
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తరచూ ఒక అంశంపై చర్చ తప్పించబడుతుంటుంది. ఈ దేశాన్ని తొమ్మిదేళ్లుగా పాలిస్తూ మరోసారి వచ్చేది మేమేనంటున్న బిజెపి గురించి, దాని విధానాల మంచి చెడ్డల గురించి, మన పత్రికలు విమర్శనాత్మకంగా పతాక శీర్షికలివ్వడం చాలా అరుదు. ప్రైమ్ టైమ్ డిబేట్లు కూడా పెద్దగా వుండవు. ఈ మధ్య తెలంగాణలో బండి సంజరు వంటి వారి హడావుడి పెరిగింది గనక, కెసిఆర్ బిఆర్‌ఎస్ స్థాపించి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గనక ప్రస్తావన వుంటుందేమో గాని ఎ.పి లో అయితే అసలే నాస్తి. బిజెపి కి ఇక్కడ బలమే లేదు. దాని గురించి మాట్లాడటం ఎందుకన్నది అధికార వైసిపి, టిడిపి ల మాట. జనసేన సరే. నేరుగా బిజెపి తోనే చేతులు కలిపింది గనక విమర్శల ప్రసక్తి, కనీసం చర్చ కూడా వుండవు. టిడిపి అధినేత చంద్రబాబు కూడా బిజెపిపై పూర్తి మౌనం పాటించాలని వారి నాయకులకు ఆదేశాలిచ్చారంటారు. ఎవరైనా పెదవి మెదిపితే వెంటనే ఆగ్రహిస్తారు. ప్రధాని మోడీ...బాబును పలకరించారనీ, ఫోన్ చేశారనీ గొప్పగా చెప్పుకుంటారు. మేమే ఆయనకు సలహాలిచ్చాం అని గొప్పలు పోతుంటారు. 2018కి ముందు మతతత్వంపై చెలరేగిపోయిన చంద్రబాబు ఇప్పుడు అదంతా మ్యూట్ చేశారు. ఇక ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీ, ప్రభుత్వమూ మోడీకి అతి వీర విధేయులు. పదేపదే ఢిల్లీ వెళ్లి ఆయన ఆదేశాలు తీసుకుని, అభ్యర్థనలు సమర్పించి రావడం తప్ప ఇవ్వాల్సిన విశాఖ ఉక్కు వంటి వాటి కోసం పట్టుపట్టిన, ఉద్యమించిన దాఖలాలే లేవు. పోనీ ఇందుకు బిజెపి ప్రతిస్పందన గమనిస్తే ఎ.పి బిజెపి నాయకులు నిరంతరం జగన్ సర్కారుపై దాడి చేస్తుంటారు. అంతర్వేది నుంచి అంతర్యామి శ్రీనివాసుని వరకూ ప్రతి పుణ్యక్షేత్రాలలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. మతపరమైన ఉద్రేకాలు రెచ్చగొట్టడానికి విఫలయత్నాలు చేస్తుంటారు.
