- తుపాను, కల్తీ విత్తనాలు, తెగుళ్ల దాడి
- పడిపోయిన దిగుబడి
- ఆనక ధరల పతనం
- ఆందోళనలో పత్తి, మిర్చి, పొగాకు సాగుదారులు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ మారు వాణిజ్య పంటలు సాగు చేసిన రైతాంగం తీవ్ర ఆందోళన ఎదుర్కొంటున్నారు. ఒక వైపు మాండూస్ తుపాను నష్టం మరో వైపు కల్తీ, నకిలీ విత్తనాలు, కల్తీ నారు, అంతుబట్టని తెగుళ్లు, ఆనక పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్‌లో ధరల పతనం వెరసి పత్తి, మిరప, పొగాకు రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది భారీ నష్టాలు చవి చూడాల్సి వస్తుందని రైతులు నిరాశతో ఉన్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాణిజ్య పంటలను నమ్ముకొని అధిక కౌలు చెల్లించి, భారీగా పెట్టుబడులు పెట్టిన కౌలు రైతులు మరింత ఆవేదన చెందుతున్నారు.
పత్తి .. కన్నీరు
రాష్ట్రంలో సాగయ్యే కర్షియల్ క్రాప్స్‌లో పత్తి, మిర్చి, పొగాకు పంటలది అగ్రభాగం. ఈ తడవ నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటంతో ఖరీఫ్‌లో మొత్తమ్మీద వర్షాలు ఆశాజనకంగా కురిశాయి. పత్తి సాగు కొత్త రికార్డులు బద్దలు కొట్టింది. సాధారణ సాగు విస్తీర్ణం 15.25 లక్షల ఎకరాలు కాగా 9 శాతం అధికంగా 16.62 లక్షల ఎకరాల్లో సాగైంది. నిరుడు 13.05 లక్షల ఎకరాల్లో పడింది. రాయలసీమలో వేరుశనగకు ప్రత్నామ్నామంగా రైతులు పత్తి సాగు చేశారు. నిరుడు ధర కొంత ఆశాజనకంగా ఉండటంతో మెట్ట ప్రాంతాల్లో పత్తికి మళ్లారు. కాగా అకాల వర్షాలు, డ్రైస్పెల్స్, డిసెంబర్‌లో వచ్చిన మాండూస్ తుపాన్ వలన పత్తి దెబ్బతింది. నకిలీ, కల్తీ, అనుమతుల్లేని గ్లెయిసెల్ విత్తనాల వలన రైతులు నష్టాల పాలయ్యారు. ఒక్కో చోట రెండు మూడు సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. గులాబీ, కాండం తొలుచు తెగుళ్లు పంటను దెబ్బతీశాయి. చివరాఖరుకొచ్చేసరికి దిగుబడి పడిపోయింది. ఎకరానికి మామూలుగా 8-12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 2-5 క్వింటాళ్లు రావడం కనాకష్టమవుతోంది. ఇప్పుడే మార్కెట్‌లో ధర పతనమైంది. నిరుడు సీజన్ చివరిలో క్వింటా రూ.9 వేలు పలికింది. ఈ సీజన్‌లోనూ తొలుత అదే ధర కొన్ని రోజులు ఉంది. ప్రస్తుతం 6,500 రావడం గగనమవుతోంది. ప్రభుత్వం ప్రకటించన కనీస మద్దతు ధర 6,380. దిగుబడి తగ్గినప్పటికీ ధర వస్తుందనుకున్న రైతులకు ధరల పతనం కుంగదీస్తోంది. సిసిఐ చాలా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు తెరవకపోడంతో ప్రైవేటు వ్యాపారులు, దళారీల దోపిడీ ఎక్కువైంది.
మిర్చి.. మంట
అంతుబట్టని తెగుళ్లతో నిరుడు మిర్చి రైతులు అపార నష్టాలు చవి చూడగా తిరిగి ఈ ఏడాది సైతం ఆ పంట నిరుడు కంటే అధిక విస్తీర్ణంలో సాగైంది. నార్మల్ 3.62 లక్షల ఎకరాలు కాగా 5.55 లక్షల ఎకరాల్లో, నార్మల్ కంటే 53 శాతం ఎక్కువ సాగు చేశారు. నిరుడు 4.6 లక్షల ఎకరాల్లో వేశారు. గతేడాది బొబ్బర, తామర, ఎర్రనల్లి, దోమ తెగుళ్లు వ్యాపించి మిర్చి పంట ఊడ్చుకుపోయింది. ఈ తడవ కూడా చాలా చోట్ల తెగుళ్లు విజృంభాయి. తుపాను, వర్షాలు, డ్రైస్పెల్స్, కల్తీనారు రైతులను నష్టపర్చాయి. ఇదే సమయంలో మార్కెట్‌లో ధర రూ.10 వేలకు అటూ ఇటూగా ఉంది.ఇంకా కోతలు పూర్తి కాలేదు. దిగుబడి సగానకి సగం తగ్గుతుందంటున్నారు. మార్కెట్‌కు పంట ముమ్మరంగా వస్తే ఇంకా ధర పతనమయ్యే అవకాశం ఉంది. నిరుడు సీజన్ చివరిలో మిర్చి ధర 20 వేలు తాకింది. ఆ ధర రైతులు పంట అమ్ముకున్నాక వచ్చింది.
పొగాకు... ఘాటు
పొగాకు పంటలను సైతం మాండూస్ తుపాన్ దెబ్బ తీసింది. ఈ ఏడాది 1.77 లక్షల ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. అత్యధికంగా ప్రకాశంలో 55 వేల ఎకరాల్లో వేశారు. నెల్లూరులో 13 వేల ఎకరాల్లో వేశారు. ఇంకా తూర్పుగోదావరి, కర్నూలు, కడప, చిత్తూరు, గుంటూరు, పల్నాడు, బాపట్లలో వేశారు. వర్షాలతో సగానికిపైన విస్తీర్ణంలో పోయింది. ఎకరానికి లక్షకుపైన పెట్టుబడి పెట్టిన రైతులు, కౌలు రైతులు నష్టపరిహారం కోసం ఆందోళనలు చేస్తున్నారు.










