Jun 15,2023 06:26

ప్రజలకు కరోనా టీకా అందించడానికి ఉపయోగించిన కోవిన్‌ యాప్‌ నుండి వ్యక్తుల వివరాలన్నీ లీక్‌ అయ్యి టెలిగ్రామ్‌ యాప్‌లో ప్రత్యక్షమయ్యాయన్నది నడుస్తోన్న వివాదం. అధికారిక ఖాతా నుండే ఇలా వివరాలు బజారులోకి ప్రవహిస్తే సమాచార గోప్యతకు, డేటా రక్షణకు పూచీ ఏమిటన్నది అందరి ఆందోళన.' అలా కోవిన్‌ ద్వారా లీక్‌ కాలేదు...ఆ వివరాలన్నవి ముందే లీక్‌ అయి ఉండొచ్చన్నది ప్రభుత్వ వివరణ. ప్రస్తుత అంతర్జాల యుగంలో సైబర్‌ స్పేస్‌లో డేటాకి ఎలాంటి భద్రతా లేదు. ఒకసారి సైబర్‌ స్పేస్‌ లోకి వెళ్లిన సమాచారం వీధిలో ఉన్నట్టే. అయితే అలా జరగకుండా ఉండడానికి ప్రభుత్వం చెయ్యవలసినదంతా చెయ్యాలి. అనుమతి లేకుండా, ఒకరి సమాచారం వీధిలో పెడితే భాద్యుల్ని శిక్షించాలి. నియమాలు కఠినతరం చెయ్యాలి. ఆ దిశగా ప్రయత్నాలు వేగంగా జరగడం లేదన్నదే ఆందోళన. 2017లో సుప్రీంకోర్టు వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుకోవడం పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తించింది. అంటే ఆ హక్కుని పరిరక్షించాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉంది. ఆ తీర్పు స్ఫూర్తితో డేటా పరిరక్షణ చట్టం ఇప్పటికే అమలులో ఉండాల్సింది. అయితే అలా జరగలేదు. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అయినదానికీ, కానిదానికీ వ్యక్తుల వివరాలన్నీ వివిధ సంస్థలు సేకరిస్తున్నాయి. వాటిని జాగ్రత్త పరిచే బాధ్యత, భయం ఆ సంస్థలకు లేదు. దుర్వినియోగం చేసినా ఏమీ చెయ్యలేని స్థితి లేదా చిన్నచిన్న శిక్షలు, జరిమానాలతో సరి. అందుకే డేటా పరిరక్షణ చట్టం వెంటనే పట్టాలకెక్కాలి. లేదంటే ప్రమాదం.

- డా. డి.వి.జి.శంకరరావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం.