Mar 30,2023 06:40

దేశంలోని అన్ని స్టీల్‌ప్లాంట్లకు ఇనుప ఖనిజం లభిస్తున్నది. అందరి కంటే ఎక్కువ ధరకు మార్కెట్‌లో కొనుక్కొనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మాత్రం ముడి ఖనిజం అందుబాటులో ఎందుకు లేదు? అన్ని స్టీల్‌ప్లాంట్లకు ముడి ఖనిజం, బొగ్గు సప్లరు చేసే రైల్వే ర్యాక్‌లు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఎందుకు లభ్యం కావు? గత 30 సంవత్సరాల నుంచి ఉత్పత్తికి కావలసిన పెట్టుబడులకు ఎన్నడూ కొదవలేదు. కానీ గత సంవత్సరంలో రూ.945 కోట్లు లాభాలు వచ్చినా ముడిసరుకు కొనడానికి పెట్టుబడులు లేవనే వంకతో నేడు యాజమాన్యం ఎక్స్‌ ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఐఓపి)ని ఏకపక్షంగా ప్రకటించింది. ప్రైవేటు వారిని ఏదో రూపంలో దూర్చడానికి బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తోందని అధికారులు, కార్మికులు భావిస్తున్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం దుర్మార్గంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మాలని కుట్ర చేస్తున్నా రాష్ట్రం లోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, ప్రతిపక్ష తెలుగుదేశం తగినట్లుగా స్పందించడం లేదు. ఈ పార్టీల ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ప్రశ్నలు వేస్తున్నారు. కేంద్ర బిజెపి తప్పుడు సమాచారంతో వీరి నోరు మూయిస్తున్నది. రాష్ట్ర ప్రజలను బిజెపి పక్కదారి పట్టించి గందరగోళ పరుస్తున్నది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లోని 4 వేల ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని వైసిపి డిమాండ్‌ చేస్తోంది. పోస్కో, అదానీలకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌, అందులోని మిగిలిన భూములను రాష్ట్ర ప్రభుత్వం దొంగలు దొంగ లు ఊళ్ళు పంచుకున్న ట్లుగా పంచుకోవాలని పన్నాగాలు పన్నుతున్నారు. వాస్తవ రాజకీయ పరిస్థితిని ప్రజలు అర్ధం చేసుకొని ఏప్రిల్‌ 1న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని కోరుతున్నాం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం అమ్మాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం 27.1.2021న నిర్ణయించింది. అప్పటి నుండి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 నెలల నుంచి నిరవధిక పోరాటం సాగుతున్నది. విశాఖ నగరంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షలు ప్రారంభించి ఏప్రిల్‌ 1వ తేదీకి 700 రోజు లు కావస్తున్నది. ఆ రోజున విశాఖలో భారీ మానవ హారం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని రాష్ట్ర కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు పిలుపు నిచ్చాయి. ఈ పోరాట ఫలితంగానే నేటకీి ఒక్క శాతం కూడా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వాటాలు అమ్మకుండా అడ్డుకోగ లిగింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం పూర్తియ్యే నాటికి సరళీకరణ విధానాలు దేశంలో ప్రారంభమైనాయి. అప్పటి నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పెట్టుబడులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వాలు నిరాకరించాయి. కేవలం రూ.5 వేల కోట్లు పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వం నిధులు అపేసింది. కానీ విశాఖ స్టీల్‌ తమ సొంత లాభాలతోనే స్టీల్‌ప్లాంట్‌ను ఒక మిలియన్‌ టన్నుల నుంచి 7.2 మిలియన్‌ టన్నుల సామర్ధ్యానికి విస్తరించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సుమారుగా రూ.50 వేల కోట్ల పన్నులు, డివిడెండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించింది. 