Aug 17,2023 07:28
  • పోరుయాత్రలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ

ప్రజాశక్తి - ఫిరంగిపురం, మేడికొండూరు (గుంటూరు జిల్లా) : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు ఉద్యమిం చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బారావమ్మ తెలిపారు.
ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన అంగన్‌వాడీల పోరుయాత్రను గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఆమె బుధవారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా జీతాలివ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాజకీయ జోక్యం నివారించాలని, ప్రీస్కూల్‌ బలోపేతం చేయాలని తదితర డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన పోరుయాత్ర ఫిరంగిపురం, మేడి కొండూరు, తాడికొండ, తుళ్లూరు మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా ప్రచార సభల్లో సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్‌ సెలవులు ఇవ్వాలని, సర్వీసులో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేవారు. ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకపోతే పోరుబాట తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజీ, యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి దీప్తి మనోజ, తదితరులు పాల్గొన్నారు.