- పిల్లి వచ్చె, ఎలకా భద్రం
వైసిపి నాయకులెవరైనా ఎప్పుడైనా రాష్ట్ర బిజెపి వారిని ఒక మాట అంటారు తప్ప కేంద్రం జోలికి పోరు. పైగా మత రాజకీయాలలో తాము తీసిపోమని ముఖ్యమంత్రి గోపూజల్లోనూ దైవదర్శనాలు, పీఠాధిపతుల ఆశీస్సుల స్వీకారంలో పోటీ పడుతుంటారు. రాష్ట్రానికి నిధులివ్వని, హామీలు నెరవేర్చని మోడీ సర్కారుపై ఈ మూడు పార్టీలకూ ఇంత భయమెందుకో మాత్రం చెప్పరు గానీ అందరికీ తెలుసు. వైసిపి ది పరోక్ష మద్దతు, జనసేనది ప్రత్యక్ష మద్దతు, టిడిపిది గత మద్దతు భవిష్యత్‌కై తపస్సు ఇంకా విపరీతమేమంటే రాష్ట్రపతి పాలన విధించాలనీ ఆర్థిక ఎమర్జన్సీ ప్రకటించాలని టిడిపి నేతలు కేంద్రాన్ని కోరుతుంటారు. కేంద్రం చెప్పే విద్యా విధానం, కరెంటు మీటర్లు, డిస్కంలు వంటి ఆదేశాలను బిజెపి సర్కార్ల కంటే ముందు ఎ.పి ప్రభుత్వమే అమలు చేస్తూ ప్రజలపై భారాలు మోపుతుంటుంది. అదే తెలంగాణలో కాంగ్రెస్ గానీ, మరికొన్ని చిన్న పార్టీలూ గానీ కేంద్ర బిజెపి మత రాజకీయాలను పెత్తందారీ పోకడలతో రాష్ట్ర హక్కులు హరించడాన్ని పెద్దగా పట్టించుకోవు. కెసిఆర్ కుటుంబ పాలనను అంతం చేయడమే ఏకైక లక్ష్యమన్నట్టు కేంద్ర జోక్యాన్ని ఆహ్వానిస్తుంటాయి. ప్రతిపక్షాలతో కలసి ఇ.డి, సిబిఐ, ఐ.టి వేధింపులపై కేసు వేసే కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో మాత్రం మరింత గట్టిగా దర్యాప్తు చేయలేదేమని ఆక్షేపిస్తుంటారు. బిఆర్‌ఎస్, బిజెపి ఒకటేనని తిట్టిపోస్తుంటారు. మరో వంక బిఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్, బిజెపి ఒకటేనంటే...బిజెపి ఈ ఇద్దరూ ఒకటేనంటుంది. ఇదంతా ఒక ప్రహసనం. రాజకీయ అవకాశవాదం. ఇవన్నీ తాము చేస్తూ సిపిఎం, వామపక్షాలపై ఎదురు దాడి చేస్తుంటారు. బిజెపిని గురించి తర్వాత మాట్లాడవచ్చు, రాష్ట్ర సర్కార్లపై ముందు యుద్ధం చేయాలని చిందులేస్తుంటారు. ఇందులో చేతులు కలపకుండా బిఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడమేమిటని తిట్టిపోస్తుంటారు. మునుగోడులో వామపక్షాల మద్దతు కారణంగానే బిఆర్‌ఎస్ గట్టెక్కడంతో ఇలాంటి వారి కోపం మరీ శ్రుతిమించినట్టు కనిపిస్తుంది. కమ్యూనిస్టులేదో పొత్తుల కోసం, సీట్ల కోసం పాకులాడుతున్నట్టు వ్యతిరేకులతో కలసి ఆరోపిస్తుంటారు. మన మీడియా మొత్తం ఈ గాడిలోనే సంచరిస్తుంటుంది గనక షరా మామూలుగా కమ్యూనిస్టులను ఆపహాస్యం చేసేందుకు ఆరాటపడుతుంటుంది. ఈ ఒక్కుమ్మడి దాడితో ఉద్యమాభిమానులలోనూ కొన్నిసార్లు తికమక సృష్టిస్తారు.
- రాష్ట్రాలు, దేశం వేర్వేరా?
