ములుగు: గతంలో ఎన్నడు జరగని రీతిలో ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అయిందని, వరదల్లో 16 మందిని కోల్పోవడం బాధాకరమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ములుగులో మీడియా సమావేశంలో మాట్లాడారు. వరద సహాయక చర్యల్లో పోలీసుల సేవలు అభినందనీయమని ప్రశంసించారు. దయ్యాలవాగు, జంపన్న వాగు విషాదాన్ని మిగిల్చాయని, ముత్యందార పర్యాటక కేంద్రం వద్ద పోలీసులు అప్రమత్తంతో పర్యాటకులను సురక్షితంగా రక్షించగలిగారని అన్నారు. 5,400 వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 10 రోజులకు సరిపడా నిత్యవసర సామగ్రి అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దెబ్బతిన్న జాతీయ రహదారుల మరమ్మతులు పూర్తి చేశామని, దేశంలోనే రికార్డు స్థాయిలో ములుగులో వర్షపాతం నమోదయిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 805 చెరువులు అలుగు పోశాయని, 75 చెరువుల కట్టలు తెగాయని, వరదల్లో 16 మంది గల్లంతు కాగా13 మంది మఅతదేహాలు లభ్యమయ్యాయని, ఇంకా ముగ్గురి ఆచూకీ దొరకలేదని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఎవరు కూడా అధైర్య పడొద్దని బాధితులను అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి తెలిపారు.










