Oct 16,2022 06:38

ఏకంగా కోకాకోలానే స్పాన్సరర్‌గా ఆవిర్భవించడంతో సదస్సు లక్ష్యమే ప్రశ్నార్ధకంగా మారింది. కార్పొరేట్‌ సంస్థలు ఈ తరహా సదస్సులు, చర్చలను నియంత్రించే అంశం బహిరంగ రహస్యమే! దాదాపుగా ప్రపంచమంతా (200కు పైగా దేశాల్లో) వ్యాపార సామ్రాజ్యం విస్తరించిన కోకాకోలా వంటి బహుళజాతి సంస్థల కనుసన్నల్లోనే సదస్సు జరుగుతుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. పైగా స్పాన్సరర్‌ హోదాలో సదస్సులో జరిగే చర్చల్లోనూ, నిర్ణయాల్లోనూ జోక్యం చేసుకునే అవకాశం కోకాకోలాకు దక్కనుంది. దీంతో చర్చల సరళిని, నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే భాగస్వామ్య దేశాల సదస్సు (కాప్‌) పేరు గొప్ప ఊరు దిబ్బగా మారింది. వాతావరణ మార్పులు, వాటి ప్రభావాలు, మానవాళికి-భూగోళానికి ఎదురయ్యే ప్రమాదాల గురించి మాటల్లో కోటలు దాటించే ఈ సదస్సు ఆచరణలో ఆ పరిస్థితికి కారణమైన ధనిక దేశాలకే వంతపాడుతోంది. సదస్సు ముగిసిన తరువాత వైఫల్యాల తీరుపై విమర్శలు వ్యక్తం కావడం సహజమే! ఈ ఏడాది సదస్సు ప్రారంభానికి ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఈ ఏడాది భారీ లక్ష్యాలతో జరగనున్న కాప్‌ 27 సదస్సును కోకాకోలా స్పాన్సర్‌ చేస్తుండటమే దీనికి కారణం. ప్రపంచంలోనే అతి పెద్ద కాలుష్య కారక కంపెనీల్లో కోకాకోలా ఒకటన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భూగర్భ జలాలను విచ్చలవిడిగా దోచేయడంతో పాటు, పర్యావరణానికి, జీవావరణానికి తీవ్రస్థాయిలో హాని చేసే ప్లాస్టిక్‌ను కోకాకోలా భారీగా వినియోగిస్తుంది. పునర్‌వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్‌ను వినియోగించడంలో కోకాకోలా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఇంత పెద్ద ఎత్తున కాలుష్యానికి కారణమౌతున్న కోకాకోలాకు వాతావరణ సదస్సును స్పాన్సర్‌ చేసే బాధ్యతను అప్పగించడంపై ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ప్రచారం చేయడంతో పాటు ప్రత్యక్ష కార్యక్రమాలకూ సిద్ధమౌతున్నారు. అయితే, సదస్సు నిర్వాహకులు మాత్రం ఈ నిరసనను నామమాత్రంగా కూడా పట్టించుకోవడం లేదు.
కాప్‌-27 ఎక్కడ...?
వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య దేశాల సదస్సు (యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌-27 (యుఎన్‌ఎఫ్‌సిసిసిఒపి-27) ఈ ఏడాది ఈజిప్ట్‌ ఎర్రసముద్రం తీర ప్రాంతంలోని షామ్‌-ఎ-షేక్‌లో నవంబర్‌ ఆరు నుండి 18వ తేదీ వరకు జరగనుంది. సదస్సుకు సంబంధించిన ఎజెండా ఇప్పటికే ఖరారైంది. చారిత్రక బాధ్యత (హిస్టారికల్‌ అకౌంటబిలిటీ), వాతావరణ న్యాయం (క్లైమేట్‌ జస్టిస్‌) నష్టం-నష్టపరిహారం (రిపర్కేషన్స్‌ ఫర్‌ లాస్‌ అండ్‌ డామేజ్‌)...తదితర అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించాలని నిర్ణయించారు. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నప్పటికి వాతావరణ మార్పులకు చారిత్రక బాధ్యత వహించేలా పారిశ్రామిక దేశాలను ఒప్పించాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు భావిస్తున్నాయి. గత సమావేశాల్లోనూ ఈ అంశం చర్చకు వచ్చినప్పటికీ అమెరికాతో పాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాలూ తమ బాధ్యతను అంగీకరించి, ఆ మేరకు అదనపు చర్యలు చేపట్టడానికి సిద్ధపడని విషయం తెలిసిందే. దీంతో తీవ్ర ప్రతిష్టంభన నెలకొని, మిగిలిన విషయాల్లోనూ అడుగు ముందుకు పడని పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు ఏకంగా కోకాకోలానే స్పాన్సరర్‌గా ఆవిర్భవించడంతో సదస్సు లక్ష్యమే ప్రశ్నార్ధకంగా మారింది. కార్పొరేట్‌ సంస్థలు ఈ తరహా సదస్సులు, చర్చలను నియంత్రించే అంశం బహిరంగ రహస్యమే! దాదాపుగా ప్రపంచమంతా (200కు పైగా దేశాల్లో) వ్యాపార సామ్రాజ్యం విస్తరించిన కోకాకోలా వంటి బహుళజాతి సంస్థల కనుసన్నల్లోనే సదస్సు జరుగుతుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. పైగా స్పాన్సరర్‌ హోదాలో సదస్సులో జరిగే చర్చల్లోనూ, నిర్ణయాల్లోనూ జోక్యం చేసుకునే అవకాశం కోకాకోలాకు దక్కనుంది. దీంతో చర్చల సరళిని, నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎంత మొత్తం ...?
