
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. మార్చి 8వ తేదీన మాణిక్ షా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అదే రోజున నిరుపేద రిక్షా డ్రైవర్ హరిమోహన్ ఘోష్ తన ఇంటికి వెళ్లేసరికి ధ్వంసమైన పశువుల పాక, మంటల్లో కాలి చనిపోయిన రెండు ఆవులు, ధ్వంసమైన రిక్షా దర్శనమిచ్చాయి. ఘోష్ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) కార్యకర్త అని స్థానిక పాలక పార్టీకి తెలిసిన తర్వాత ఇల్లు వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతను ఇంట్లో లేని సమయంలో మార్చి 8వ తేదీ తెల్లవారుజామున కాషాయ పార్టీకి చెందిన అల్లరిమూక పశువుల కొష్టాన్ని తగులబెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి, ఇన్‌డైజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐ.పి.ఎఫ్.టి) కూటమి విజయం సాధించిందని, రెండవసారి అధికారాన్ని చేపడుతుందనే ప్రకటన వచ్చిన నాటి (మార్చి 2) నుండి ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సభ్యుల మీద వెయ్యికి పైగా దాడులు జరిగాయి. ఎన్నికల అనంతరం జరిగిన హింస ఏ స్థాయిలో వుందంటే...ఆఖరికి నిజనిర్ధారణ కమిటీ సభ్యులైన ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా విడిచి పెట్టలేదని సిపియం నాయకత్వంలోని వామపక్ష కూటమి, కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నారు.
- ఏకైక ఎజెండా
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మార్చి 2వ తేదీ నుండి జరుగుతున్న రాజకీయ హింస కారణంగా...త్రిపుర రాష్ట్ర ప్రజలు మానసిక, భౌతిక దాడులను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ మద్దతుదారులు, కార్యకర్తలు బిజెపి చేతిలో నిత్యం దాడులకు గురవుతున్నారు. వారి ఇళ్లు, జీవనాధారంగా ఉన్న దుకాణాలు, ఇతర ఆస్తులన్నింటినీ ధ్వంసం చేశారు. దాదాపు వెయ్యిమందికి పైగా ఇళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వామపక్ష పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్నారు కాబట్టి వారు ఇంటికి తిరిగి రావాలంటే డబ్బు చెల్లించాలని పాలక బిజెపి మద్దతుదార్లు ఒత్తిడి చేశారు. స్థానిక బిజెపి నాయకునికి రూ.50 వేలు చెల్లించిన తరువాత మాత్రమే తాను ఇంటికి రాగలిగానని సెపాహిజాల జిల్లాకు చెందిన సిపియం కార్యకర్త ఒకరు చెప్పారు. వారికి డబ్బు చెల్లించడంతో పాటు ఇకముందు ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొననని ప్రమాణం చెయ్యాల్సి వచ్చిందని కూడా ఆయన వాపోయాడు.
''ప్రతిపక్షాన్ని, ప్రజాస్వామిక కార్యకలాపాలను లేకుండా నాశనం చేయడమే భారతీయ జనతా పార్టీ ఏకైక ఎజెండా. బిజెపి అధికారం లోకి వచ్చిన 2018 నుండి, ఐదు సంవత్సరాలుగా తన రాజకీయ ప్రత్యర్ధుల్లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఎలక్షన్ కమిషన్ పుణ్యమా అని ఈ భయానక వాతావరణానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ పరిస్థితుల్లో బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేసి ఓడించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. దాని ఫలితంగానే బిజెపి ఓట్ల భాగస్వామ్యం భారీగా తగ్గింది. తన వ్యతిరేక ఓట్లు చీలినందున బిజెపి విజయం సాధించింది. మళ్ళీ అధికారం చేపట్టిన తరువాత తమకు ఓట్లు తగ్గిన ప్రాంతాల్లో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పార్లమెంటరీ ప్రతినిధుల సందర్శన సందర్భంగా ఈ విషయాలు బహిర్గతమయ్యాయి'' అని త్రిపుర సిపియం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి చెప్తున్నారు.
దాడులకు పాల్పడుతున్న బిజెపి వారు, దాడులు చేస్తున్నట్లు కనిపించకుండా ఉండేలా, తమ అసలు ఎజెండాను చాలా నేర్పుగా అమలుచేసేలా జాగ్రత్తలు తీసుకున్నారని చౌదరి వెల్లడించారు. ఇప్పుడు సిపిఐ(యం), కాంగ్రెస్ పార్టీల మద్దతుదార్లు, కార్యకర్తలు వెళ్ళి తమ పనులు తాము చేసుకొని, తమ జీవనోపాధిని సంపాదించుకోకుండా, తమ దుకాణాలు తెరిచి, వ్యాపారం చేసుకోకుండా బిజెపి దౌర్జన్యకారులు అడ్డుకుంటున్నారు. వారు ప్రతిపక్షాల వారిని భౌతికంగా హత్య చేయకపోవచ్చు. కానీ వారిని ఆర్థికంగా నాశనం చేస్తున్నారు. మార్చి 16వ తేదీ నాటికి, వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి వ్యతిరేకంగా 2000 పైగా కేసులు నమోదయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు నిలబడి చోద్యం చూస్తున్నారు. దాడులను ప్రతిఘటిస్తున్న వారిని మాత్రం అరెస్ట్ చేస్తున్నారని జితేంద్ర చౌదరి చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నప్పటికీ, విజయం సాధించే విధంగా బిజెపి పథకాలు రచించింది. ప్రతిపక్ష పార్టీల గొంతుకలను అణిచివేయడం ద్వారా ప్రజాస్వామిక క్రమాన్ని బలహీనపరిచేందుకు పాలకపార్టీ తెగబడింది. అందుకు పాల్పడిన బెదిరింపు ధోరణులు, హింసాత్మక చర్యలే ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు గల కారణాల్లో ప్రధానమైనది. ఎన్నికల్లో బిజెపి, ఐపిఎఫ్‌టి కూటమి 2018లో సాధించిన (మొత్తం 60 సీట్లకు 44 సీట్లు) విజయానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు కేవలం 33 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. త్రిముఖ పోటీ జరిగినందునే తమకు అనుకూలమైన ఫలితాలొచ్చాయని బిజెపి నేతలే ఒప్పుకున్నారు. కొన్ని గిరిజనేతర నియోజకవర్గాల్లో టిఐపిఆర్‌ఎ ఓట్లు చీల్చింది. అలా జరగనట్లయితే ఐదు నుండి ఆరు స్థానాలను తాము లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి చేతిలో కోల్పోయేవారమన్నది బిజెపి ప్రతినిధి మాట.
