Aug 28,2022 06:38

'తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను/ తెలుగు వల్లభుండ తెలుగొకండ/ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి/ దేశ భాషలందు తెలుగు లెస్స' అంటాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈయనకన్నా ముందుగా 15వ శతాబ్ది తొలి అర్థభాగంలో జీవించిన వినుకొండ వల్లభరాయుడు 'దేశభాషలందు తెలుగు లెస్స' వాక్యాన్ని ఉటంకించారు. ఆయన 'క్రీడాభిరామం' అనే వీధి నాటకాన్ని రచిస్తూ- ఒక పద్యంలో 'జనని సంస్కృతంబు సకల భాషలకును/ దేశ భాషలందు తెలుగు లెస్స/ జగతి దల్లికంటె సౌభాగ్య సంపద/ మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?' అంటూ తెలుగు భాష ప్రాశస్థ్యాన్ని చాటిచెబుతాడు. 'శిల్పపు తెనుగు తోట' అని తిక్కన గుబాళిస్తే... 'తెలుగుల పుణ్యపేటి' అనిపించుకున్నాడు పోతన. 'శ్రీనాథుడు రస ప్రసిద్ధ ధారాధుని' కాగా, పెద్దన 'వడబోత పెట్టిన ఇక్షు(చెరకు) రసం' పంచాడు. అష్టదిగ్గజాల తెలుగు ప్రబంధాల వెలుగు... అన్నమయ్య క్షేత్రయ్య కీర్తనల వెలుగు మన తెలుగు. మొల్ల రామాయణాల మురిపాల తెలుగు... రామదాసు త్యాగయ్యల రమ్యత మన తెలుగు. వేమన, బ్రౌను దొర భావి బాట, గురజాడ, కందుకూరి, గిడుగు వారి అడుగుజాడ మన జుంటితేనెల తెలుగు. కృష్ణశాస్త్రి, జాషువా, శ్రీశ్రీ, తిలక్‌, దాశరథి, సినారె, భరద్వాజ వంటి మహామహుల సాహిత్యపు వెలుగు మన తెలుగు. పద్యం, వచనం, శాస్త్రీయం, జానపదం సమ్మిళిత మధుర ఊట తెలుగు. ఎన్నో ఉప నదులను తనలో కలగలుపుకొన్న గోదావరి... అఖండ ప్రవాహమై కన్నుల పండువ చేసినట్లు-నాటి నుంచి నేటి వరకూ వివిధ బాణీలను, అనేక యాసలను తనలో నింపుకొని, నిండు గోదారిలా... సర్వాలంకృత సరాగ మాలికగా అలరిస్తూన్నది తెలుగుభాష.
ఈ వెలుగులోనే ప్రతి యేడాది ఆగస్టు 29న గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా 'తెలుగుభాషా దినోత్సవం' జరుపుకుంటున్నాం. మరోవైపు పాలకులు తెలుగు భాషకు మంగళం పాడుతున్నారు. మన దేశంలోని భిన్న భాషలను రక్షించడానికి ప్రాంతీయ భాషలకు ప్రత్యేక హోదా కల్పించి, అన్ని భాషలను గౌరవించింది మన రాజ్యాంగం. ప్రతి రాష్ట్రమూ తన సొంత భాష అభివృద్ధికి కృషి చేయాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషను చిన్నచూపు చూస్తోంది. తెలుగు మాధ్యమంలో చదువుకుంటే ఉద్యోగాలు రావని, ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెట్టింది. తల్లిదండ్రులు, ప్రజాసంఘాల గొడవ భరించలేక తెలుగు మాధ్యమం తొలగించలేదని చెబుతున్నప్పటికీ... అది కంటితుడుపు చర్యగానే వుంది. 'తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగు మీద ఖాతరీ లేదండీ' అని కన్యాశుల్కంలో గిరీశం చేసిన ఫిర్యాదులా మారింది ఇప్పటి ఇంగ్లీషు మాధ్యమం స్కూళ్లలో తెలుగుపై ఖాతరీ లేకపోవడం. మాతృభాషలో విద్యాభ్యాసం... ఆలోచనా శక్తిని పెంచుతుంది. సహజ మేధస్సుకు వన్నెలద్దుతుంది. యలవర్తి నాయుడమ్మ, రాజ్‌రెడ్డి వంటి శాస్త్రవేత్తలు ప్రాథమిక విద్యను తెలుగు భాషలో చదువుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగినవారే. 'విజ్ఞాన శాస్త్రాన్ని అమ్మభాషలో బోధించాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. దానివల్ల చిన్నారుల్లో సైన్స్‌ సృజనాత్మకత పెరుగుతుంది' అన్నారు అబ్దుల్‌ కలాం. ప్రభుత్వం మంకుపట్టు వీడాలి. విజ్ఞానశాస్త్రం, సాంకేతిక చదువులకు ఆంగ్లమే శరణ్యమన్న అభిప్రాయాన్ని చెరిపేసుకోవాలి.
'తెలుగువారల తేట మాటల, తెలుగువారల తేనెపాటల తెలుగువారల మధురగీతల తెలియజెప్పర తెలుగుబిడ్డ!' అంటాడు త్రిపురనేని. తెలుగు భాష గొప్పదనం, ఔన్నత్యం, విశిష్టతను రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. తెలుగు ప్రభుత్వాలు చేయలేని పని... తెలుగు ప్రజలంతా చేయగలిగితే- తెలుగు భాష వికాసానికి దీక్షపూనితే... తెలుగు భాషను సుసంపన్నం చేసుకోగలుగుతాం. మరోవైపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశమంతా ఒకే భాష, ఒకే మతం, ఒకే పన్ను అంటూ తమ రహస్య ఎజెండాను... బట్టబయలుచేసి భిన్న భాషల సంస్కృతిని, రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాన్ని వమ్ము చేయపూనుకుంటున్నది. ఈ సాంస్కృతిక నియంతృత్వాన్ని ఎదిరించడం, తెలుగు భాష వైభవాన్ని తిరిగి పాదుకొల్పడం ప్రజలందరి బాధ్యత కూడా. తెలుగు భాషలోని తియ్యందనాన్ని, అమ్మ ప్రేమలోని మకరందాన్ని భవిష్యత్తరాలకు అందించాలంటే- అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు భాషను ఏపుగా ఎదగనిద్దాం. అమ్మభాషను ఆదరిద్దాం!!