Aug 25,2023 13:05

విజయవాడ : వీఆర్‌ఏలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు రాజధాని డివిజన్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. ధర్నా చేపట్టేందుకు వెళుతున్న వీఆర్‌ఏలను అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండించింది. వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను అమలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండడంతో తమ సమస్యలను ప్రభుత్వం దఅష్టికి తీసుకువచ్చేందుకు చలో విజయవాడ పిలుపు ఇచ్చిన వీఆర్‌ఏలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద ఆందోళన చేస్తున్న వీఆర్‌ఏలను పోలీసులు అరెస్టులు చేసి విజయవాడ సిటీ లోని వివిధ పోలీస్‌ స్టేషన్‌ ల లో నిర్బంధించారు. ఈ ధర్నాకు వెళ్లద్దు ... అంటూ నాయకులకు ముందస్తుగా నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని సిఐటియు రాజధాని డివిజన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఎం.రవి, ఎం.భాగ్యరాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఈరోజు తుళ్లూరులో విడుదల చేసిన ఒక ప్రకటనలో వీఆర్‌ఏల అక్రమ అరెస్టులను నేతలు తీవ్రంగా ఖండించారు. నేతలు మాట్లాడుతూ ... వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గాలికి వదిలేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు జరపాలని కోరినందుకు వీఆర్‌ఏలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని ప్రజాతంత్రవాదులందరూ ఖండించాలని కోరారు. '' మాట తప్పను, మడిమతిప్పను అంటే ఇదేనా ముఖ్యమంత్రి గారు '' అని వారు ప్రశ్నించారు ? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు పౌరులందరికీ ఉంటుందని, పోలీసులతో వీఆర్‌ఏలను అక్రమంగా అరెస్టులు చేయించి భావప్రకటనా స్వేచ్ఛను హరించి వేయాలని చూస్తే ప్రజలే తగిన శాస్తి చేస్తారని హెచ్చరించారు. కార్మిక వర్గంతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టిన చరిత్ర లేదని అన్నారు. వివిధ ప్రాంతాల్లో అరెస్టులు చేసి పోలీస్‌ స్టేషన్లో నిర్బంధించిన వీఆర్‌ఏలను తక్షణం విడుదల చేయాలని నేతలు కోరారు.