
'ఈ పూలకెంత సమానత్వం, ఎంత లౌకికత్వం/ కులమూ లేదు.. మతమూ లేదు/ కదిలే మనుషుల దేహాల మీద.. కదలని శవాల మీద/ అందరి శ్మశానాల్లో సమాధుల మీద/ మందిరాల్లో .. మసీదుల్లో.. చర్చీల్లో/ ఐక్యంగా ఒక్క మాలై ఊగుతాయి కదా!' అంటారో కవి. ఎన్ని రంగుల పూలున్నా... ఆ పూలలో తేడా లేదు. వాటి పరిమళంలోనే తేడా. హంతకుడే అనుచరుడుగా అవతారమెత్తిన చోట దేశభక్తుడే దేశద్రోహిగా చిత్రీకరించబడతాడు. విశ్వమానవ విముక్తిని కోరుకునేవాడు... జాతి విచ్ఛిన్నకారుడి జాబితాలో జమ చేయబడతాడు. దేశం కోసం.. ధర్మం కోసం.. అనే అందమైన నినాదాల మాటున విద్వేషం... విధ్వంసం రాజకీయ విధానంగా చలామణీ అవుతుంటుంది. విశ్వాసాల పేరుతో ప్రతి మనసులో విద్వేషం నింపే కుట్ర జరుగుతోంది. విష ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మనుషుల్లో వివిధ విశ్వాసాలుంటాయి. ఎవరి భక్తి వారిది. ఎవరి ఆధ్యాత్మికత వారిది. కొన్ని విశ్వాసాలు మనిషిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి. మానసిక ఓదార్పును, సాంత్వనను అందిస్తాయి. ఇందులో ఎలాంటి విధ్వంసాలకు, విద్వేషాలకు తావులేదు. 'విద్వేషం పాలించే దేశం ఉంటుందా/ విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా' అన్న కవి సందేహాన్ని పటాపంచలు చేస్తూ... అవి ఎక్కడో కాదు మన దేశంలోనే మన కళ్ల ముందే వున్నాయని అడుగడుగునా ఆవిష్కరింపజేస్తున్నారు. మత విశ్వాసాలను విద్వేషాలుగా మార్చి... జనంలో విభజనను సృష్టించి, ఉద్వేగాలను రెచ్చగొట్టి, విద్వేషాల మంటలు రగిలించి విస్తరించాలనుకుంటున్నారు.
ఈ పరిస్థితి ఎంతదాకా పోయిందంటే... దేశంలో కొనసాగుతోన్న విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. ప్రజలను రెచ్చగొడుతోన్న వారు ఏ మతం వారైనా... వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, కఠినంగా వ్యవహరించాలని అత్యున్నత న్యాయస్థానం సంబంధిత అధికారులను ఆదేశించింది. లేదంటే కోర్టు ధిక్కరణ అభియోగాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రసంగాలు చేసిన వారిపై ఫిర్యాదుతో సంబంధం లేకుండా సుమోటోగా కేసులు నమోదు చేయాలని సూచించింది. 'ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఉన్నామని, ఇప్పటికీ మతం పేరుతో దూషించుకుంటూ మనం ఎక్కడికి వెళుతున్నామని' ప్రశ్నించింది. 'శాస్త్రీయ దృక్పథం ఉండాలని ఆర్టికల్ 51 చెబుతోంది. కానీ, సమాజంలో మతం, దేవుడు పేరుతో ఏం జరుగుతోంది? ఇది చాలా విషాదకరం' అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. సమాజాన్ని తిరోగమనం వైపునకు మళ్ళించాలనుకునే శక్తులకు ఈ హెచ్చరిక ఒక శరాఘాతం. 'దేవుడెక్కడో దాగెనంటూ కొండకోనల వెతుకులాడేవేలా, కన్నుతెరిచిన కానబడడో మనిషి మాత్రుడియందులేడో' అని మహాకవి గురజాడ ప్రశ్నించారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులను తమకు అనుకూలంగా మతతత్వశక్తులు మలచుకుంటున్నాయి. వారికి కార్పొరేట్ శక్తులు సత్తువనిచ్చాయి. ఈ కార్పొరేట్ శక్తుల పడగనీడలో మతతత్వం మరింతగా వేళ్లూనుకుంది. మనిషి మనుగడను దెబ్బతీస్తూ...మత విద్వేషాలను రగిల్చేందుకు, ఒకే దేశం, ఒకే జాతి, ఒకే జెండా, ఒకే భాష, ఒకే సిద్ధాంతం అన్న హిట్లర్ నియంతృత్వ సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోంది.
నేడు మతోన్మాదం లౌకికతత్వం ముసుగు తొడిగి కుప్పిగంతులు వేస్తున్నది. అధర్మం, అసమానతలే అసలైన నీతిగా మారుతోంది. ద్వేషం, అసహనం, మతమౌఢ్యం మూఢనమ్మకం-వంటి వాటిని సృష్టించి చిచ్చు పెట్టేస్తే...మొదట అది తన ఇష్టానుసారం కాలుతూ పోయినా, చివరికి అది కాల్చి బూడిద చేసేది మాత్రం తన సృష్టికి కారణమైన వారినే. 'ఒక మాంత్రికుడు ద్వేషమనే పిశాచిని సృష్టించి పురిగొలిపితే, అది అన్నిటినీ తినొచ్చి, చివరాఖరుకు తన పుట్టుకకు కారణమైన తన తండ్రి మాంత్రికుడిని కూడా తిని తప్తిపడిందట' అంటారు రచయిత దేవనూరు మహదేవ. ఈ సంక్షోభ సమయంలో సమాజాన్ని పురోగమనం వైపునకు నడిపించే అభ్యుదయ పురోగాములు ముందుకు రావాలి. ఈ దుష్ట మాంత్రికుల పీచమణచాలి. సైద్ధాంతికంగా, శాస్త్రీయంగా ప్రశ్నించే పరిస్థితులున్న చోటనే కొత్త ఆలోచనలు పుడతాయి. ద్వేషం కాదు.. దేశం ముఖ్యమని, ఎండిన కడుపులు కాదు... పండిన భూములు కావాలని, ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం కావాలనే సరికొత్త ఆలోచనలతో అభ్యుదయ వాదులు ముందుకు రావాలి.