2000 సంవత్సరంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌కు అమ్మాలన్న నాటి వాజ్‌పేయి ప్రభుత్వ ప్రయత్నాలను స్టీల్‌ కార్మికులు పోరాటాలతో వమ్ము చేశారు. భారతదేశంలో స్వాతంత్య్రం అనంతరం సోషలిస్ట్‌ దేశాల సహాయంతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల స్థాపనతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాం. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ముందు పీఠిన నిలబడ్డాయి. దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు పారిశ్రామిక ప్రాంతాలుగా ఎదిగి నేడు అభివృద్ధి ప్రాంతాలుగా మారాయి. ఉపాధి భారీగా పెరిగింది. ఎస్‌టి, ఎస్‌సి, బిసి లకు ఉపాధి లభించింది. అభివృద్ధి చెందిన ప్రభుత్వ రంగాన్ని అమాంతంగా మింగేయడానికి పాలకవర్గం 1991 నుంచి సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టింది. గతంలో కాంగ్రెస్‌, నేడు బిజెపి పోటీ పడి మరీ ఈ విధానాలను అమలు చేస్తున్నాయి. దేశ సంపదైన భూములు, గనులు, భారీ పరిశ్రమలు, సముద్ర తీరాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. ''పరిశ్రమలను నడపం. భారీ పరిశ్రమలన్నింటిని అమ్మేస్తాం లేదా మూసివేస్తాం'' అనే తప్పుడు విధానాన్ని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్‌లోనే ప్రకటించింది. ఈ విధానాలను అమలు చేయడానికి నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్నది. భారీ పరిశ్రమలను స్వదేశీ, విదేశీ కంపెనీలకు కారుచౌకగా అమ్మడం దేశద్రోహం. రాష్ట్రంలోకెల్లా భారీ పరిశ్రమలకు మణిహారమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దక్షిణ కొరియా పోస్కోకు, అదానీకి అమ్మేపనిలో బిజెపి కేంద్ర ప్రభుత్వం నేడు తలమునకలుగా వున్నది. దేశంలో అన్ని ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ స్టీల్‌ప్లాంట్లకు సొంత గనులున్నాయి. కానీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఎన్ని పోరాటాలు చేసినా సొంత గనులను కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వడానికి నిరాకరించాయి. సొంత గనులున్న స్టీల్‌ ఆధారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)లో కలపడానికి కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డుతున్నది. పార్లమెంట్‌లో నిరాకరిస్తూ సమాధానం చెప్పింది. దీనివలన సొంత గనులున్న స్టీల్‌ప్లాంట్‌కు ఒక్క టన్ను ఇనుప ఖనిజం రూ. 700 అయితే...విశాఖ స్టీల్‌ప్లాంట్‌ మార్కెట్‌లో టన్ను రూ. 5 వేల నుంచి రూ. 7 వేలకు కొనవలసి వస్తున్నది. దేశంలో ఏ స్టీల్‌ప్లాంట్‌కు పక్కనే సముద్రం లేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పోర్టు నిర్మించడానికి తీసుకున్న భూములతో సహా ఉచితంగా గంగవరం పోర్టును ప్రైవేట్‌వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించాయి. పక్కనే సముద్రం వున్నా ఆ ఆదాయాలు అదానీకి సొంతమయ్యాయి. నేడు సాలీనా 7.2 మిలియన్ల సామర్ధ్యం వున్నప్పటికీ 4.5 మిలియన్ల టన్నుల సామర్ధ్యంతోనే విశాఖ స్టీల్‌ నడుస్తోంది. కేంద్ర బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లోని కీలకమైన విభాగాల్లో ఉత్పత్తిని భారీగా తగ్గించి నష్టాల్లోకి నెట్టింది. దేశవ్యాప్తంగా కిసాన్‌ మోర్చా, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలు మనకు ఆదర్శం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని ఆపాలి. విశాఖ స్టీల్‌కు సొంత గనులు కేటాయించాలి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం ఉత్పత్తి సామర్ధ్యంతో నడపాలి. ఈ డిమాండ్లను సాధించేవరకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పోరాటం నిరంతరంగా కొనసాగుతుంది.

narsingarao

 

 

 

 

 

 

వ్యాసకర్త విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ సిహెచ్‌. నరసింగరావు