- విద్యుత్ ఛార్జీలు పెంచం
- 'ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధం'లో చంద్రబాబు
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : రాష్ట్రంలో 69 నదులు ఉన్నాయని, నదుల అనుసంధానంతో కరువు రాదని టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధం కార్యక్రమాన్ని మంగళవారం ఆయన నంద్యాల జిల్లా నందికొట్కూరు నుండి ప్రారంభించారు. కర్నూలు విమానాశ్రయం నుండి నందికొట్కూరుకు రోడ్డు మార్గంలో వచ్చి అక్కడ రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. పాములపాడు మండలం బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేదని, ప్రాధాన్యత లేకుండా ఇష్టానుసారంగా చేయడం వల్ల అన్యాయం జరిగే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వం రివర్స్ నిర్ణయాలు చేసిందని, 198 ప్రాజెక్టులను రద్దు చేసిందని తెలిపారు. కర్నూలు జిల్లాలోని గుండ్రేవుల, వేదవతి, ఆర్‌డిఎస్ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదన్నారు. గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకురావడం తన జీవితాశయమని తెలిపారు. పశ్చిమ కర్నూలుకు ఉపయోగంలేని రాయలసీమ ఎత్తిపోతల పథకం దేనికని ప్రశ్నించారు. 2014 నుండి 2019 వరకు రాయలసీమ ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చు పెడితే, వైసిపి ప్రభుత్వం కేవలం రూ.2 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. అంతకుముందు నందికొట్కూరు రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతూ కరెంట్ ఛార్జీలు పెరగకుండా బాధ్యత తీసుకుంటానన్నారు. మద్యం ధరలు తగ్గిస్తామని, నాణ్యమైన మద్యం వస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క ఎకరాకూ నీళ్లిస్తామని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని, తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమా, భూమా అఖిల ప్రియ, ఫరూక్, టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, కర్నూలు జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు పాల్గొన్నారు.