ఎ.పి, తెలంగాణ రాజకీయాలు దేశ రాజకీయాలలో భాగం తప్ప విడిగా వుండవు. ఆ రాజకీయాలను నిశితంగానూ జాగ్రత్తగానూ పరిశీలించేవారెవరికైనా బిజెపి పాలన ఎంత ప్రమాదకరంగా తయారైందో తెలుస్తుంది. రాష్ట్రాలను దిష్టిబొమ్మలుగా మార్చి రాజ్యాంగ సూత్రాలను తుంగలో తొక్కి బిజెపి, మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ నిరంకుశాధికారం చలాయిస్తున్న తీరు గతంలో ఎరగం. ఇందిరాగాంధీ ఎమర్జన్సీ నాటికంటే ఈ అప్రకటిత ఎమర్జన్సీ భయంకరంగా సాగుతున్నది. నేను తల్చుకుంటే మీ ప్రభుత్వం వుండేదా అని తెలంగాణ గవర్నర్ తమిళిసై కెసిఆర్‌ను ప్రశ్నిస్తారు. అనేక బిల్లులపై సంతకం చేయకుండా ప్రతిష్టంభన సృష్టిస్తే ఆ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లవలసి వచ్చింది. అక్కడ ఏవో అంగీకరించినట్టు చెప్పి మళ్లీ షరామామూలే! ఎ.పి కి ప్రత్యేక హోదా నిరాకరణ పోలవరం నిధుల బిగింపు రాజధానికి సహాయ నిరాకరణ, రెవెన్యూ లోటు భర్తీకి తిరస్కరణ అన్నీ ఈ పరంపరలోవే. రాజకీయంగా జగన్ సర్కారు ఎంతగా లోబడి వ్యవహరిస్తున్నా మోడీ సర్కారు తీరులో మార్పు లేనే లేదు. గతంలో కెసిఆర్ కూడా చాలా సానుకూలంగా వుండేవారు. దాని వల్ల చీమంత ప్రయోజనం లేదని తెలిశాకే వ్యతిరేక వైఖరి తీసుకున్నట్టురది. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు కూడా 2014-18 మధ్య మోడీ ప్రభుత్వంలో వుండి వారినీ చేర్చుకుని ఆ తర్వాతే ఎన్నికల సమయంలో అడ్డం తిరిగారు. తమాషా ఏమంటే 2019 ఎన్నికల్లో అధిక సీట్లతో గెలిచాక మోడీ నిరంకుశత్వం పెరిగిందే గానీ తగ్గలేదు. చంద్రబాబు మాత్రం అనుకూల వైఖరి ఎత్తుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా 2018-19లో మోడీపై నిప్పులు చెరిగారు. తర్వాత చల్లగా ఆ పక్షానే చేరారు. ఓట్ల చీలిక నివారించాలంటూ బిజెపిని ప్రసన్నం చేసుకోవడానికి తంటాలు పడుతున్నారు. జగన్‌కు వ్యతిరేకత పేరిట బిజెపి, టిడిపి, జనసేన కలవాలనేదే ఈ శిబిరంలో ప్రధాన కాంక్షగా వుంది. తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన తప్ప బిజెపి సమస్య కాదన్నట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తుంది.
కమ్యూనిస్టులకేదో సైద్ధాంతిక చాదస్తం పట్టి బిజెపిని ప్రథమ రాజకీయ ప్రమాదంగా పరిగణిస్తున్నారని వాదించే వారిలో ఈ పార్టీల వారేగాక ఇతరులు కూడా వుంటారు. మొదటే అన్నట్టు ఒక జాతీయ కోణం మితవాద, మతవాద రాజకీయాల ముప్పు వీరికి తెలియదా? ఎన్నికల సంఘం, సుప్రీం కోర్టు, న్యాయ వ్యవస్థ, ప్రతిపక్షాల పాత్ర, విద్యారంగం, చరిత్ర, సైన్సు, ప్రజాస్వామ్యం, లౌకిక భావన, రాష్ట్రాల హక్కులు, పార్లమెంటు చర్చలు, దర్యప్తు సంస్థలు, ప్రభుత్వ రంగం, మహిళల హక్కులు, మత స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, సినిమాల సెన్సార్, కార్మిక ఉద్యోగ హక్కులు వంటి ప్రతి ప్రజాస్వామిక విలువకూ చట్టాలకూ శిలువ వేస్తున్న మోడీ సర్కారును ప్రతిఘటించకపోతే ప్రజాస్వామ్యం ఏమవుతుంది? ఆఖరుకు డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించి మహాత్మా గాంధీ హంతకుణ్ని కూడా దేశ భక్తునిగా చిత్రించిన తర్వాత ఈ దేశ ఘన వారసత్వం ఏమవుతుంది? ఆర్థిక రంగంలోనూ పెద్ద నోట్ల రద్దు వంటి బాధ్యతా రహిత నిర్ణయాలు చేసి మరోవైపున రిజర్వుబ్యాంకు నుంచి అదనపు నిల్వలు ఖాళీ చేస్తున్న వైనాన్ని విస్మరిద్దామా? సామాన్యుల పన్నులను పెంచి వసూళ్లు బిగించి బడా సంపన్నులను కాపాడటం, అదానీ వంటి కళంకిత కుబేరులకు సమస్తం కట్టబెట్టడమే గాక విదేశాలకు అనధికార రాయబారులుగా పంపడం మర్చిపోదామా? కమ్యూనిస్టులు బిజెపి పాలనపై పోరాడాలని చెప్పడంలో కొన్ని కఠోర వాస్తవాలివి.
