Jun 04,2023 06:32

ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక రంగాన్ని పునరుద్ధరించి వర్గపోరాట దిశగా నడిపించడంలో పర్స సత్యనారాయణ, నండూరి ప్రసాదరావుల పాత్ర కీలకమైనది. నండూరి ప్రసాదరావు పేరు మీదున్న విశాఖ జిల్లా సిఐటియు కార్యాలయాన్ని 2005లో పర్స ప్రారంభించారు. వీరిద్దరూ రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో, జిల్లాల్లో కార్మికోద్యమానికి పునాదులు వేశారు. పర్స 1924 జూన్‌ 4వ తేదీన జన్మించారు. 2023 జూన్‌ 4 నుంచి 2024 వరకు పర్స ''శత జయంతి'' నిర్వహించాలని సిఐటియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటి నిర్ణయించింది. ఈ సంవత్సర కాలమంతా పర్స సత్యనారాయణ పేరుతో విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని సిఐటియు ఆశిస్తున్నది. విశాఖలో జూన్‌ 4న పర్స శత జయంతి ప్రారంభ సభతో ఈ కార్యక్రమాలు మొదలవుతాయి.
పర్స సత్యనారాయణ వయోభారంతో 91వ ఏట 2015 మే 22న ఏలూరులో తుది శ్వాస విడిచారు. ఆయన ఏలూరులో తన కుమార్తె లీల, అల్లుడు మంతెన సీతారాం వద్ద తుది జీవితం గడిపారు. ఆయన భార్య భారతీదేవి ఇటీవల మరణించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరంతా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నవారే. పర్స జీవితం ఎక్కువ భాగం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోనే గడిచింది. 1947 చివరిలో అరెస్టయిన పర్సా 1953 జనవరి వరకు 6 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత 1964 డిసెంబర్‌ 31 నుంచి 1966 మే దాకా జైల్లో ఉన్నారు. పార్టీ పనుల మీద కొత్త గూడెం వచ్చి రహస్యంగా తిరుగుతున్న సమయంలో పోలీసులు పసిగట్టి అరెస్ట్‌ చేసి వరంగల్‌ జైల్లో పెట్టారు. 1949 మార్చిలో ఔరంగాబాద్‌ జైలు నుంచి తప్పించుకొని తిరిగి అడవి ప్రాంతంలోకి వెళ్ళి మరలా ఉద్యమంలో పాల్గొన్నారు. తెంగాణ ఉద్యమం సందర్భంగా మరో నాలుగేళ్ళు జైల్లో ఉన్నారు. తన పందొమ్మిదవ సంవత్సరంలో పర్స కొత్తగూడెంలో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. సింగరేణి బొగ్గు గనిలో రెండేళ్ళ పాటు పర్మినెంట్‌ ఉద్యోగం చేశారు. తరువాత ఉద్యోగం వదిలి ఉద్యమంలో చేరారు. 72 ఏళ్ళ ఉద్యమ కాలంలో ఏనాడూ సంపాదన కోసం వెంపర్లాడలేదు. చనిపోయేనాటికి ఆయనకు సొంత గూడు కూడా లేదు. 1962లో పాల్వంచ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగేళ్ళు పనిచేసి ''విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు'' ఉద్యమంలో భాగంగా పదవులకు రాజీనామా చేశారు. జీవితమంతా ప్రజల కోసం, ప్రజా ఉద్యమం కోసం ధారపోసిన యోధుడు కామ్రేడ్‌ పర్స. ఆయన జీవితం మొత్తం కష్టాలే. కాష్టాలెన్ని ఉన్నా తమ ఆశయాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలన్నదే ఆయన పట్టుదల. సోషలిజం ద్వారానే కార్మిక వర్గ రాజ్యం ఏర్పడుతుంది. కార్మికులకు విద్య, వైద్యం, ఉపాధి లాంటి హక్కులు సాధ్యమవుతాయని ప్రతి సభలోను ప్రబోధించేవారు.
