Aug 17,2023 06:41

స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత విడివిడిగా చేసిన ప్రసంగాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరువురి ప్రసంగాల్లోనూ నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలే కీలకంగా చోటుచేసుకున్నాయి. కార్పొరేట్ల అవసరాలు తీర్చడమే ధ్యేయంగా ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు అమలవుతున్న ఈ విధానాలను మరింతగా ముందుకు తీసుకుపోవడమే తమ లక్ష్యమని ఇరువురు నేతలూ ప్రకటించారు. దీంతో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల తరువాత వీరిద్దరిలో ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రం సంస్కరణల బాటనే ప్రయాణించక తప్పదని తేలిపోయింది. మంగళవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పేదల బతుకులు బాగుపడే వరకు యుద్ధం చేస్తానని ప్రకటించారు. పేద ప్రజల మూలుగులును పీల్చి పిప్పి చేస్తున్న ఆర్థిక సంస్కరణలను ఒకవైపు మోస్తూ, మరోవైపు ఎవరితో యద్ధం చేస్తారో అర్ధం కాని పరిస్థితి! ఇక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన సంకల్పం పేదరికం లేని సమాజమని చెబుతూనే సంస్కరణలను ఘనంగా కీర్తించారు. ఆయన అట్టహాసంగా విడుదల చేసిన విజన్‌ 2047 డాక్యుమైంటైతే అక్షరాలా నూతన ఆర్థిక విధానాలతో, కార్పొరేట్ల ప్రయోజనాలతో నిండిపోయింది. తెలుగు ప్రజలకు తానిచ్చే ఆయుధంగా దానిని ఆయన అభివర్ణించుకోవడం విడ్డూరం!
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఘనంగా చెప్పుకున్న విద్యావిధానంలో మార్పులన్నీ ప్రపంచబ్యాంకు ఊదరగొట్టిన సుభాషితాలే! ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం, ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలే తలకు మించి భారం కావడం వంటి పరిణామాలు కళ్ళ ముందు కనపడుతున్న సత్యాలు. ఉపాధ్యాయుల కొరత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రంలో పూర్తిస్థాయి డిఎస్‌సి నిర్వహించి ఎన్నేళ్లయిందో? ఒకప్పుడు ప్రపంచబ్యాంకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ పని చేస్తోంది. మోడీ ప్రభుత్వం నుండి వస్తున్న ఆదేశాలను బిజెపి పాలిత రాష్ట్రాల కన్నా వేగంగా జగన్మోహన్‌రెడ్డి సర్కారు అమలు చేస్తున్నప్పుడు రాష్ట్రంలో అమలయ్యేవి ప్రపంచబ్యాంకు విధానాలు కాక మరేమిటి? విద్యాసంస్థల్లో కనీస వసతులు లేకపోయినా బైజూస్‌, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌, వర్చువల్‌ రియాల్టీ, అగ్‌మెంటెడ్‌ రియాల్టీ వంటి నేల విడిచి సాము చేసే కసరత్తులు ఆ విధానాల ఫలితమే! ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు చోటుచేసుకుంటున్న ఈ మార్పులు విద్యారంగంలో తీవ్ర అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఇక చంద్రబాబు తన విజన్‌ డాక్యుమెంట్‌లో స్కూళ్లను తగ్గించుకోవాలని స్పష్టంగా పేర్కొనడం దారుణం. మెడికల్‌ కళాశాలల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ పేదలు, అణగారిన కులాల వారికి నామమాత్రపు ప్రయోజనం లేకుండా సర్కారీ వ్యాపారానికి తెరలేవడం సైతం బ్యాంకు విధానాల దుష్ఫలితమే! విద్యుత్‌ రంగంలో 1990వ దశకంలో ప్రారంభమైన సంస్కరణలనే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరింత వేగంగా కొనసాగిస్తోంది. వ్యవసాయ మోటర్లకు మీటర్ల ఏర్పాటు నుండి స్మార్ట్‌ మీటర్ల వరకు అప్పటి విధానాల కొనసాగింపే! వ్యవసాయం, వైద్యం వంటి కీలక రంగాలతో పాటు, పట్టణ సంస్కరణలకూ రెడ్‌కార్పెట్‌ పరిచిన రాష్ట్ర ప్రభుత్వం చెత్తపన్నునూ ప్రజానీకంపై రుద్దింది. వీటన్నింటికీ సమిధలవుతున్నది పేదలు కాగా, వారి తరపునే తాను యుద్ధం చేస్తున్నానని జగన్మోహన్‌రెడ్డి ప్రకటించుకోవడాన్ని ఏమనాలి?
రాష్ట్రంలో సంస్కరణలకు ఆద్యుడినని ప్రకటించుకున్న చంద్రబాబు, 2047 విజన్‌ డాక్యుమెంట్‌లో వాటినే మరింత తీవ్రంగా ప్రతిపాదించారు. నూతన ఆర్థిక విధానాలతో సంపద సృష్టి జరుగుతున్నా అది పేదలకు అందడం లేదని కూడా ఆయనే చెప్పడం గమనార్హం. అయినా, సంస్కరణలను అమలు చేసి తీరుతాననడం ఎవరి ప్రయోజనాల కోసమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విద్యుత్‌ రంగంలో అమలు చేసిన సంస్కరణల దుష్ఫలితాలను చవిచూసిన రాష్ట్ర ప్రజానీకం సమైక్య రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగిసి వాటిని తిప్పికొట్టింది. ఆ విధానాలనే అమలు చేసి తీరుతామని అధికార, ప్రతిపక్ష పార్టీలు నిస్సిగ్గుగా చెప్పడాన్ని రాష్ట్ర ప్రజానీకం గుర్తించాలి. తిప్పికొట్టడానికి మరోసారి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. అందుకు రానున్న ఎన్నికలే సరైన వేదిక.