- మారణహోమంలో అవకాశవాదమా?
రాష్ట్రాల్లో అధికారంకోసం ఏవైనా పార్టీలు జాతీయ ఉపద్రవం వంటి మత రాజకీయాలను కార్పొరేట్ విధాన విన్యాసాలను విస్మరించవచ్చు గాని వామపక్షాలు ఆ పని చేయవు. దేశంలో ఒకమేరకైనా మతతత్వ కేంద్రీకృత పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత పెరుగుతుంటే తెలుగునాట ప్రాంతీయ పక్షాలూ కాంగ్రెస్ కూడా ఆ విషయంలో ఉదాసీనత వహించడం దురదృష్టకరం. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదిరేది, లేనిది అంతిమంగా తేలుతుంది. బిజెపిపై పోరాటం మాత్రం ప్రథమ కర్తవ్యం. ఇక ఎ.పి లోనూ ఎవరితో కలసి పనిచేయాలి? ఎన్నికల పోరాటం ఎలా చేయాలి? అనేది ఈ అంశంపైనే ఆధారపడి వుంటుంది. బిజెపితో ఏ మాత్రం సంబంధం వున్నా తాము ఆమోదించేది వుండదని సిపిఎం ఇప్పటికే స్పష్టం చేసింది.
ఉన్నావోలో గతంలో యువతిపై ఘోర అత్యాచారం ఒకటైతే జైలు నుంచి బెయిలుపై వచ్చిన బిజెపి వర్గీయులు ఆమె ఇంటిని తగలబెట్టి పసికందును, భర్తను బలిగొనడం తాజా ఘట్టం. గుజరాత్‌లో బిల్కిస్ బానోపై పైశాచికంగా అత్యాచారం చేసిన వారికి స్వేచ్ఛ ప్రసాదించిన కేంద్రం, గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం గగుర్పాటు కలిగిస్తుంది. ఇతర మతస్తులపై విద్వేషం రగిలించడమే పనిగా పెట్టుకున్నవారు భిన్న మత నిలయంగా బహుళ సంస్కృతికి ఆటపట్టయిన ఈ దేశానికి ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారు? హైదరాబాదులో ఈ క్షణంలో కూడా సర్జికల్ స్ట్రయిక్స్ గురించి బెదిరించడం చూడలేదా? రాష్ట్ర ప్రభుత్వాల తప్పులపై హానికర నిర్ణయాలపై పోరాడవలసిందే. కానీ ఆ పేరిట బిజెపితో జత కట్టడం దేశానికే చేటు. కనుక బిజెపిపై పోరాటం ఏదో రాజకీయ ఎత్తుగడ కాదు, భారతీయుల రాజ్యాంగ విహిత కర్తవ్యం. దీన్ని వక్రంగా చిత్రించడం లేదా తక్కువ చేసి చూపడం బాధ్యతా రహితం. దురుద్దేశ పూరితం.
తెలకపల్లి రవి