Oct 18,2023 21:55

-అమలుపై నిశిత పరిశీలన
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :సంపూర్ణ పోషణ కార్యక్రమం అమలును నిశితంగా పరిశీలించాలని, అంగన్‌వాడీల వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న దానిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మహిళా శిశుసంక్షేమశాఖపై సిఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంపూర్ణ పోషణ్‌, అంగన్‌వాడీలపై బలమైన ఎస్‌ఒపిని రూపొందించాలని తెలిపారు. డ్రైరేషన్‌ పంపిణీపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అన్నారు. రేషన్‌ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూదని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి రక్తహీనత, పౌష్టికాహారలోపం ఉన్నవారిని గుర్తించి వారందరికీ పౌష్టికాహారం అందేలా మహిళా శిశు సంక్షేమశాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. మందులు ఇచ్చే బాధ్యత ఆరోగ్యశాఖ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ విషయంలో రెండు శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. దీనివల్ల గ్రామస్థాయిలో రక్తహీనత సమస్యను పూర్తిగా నివారించగలుగుతామని పేర్కొన్నారు. సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం అందిస్తున్న సమయంలో గర్భిణులు, పిల్లలకు టీకాలు అందించారా, లేదా అన్న దానిపై పర్యవేక్షణ చేయాలని సిఎం ఆదేశించారు. ఒకవేళ టీకాలు మిస్సయితే వెంటనే వేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఎఎన్‌ఎం అక్కడ ఉండేలా చూడాలని తెలిపారు. పిల్లలు కూడా వయసుకు తగ్గ బరువు ఉన్నారా లేరా అన్న దానిపైనా దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. ప్రతినెలా బాలింతలు, గర్భిణులకు హిమోగ్లోబిన్‌ పరీక్షలు చేయాలని సిఎం ఆదేశించారు. జీవనశైలిలో మార్పులు కారణంగా వస్తున్న వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాయామాలపై క్యాంపులు నిర్వహించేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. ప్రతినెలా ఒకసారి క్యాంపు నిర్వహించాలన్నారు. ఈ సమీక్షలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.