Jun 07,2023 13:26

ప్రజాశక్తి - మార్టూరు రూరల్‌ (బాపట్ల) : బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో తల్లికి, కుమారుడికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం మార్టూరు సమీపంలోని జన్నతాళి భారత్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద జరిగింది.

హై వే మొబైల్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... బల్లికురవ మండలం కొణిదెన బిసి కాలనీకి చెందిన ఒంటిపురి ప్రేమ్‌ కుమార్‌ తన తల్లి శ్రీలీల తో కలిసి ఇటీవల కొన్న కొత్త బైక్‌ పై మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో గత వారం నుండి జరుగుతున్న అంకమ్మ తల్లి కొలువులకు హాజరయ్యారు. అనంతరం తిరిగి కొణిదెన వెళుతూ జన్నతాళి వద్ద పెట్రోల్‌ కొట్టించుకొని జాతీయరహాదారి పైకి వచ్చే క్రమంలో బైక్‌ ఒక్క సారిగా అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చిలకలూరిపేట ప్రైవేట్‌ వైద్యశాలకు క్షతగాత్రుల బంధువులు తరలించారు. వీరిలో ప్రేమ్‌ కుమార్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.