ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకూ విస్తరించాలని నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గత 21 రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షల్లో భాగంగా మంగళవారం చేపట్టిన మహాధర్నాపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. ఛానల్ విస్తరణ పరిధిలోని 50 గ్రామాల ప్రజలు ధర్నాకు తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల నుండి గుంటూరుకు చేరుకునే రహదారుల్లో పలుచోట్ల పోలీసు తనిఖీలు చేపట్టారు. దీక్షల్లో పాల్గొనేందకు వస్తున్న రైతుల్ని అడ్డుకున్నారు. కలెక్టరేట్ వద్ద దీక్షా శిబిరం వద్ద ఉన్న రైతులు, ప్రజా సంఘా నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహన్, మాజీ ఎంపిపి నర్రా బాలకృష్ణ, కాంగ్రెస్ రైతు నాయకులు లావు అంకమ్మచౌదరి, తెలుగు యువత నాయకుడు సాయి సహా సుమారు 20 మందిని పోలీసులు అరెస్ట్ చేసి నల్లపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. వీరిని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు వివిధ పార్టీల నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, తూమాటి శివయ్య పరామర్శించారు. దశాబ్దాలుగా నీటి కోసం పోరాడుతున్న రైతుల న్యాయమైన డిమాండ్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. భూసేకరణకు తక్షణమే నిధులు విడుదల చేసి, ఛానల్ విస్తరణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.