- స్టీల్‌ప్లాంట్‌పై మోడీ సర్కారు మరో ద్రోహం
- ఎనిమిదేళ్లుగా నూతన వేతనాలకు నోచుకోని కార్మికులు, అధికారులు
- 1982 సెయిల్ ఎంఒయుకు తూట్లు
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా ప్రయివేటీకరణ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ కార్మికులు, ఉద్యోగుల నూతన ఒప్పందానికి మోకలడ్డుతోంది. 2016 డిసెంబర్‌లో వేతన ఒప్పందం గడువు ముగిసినా నేటికీ నూతన ఒప్పందాన్ని అమలు చేయడం లేదు.1982లో సెయిల్‌తో కుదుర్చుకున్న ఎంఒయుకు తూట్లుపొడుస్తోంది. ఉక్కు కార్మికులు, అధికారులకు ద్రోహం చేసే చర్యలకు పాల్పడుతుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు.
వేతన ఒప్పందం కథేమిటి ?
ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులు, అధికారులకు ఐదేళ్లకోసారి వేతన ఒప్పందం జరుగుతుంది. దేశంలో సెయిల్ సహా ఏడు స్టీల్‌ప్లాంట్‌లు నడుస్తున్నాయి. 2016 డిసెంబరుతో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ వేతన ఒప్పందం ముగిసింది. 2017 డిసెంబరు నుంచి కొత్త ఒప్పందం ప్రారంభం కావాలి. కానీ అలా జరగకపోవడంతో 10,500 మంది కార్మికులు, 5,100కి పైచిలుకు అధికారులు నష్టపోయారు. నాటి నుంచి కార్మికులు, అధికారులు పోరాటం చేయడంతో 2020లో నేషనల్ జాయింట్ కమిటీ ఫర్ స్టీల్ (ఎన్‌జెసిఎస్)తో సెయిల్‌లో చర్చలు జరిగాయి. 2021 డిసెంబరులో అధికారులు, కార్మికులకు అగ్రిమెంట్ జరిగింది. 13 శాతం మినిమం గ్యారెంటీ బెనిఫిట్ (ఎంజిబి), 26.5 శాతం పెర్క్స్ అంటే అలవెన్సు అప్పటికే వారు తీసుకుంటున్న వేతనంపై పర్సంటేజీల వారీగా పెంచాలని చర్చలు సాగాయి. ఈ మేరకు అధికారులు, కార్మికులకు సెయిల్‌లో వేతన ఒప్పందం జరిగింది.
ఒప్పందం సరే.. ఉల్లంఘన ఎక్కడ జరిగింది ?
1982లో సెయిల్ నుంచి ఆర్‌ఐఎన్‌ఎల్ వేరుపడినప్పుడు సెయిల్‌లో జరిగే అన్ని ఒప్పందాలు, బెనిఫిట్స్ ఆర్‌ఐఎన్‌ఎల్‌లో అమలు చేస్తామని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. అంటే సెయిల్‌లో ఏ ఒప్పందం జరిగినా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో అమలు కావాలి. కానీ ఈ వేతన ఒప్పందాన్ని స్టీల్‌ప్లాంట్‌లో అమలు చేయడం లేదు. 2021 అక్టోబర్‌లో సెయిల్‌లో జరిగిన ఎంఒయులో వేతనం ఒప్పందం అమలు గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇది ఎన్‌జెసిఎస్ నుంచి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను వేరు చేయడం, ఎన్‌జెసిఎస్‌ను ముక్కలు చేసే కుట్ర తప్ప మరొకటి కాదని కార్మికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ వేతన ఒప్పందంపై అప్పట్లో సిఐటియు, బిఎంఎస్ సంతకాలు పెట్టలేదు. కానీ ఐఎన్‌టియుసి, ఎఐటియుసి, హెచ్‌ఎంఎస్ సంతకాలు పెట్టేశాయి. మెజారిటీ పేరుతో దీన్నే యాజమాన్యం ద్వారా కేంద్రం అమలు చేయించడం ఒక దుర్మార్గమైన చర్య.
వేతన ఒప్పందంలో మరో ట్విస్ట్
గతంలో ఐదేళ్లకు వేతన ఒప్పందం జరిగేది. మోడీ వచ్చాక పది సంవత్సరాలకు పెంచేశాడు. బిజెపి చేసిన ఈ కొత్త వేతన ఒప్పందంతో వేల సంఖ్యలో వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లోని కొత్త కార్మికులు ఒప్పందం పరిధిలోకి రాకుండా పోయారు.
మోడీ సర్కారు తీరును వ్యతిరేకిస్తున్నాం
దేశంలో ఎక్కడా లేని వేతన ఒప్పందాన్ని వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో చేయడం వెనుక ప్లాంట్‌ను అమ్మివేసే కుట్ర దాగి ఉంది. ఇది దుర్మార్గం. కార్మికులు ఈ ఒప్పందాన్ని అంగీకరించరు. ఆర్థికంగా ఇప్పటికే చాలా నష్టపోయాం.
- ఎస్.శంకర్, స్టీల్ సింటర్ ప్లాంట్ డిపార్టుమెంట్ ఉద్యోగి
ఎదిరించి పోరాడతాం
2020లో స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైంది. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులు పోరాటానికి దిగారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమోషన్లను నాటి నుంచి ఆపేశారు. వేతన ఒప్పందం అమలు కాకుండా మోడీ సర్కారు దుశ్చర్యలకు దిగింది.
- జముల్ల నూకరాజు,
స్టీల్ ఆర్‌ఎంహెచ్‌పి డిపార్టుమెంట్ కార్మికులు