1944లో 19వ ఏట సింగరేణి నుంచి వలంటీర్‌గా ఖమ్మంలో జరిగిన ఆంధ్ర మహాసభకు పర్స హాజరయ్యారు. ఆ మహాసభ లోనే అనేక మంది నాయకులతో ఆయనకు పరిచయం ఏర్పడింది. రావి నారయణ రెడ్డి, రామనాధం, ఎల్లారెడ్డి, రాజబహుదూర్‌ గౌడ్‌, రమణయ్యల పరిచయం...ఆ తరువాత ఉద్యమంలో ఉత్సాహంగా పని చెయ్యటానికి ఎంతగానో తోడ్పడింది. 1944లో ఆలిండియా కిసాన్‌ సభ (రైతు) మహాసభ విజయవాడలో జరిగింది. ఆ తరువాత కొద్ది నెలలకే ఆంధ్ర మహాసభ జరిగింది. ఈ మహాసభ తరువాత తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల రెండు చోట్ల చారిత్రాత్మక వీర తెలంగాణ విప్లవ పోరాటం సాగటానికి నాంది పలికింది. ఈ ఉద్యమాలన్నింటితోనూ పర్స జీవితం పెనవేసుకుపోయింది.
పర్స సత్సనారాయణ జీవితం కార్మికుడిగా ప్రారంభమయ్యింది. విప్లవం కోసం వృత్తిని వదిలి తెలంగాణ నైజాం రజాకార్ల దోపిడీని, దుర్మార్గాలను ఎదిరించి ప్రజలకు విముక్తి కల్పించటంలో అగ్ర భాగాన ఉన్నారు. దేశంలోకెల్లా భారీ బొగ్గు పరిశ్రమ సింగరేణిలో కార్మికులకు ఎనలేని సేవలు చేశారు. సిఐటియు ఏర్పడిన తరువాత రాష్ట్ర అధ్యక్షులుగా 1970 నుంచి 2002 వరకు సుదీర్ఘకాలం కొనసాగారు. 60వ దశకంలో కార్మిక వర్గంలో వచ్చిన మితవాద ధోరణులకు వ్యతిరేకంగా పట్టుదలగా పోరాడిన అగ్ర నాయకుల్లో పర్స ఒకరు. ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత బలహీనంగా ఉన్న ఉద్యమం 1980 నాటికి ఒక దశాబ్దంలో ఇతర ట్రేడ్‌ యూనియన్లతో సమాన స్థాయికి తీసుకురావడంలో పర్స, నండూరి కృషి మరువరానిది. కార్మికుల కింది స్థాయి వరకు వెళ్ళి కార్యకర్తలను గుర్తించి ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పారు. పోస్టు కార్డు ముక్కతోనే కార్యకర్తలను నిత్యం ఉత్సాహపరిచేవారు. రాష్ట్రంలోని అన్ని పారిశ్రామిక కేంద్రాల్లో కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో అద్వితీయమైన కృషి చేశారు. సమరశీల పోరాటాలు నడిపారు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ లాంటి కీలక ప్రాంతాల్లో కార్మికోద్యమాలకు ఓనమాలు దిద్ది కార్మిక సంఘాలను చైతన్యవంతంగా నడిపించారు.
ప్రచారంలో పర్స దిట్ట. ప్రపంచ భూగోళం పాఠం చెప్పటంలో ఆయనకు మరెవరూ సరిలేరని చెప్పవచ్చు. ప్రపంచ యుద్ధాన్ని వర్ణించటం, సామ్రాజ్యవాదుల దుర్మార్గాలను ఎండగట్టడం, అతి సాధారణ కార్యకర్తలు కూడా అర్ధం చేసుకునేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. సాధారణ స్టడీ సర్కిళ్లను కూడా అంతే శ్రద్ధగా పాఠకులు అర్ధం చేసుకునేటట్లు వివరించేవారు. 'కార్మిక లోకం' పత్రికలో ఆయన వ్యాసాలు, కథనాలకు ఒక ప్రత్యేకత ఉండేది. వ్యంగ్య రచన ఆయన సొంతం. కార్మిక వర్గానికి రాజకీయ చైతన్యం కల్పించటానికి నిరంతరం వెన్ను తట్టేవారు. వారి జీవిత అనుభవాలను ఆకళింపచేసుకొని కార్మిక ఉద్యమాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌. నర్సింగరావు