గత ఏడాది గ్లాస్గోలో జరిగిన కాప్‌-26ను ఎనిమిది ప్రైవేటు కంపెనీలు కలిసి స్పాన్సర్‌ చేశాయి. దీనికోసం ఆ సంస్థలు 280 మిలియన్‌ డాలర్ల (సుమారుగా 2,300 కోట్ల రూపాయలు) ఒప్పందాన్ని కుదర్చుకున్నాయి. తాజాగా ఈజిప్టులో జరుగుతున్న కాప్‌-27ను ఆ దేశ విదేశాంగ శాఖతో కలిసి కోకాకోలా సంస్థ ఒక్కటే స్పాన్పర్‌ చేస్తోంది. దీనికోసం ఎంత మొత్తంలో ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ గ్లాస్గో సదస్సుకన్నా ఎక్కువ మొత్తమే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సదస్సును భాగస్వామ్య ప్రాతిపదికన నిర్వహించడానికి మరికొన్ని సంస్థలు ముందుకొచ్చినప్పటికీ కోకాకోలాతో పాటు నిర్వాహకులు కూడా అంగీకరించలేదు. ఏ ప్రయోజనాలు లేకుండా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి కోకాకోలా ఎందుకు సిద్ధపడుతుందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
అంతులేని కోకో విధ్వంసం
కోకాకోలా వ్యాపార సామ్రాజ్యం ఎంతగా విస్తరించి ఉందో, అంత స్థాయిలోనే కాలుష్యానికి కారణమవుతోంది. నదులు, సముద్రాలతో పాటు భూమిమీద భారీ స్థాయిలో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని వెదజల్లుతోంది. ఒక అంచనా ప్రకారం ఏడాదికి 120 బిలియన్ల (12 వేల కోట్ల) సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బాటిళ్లను ఆ సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. తాగి పారేసిన ఈ బాటిళ్లు పర్యావరణానికి పెద్ద సవాల్‌గా మారుతున్నాయి. వీటిలో అధికభాగం భూమి మీద నుండి నదులు, సముద్రాలలోకి చేరాయి. ఫలితంగా జలచరాలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నాయి. 2019లో ఆ సంస్థ అధికారికంగా సంవత్సరానికి 5 వేల మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్లు ప్రకటించింది. 2021లో గణాంకాల ప్రకారం కోకాకోలా విడుదల చేస్తున్న గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాలు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 8 శాతం పెరిగాయి. ఃబ్రేక్‌ ఫ్రీ ఫ్రమ్‌ ప్లాస్టిక్‌ః సంస్థ 2021లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నింపే సంస్థల్లో ప్రపంచంలో కోకాకోలాదే మొదటిస్థానం. ఆ ఏడాదే కాదు. అంతకుముందు మూడు సంవత్సరాల్లోనూ ప్లాస్టిక్‌ వ్యర్థాలలో కోకాకోలాదే మొదటి స్థానం. నిరుపయోగంగా మారిన ప్లాస్టిక్‌ సీసాల నుండి ఉత్పన్నమయ్యే ప్రమాదాలతో పాటు, ప్లాస్టిక్‌ ను తయారు చేసే ప్రక్రియ కూడా పెద్ద ఎత్తున కాలుష్యానికి కారణమౌతోంది. ప్లాస్టిక్‌ కాలుష్యంతో పాటు భూగర్భ జలాలకు ఆ సంస్థ కలిగిస్తున్న హాని ఇంతా అంతా కాదు. భారతదేశంలో కోకాకోలా సంస్థ 58 పైగా సమగ్ర బాట్లింగ్‌ ప్లాంట్లను నిర్వహిస్తోంది. దాదాపుగా ఈ అన్ని ప్రాంతాల్లోనూ భూగర్భజలాలు అడుగంటాయి. ఈ జల దోపిడికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేసినా ప్రభుత్వాలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టలేదంటూ 2020 సెప్టెంబర్‌ నెలలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ దాదాపుగా 51 కోట్ల రూపాయల అపరాధ రుసుమును ఈ సంస్థకు విధించింది. ఆ మొత్తాన్ని కోకాకోలా చెల్లించలేదు. అయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం.
గ్రీన్‌ వాషింగ్‌!
పర్యావరణానికి ఒకవైపు హాని చేస్తూ మరోవైపు దానికి భిన్నంగా ఎంతో మేలు చేస్తున్నట్లు మాట్లాడటాన్ని గ్రీన్‌ వాషింగ్‌ అంటారు. ఈ టక్కుటమార విద్యను కోకాకోలా అంతర్జాతీయ వేదికలపై తిరుగులేని విధంగా ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఇలా మాటలను కోటలు దాటించి వాటి ఆచరణను అణుమాత్రం కూడా పట్టించుకోని ఆ సంస్థ తాజాగా కాప్‌-27 స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకోవడానికి ఇటువంటి అసత్యాలే చెప్పింది. 2050 నాటికి నెట్‌ జీరో కార్బన్‌ స్థాయిలను అందుకుంటామని, 2030 నాటికా 25 శాతం ఉద్గారాలను నియంత్రిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే గ్రీన్‌వాషింగ్‌లో భాగంగానే కోకాకోలా ఈ లక్ష్యాలను ప్రకటించిందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాప్‌-27 నుండి ఆ సంస్థను తప్పించాలని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను ఐక్యరాజ్యసమితి ఏ మాత్రం పట్టించుకుంటుందో చూడాలి.

 

వ్యాసకర్త  : వి. రాజగోపాల్‌సెల్‌ : 9490099013