ఎన్నికల అనంతరం జరిగిన హింస స్వభావరీత్యా గతంకన్నా భిన్నంగా ఉంది. బిజెపి ఈసారి భౌతికంగా కంటే ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, కార్యకర్తల జీవనోపాధిని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడిందని వామపక్ష రాజకీయ పరిశీలకుడు, సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ సిన్హా అభిప్రాయపడ్డారు. మొదటి ఐదు సంవత్సరాల్లో ఎక్కువగా భౌతిక దాడులు చేశారు. ఇరవై ఐదు మంది వామపక్ష పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు హత్యగావించబడ్డారు. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులే వేల సంఖ్యలో దాడులకు గురయ్యారు. వారి పార్టీల కార్యాలయాల్ని ధ్వంసం చేశారు. ఇళ్లను తగులబెట్టారు. ఈసారి ప్రజల జీవనోపాధిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.
ఒకరికి రబ్బర్ తోట ఉందనుకోండి. ఆ తోటను ధ్వంసం చేస్తారు. లేకుంటే ఆటో రిక్షా లేదా దుకాణం లేదా ఏదైనా చిన్న వ్యాపారం. వేరే ఎలాంటి వనరులు లేకుండా...ఒకవేళ వ్యవసాయం చేయడానికి మోటార్ పంపుసెట్టు ఉంటే దాన్ని ఎత్తుకెళ్లి పోతారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు తమ ఇళ్ళకు తాము రావడానికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినట్టు అనేకమంది తెలిపారు. జీవనోపాధిని పునరుద్ధరించుకుని, మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా భయపెట్టి ప్రజల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిన్నది.
ప్రస్తుత బిజెపి పాలనలో ఉన్నంత భయానకమైన పరిస్థితులు... సిపిఎం పాలనా కాలంలో లేవని త్రిపుర రాష్ట్ర పిసిసి కార్యదర్శి హిమాన్షుకర్ చెప్తున్నారు. నాడు (సిపిఎం పాలనలో) ప్రతిపక్ష పార్టీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునేది. తన అభిప్రాయాన్ని వినిపించేది. కానీ ఇప్పుడు ఒక పథకం ప్రకారం ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.
- కేంద్ర బృందం సందర్శన
హింసాయుత దాడులు ఏ మాత్రం తగ్గకుండా కొనసాగుతున్న పరిస్థితుల్లో...వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో ఏర్పడిన ఒక నిజనిర్ధారణ బృందం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో కలసి...దాడులు జరిగిన ప్రాంతాల్ని సందర్శించింది.
''వారు (బిజెపి వారు) గ్రామాల్లోకి ప్రవేశించి, ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న సిపియం కార్యకర్తల్ని గుర్తించి, వారి ఇళ్ళను ధ్వంసం చేశారు. నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే మీకు కూడా ఇదే గతి పడుతుందని ఇరుగు పొరుగునూ బెదిరించారు. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంది. కానీ పోలీసులు వారి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి కూడా వారు భయపడుతున్నారు'' అని నిజనిర్ధారణ బృందం సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు బికాస్ రంజన్ భట్టాచార్య చెప్తున్నారు.
ఆఖరికి పార్లమెంటరీ బృందాన్ని కూడా విడిచి పెట్టలేదు. సెపాహిజాల జిల్లా లోని నీహల్ చంద్రనగర్‌లో ఈ బృందం దాడికి గురైంది. ఎంపీలను, ఎన్నికైన శాసనసభ్యులనే ఈ విధంగా బెదిరిస్తే, సామాన్య ప్రజానీకం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. బెదిరింపులతో వారు ప్రజల నోళ్ళు నొక్కేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని భట్టాచార్య అంటున్నారు.
మొదట ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తాలనుకున్నప్పటికీ, దీనివలన ఎలాంటి ఉపయోగం ఉండదని భట్టాచార్య భావించారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్యని బిజెపి అంటుంది కాబట్టి దీనిని పార్లమెంట్‌లో ప్రస్తావించలేదు. ఈ భయానక వాతావరణాన్ని ప్రతిఘటించడానికి ప్రజల్ని ఐక్యం చెయ్యడమే ఏకైక పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.
''త్రిపురలో చెలరేగుతున్న హింస హద్దులు దాటుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే వెయ్యికి పైగా హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. బిజెపి ప్రభుత్వ మద్దతుదార్లు రాష్ట్రంలో భారీ విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల్ని లక్ష్యంగా చేసుకొని నేరగాళ్లు అనాగరిక దాడులకు పాల్పడుతున్నారు. భారీ సంఖ్యలో గృహాలు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. దహనం చేస్తున్నారు.'' అని సిపిఎం రాజ్యసభ సభ్యుడు వి.శివదాసన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ కు మార్చి 11న రాసిన లేఖలో పేర్కొన్నారు.
''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో సుహృద్ శంకర్ ఛటోపాధ్యాయ