని ఐక్యరాజ్యసమితి రిలీఫ్ ఛీఫ్ మార్టిన్ గ్రిఫ్ఫీత్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకంటే భయానక పరిస్థితులు ఎదురౌతాయని ఆయన హెచ్చరించారు. 'నీరు లేదు, విద్యుత్ లేదు. ఇంధనం లేదు. ఆహార సరఫరా చాలా నెమ్మదిగా జరుగుతోంది. ఆసుపత్రుల్లో మందులు అయిపోతున్నాయి.' అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలో మానవత్వం ఇప్పటికే తీవ్ర సంక్లిష్టంగా మారిందని, ఊహించనిరీతిలో మరింతగా దిగజారిపోతోందని ఆయన హెచ్చరించారు. అటు వెస్ట్‌బ్యాంక్‌లోనూ హింస పెరిగిపోతోందని, ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య కూడా ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అంతర్జాతీయ సమాజం నుంచి మానవతా సాయం పాలస్తీనాకు తరలివస్తోంది. కానీ ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తుండటంతో మానవతా సాయం ఎక్కడిదక్కడే నిలిచిపోతోంది. టర్కీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి రెండు సహాయక విమానాలు ప్రస్తుతం ఈజిప్టులోని అల్ అరిష్ విమానశ్రయంలో ఆగిపోయాయి. ఇది గాజా సరిహద్దుకు సమీపంలోనే ఉంది. ఇలాంటి విమానాలు ఇప్పటికే ఐదు వరకూ వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయాయి. ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తుండటం వల్లే దారిమధ్యలో సహాయం నిలిచిపోయింది. సహాయక విమానాలు సకాలంలో గమ్యస్థానాలు చేరుకులేకపోతే మహిళలు, చిన్నారులు, వృద్ధులు, అత్యవసర మందులు అందాల్సినవారు అకారణంగా తనువుచాలించాల్సివస్తుందని డబ్ల్యుహెచ్‌ఒ ఛీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.
ా కాగా షెబాకు దక్షిణాన ఉన్న ఒక గ్రామంపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు లెబనీయన్లు చనిపోయినట్లు ఎఎఫ్‌పి వెల్లడించింది.










