
అనంతపురం:అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది.అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ మధ్యాహ్నం 1.10 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం గుర్తించిన పైలట్లు.. సమస్యను సరిదిద్దేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో సీఎం జగన్ నార్పల నుంచి పుట్టపర్తికి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మధ్యాహ్నం 3.20 గంటలకు బత్తలపల్లి, ధర్మవరం మీదుగా పుట్టపర్తి విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. జగన్ ప్రత్యేక విమానం లేదా హెలికాప్టర్ లలో గతంలోను రెండుమూడుసార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి.