లండన్ : అద్దె సంస్కరణల వైఫల్యంపై బ్రిటన్‌లోని రెంటర్స్ (అద్దె చెల్లింపుదారులు) గ్రూప్స్, యూనియన్స్ గురువారం విరుచుకుపడింది. ప్రైవేట్ అద్దెదారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ప్రధాని రిషిసునక్‌కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నాయి. ఇంగ్లండ్‌లో ప్రైవేట్ అద్దెదారులను వేధిస్తున్న అభద్రతను తీవ్రంగా పరిగణించాలని, పార్లమెంటులో కొత్త చట్టాన్ని ఆమోదించడాన్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశాయి. బ్రిటన్ ప్రభుత్వం టెనెంట్స్‌కి సహాయం అందించడానికి బదులుగా పూర్తి విరుద్దంగా ఇంటి యజమానులకు మద్దతు ప్రకటిస్తోందని హెచ్చరించింది. వెస్ట్‌మినిస్టర్ ప్రతిపాదిత బిల్లు ద్వారా అద్దె చెల్లింపుదారుల హక్కులను పరిరక్షించడానికి సంస్కరణలను ప్రకటించిందని, ఇది మేలో మొదటిసారి చదివారని, ఇప్పటివరకు ఆ బిల్లుని పట్టించుకోలేదని పేర్కొన్నారు.
ఈ లేఖపై రెంటర్స్ రీఫార్మ్ కొలైషన్ కో ఆర్డినేటర్, హౌసింగ్ ఛారిటీ షెల్టర్, కమ్యూనిటీ యూనియన్ ఎకార్న్, జోసెఫ్ రౌంట్రీ ఫౌండేషన్, ది నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్, ది బిగ్ ఇష్షూ, సిటిజన్స్ అడ్వైజ్, ఇండిపెండెంట్ ఏజ్ గ్రూపులు సంతకాలు చేశాయి.
జీవన వ్యయం సంక్షోభంతో సతమతమవుతున్న బ్రిటన్‌లో ప్రస్తుతం ఇంటి అద్దెలు కూడా అధికమై రికార్డు స్థాయికి చేరాయని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఓ నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జూన్ నాటికి అద్దెలు 5.1 శాతం పెరిగాయని తెలిపింది. ఇంటి యజమానుల కన్నా రెంటర్స్‌పై ఐదింతల ఆర్థిక భారం పడుతోందని పేర్కొంది.
ఇంగ్లాండ్‌లో తాత్కాలిక వసతి గృహాల్లో నివసించే కుటుంబాలు, చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయికి చేరిందని అధికారిక నిరాశ్రయుల గణాం కాలు మంగళవారం పేర్కొన్నాయి.










