- నాడు-నేడులో రూ.3,300 కోట్లే ఖర్చు
- 104, 108 వ్యయంలోనూ కోతలే
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : అత్యంత కీలకమైన వైద్యారోగ్య రంగాన్ని నిధుల కొరత వేధిస్తోంది. గత కొన్నేళ్లుగా వైద్యంపై ప్రభుత్వాలు అంతగా దృష్టి పెట్టడం లేదు. ఈ రంగానికి కేటాయిస్తున్న అరకొర నిధుల్లోనూ ఖర్చు చేస్తున్నది అంతంతమాత్రమే. వివిధ రంగాల కేటాయింపులు, ఖర్చుల మదింపుపై రాష్ట్ర ఆర్థిక శాఖ రూపొందించిన గణాంకాల్లో ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత టిడిపి ప్రభుత్వం, నేటి వైసిపి ప్రభుత్వ హయాంలో కూడా వ్యయం తక్కువగా ఉన్నట్లు తేలింది.
2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు వైద్యానికి సంబంధించి మూడు కీలక రంగాలపై బడ్జెట్ కేటాయింపులు, చేసిన వ్యయం పరిశీలిస్తే చాలా అంతరం కనిపిస్తోంది. నాడు-నేడులో ఆస్పత్రుల అభివృద్ధి, మౌలిక సౌకర్యాల రంగంలో ఈ తొమ్మిదేళ్లలో రూ.10,526 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. ఇందులో కేవలం రూ.3,299 కోట్లు మాత్రమే వ్యయం కనిపించింది. 2014-15 నుంచి 2018-19 వరకు టిడిపి హయాంలో కేటాయింపులు రూ.1,747 కోట్లతో అతి తక్కువగా రికార్డవగా, వ్యయం రూ.114 కోట్లు నమోదైంది. 2019-10 నుంచి 2022-23 వరకు వైసిపి హయాంలో రూ.8,779 కోట్లు కేటాయించగా, రూ.2,185 కోట్లు మాత్రమే వ్యయం జరిగింది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకానికి సంబంధించి కూడా కేటాయింపుల కన్నా వ్యయం తక్కువగా నమోదైంది. తొమ్మిదేళ్లుగా ఈ పథకాలకు రూ.11,477 కోట్లు కేటాయించగా, రూ.10,171 కోట్లు ఖర్చు చేశారు. ఇటీవల నాలుగేళ్లలో రూ.7,899 కోట్లకుగానూ రూ.5,695 కోట్లు మాత్రమే వ్యయం జరిగినట్లు లెక్కలు తేలాయి. 104, 108 సర్వీసులకు గానూ తొమ్మిదేళ్లలో రూ.1,859 కోట్లు కేటాయింపులు జరగ్గా, రూ.1,241 కోట్లు మాత్రమే వ్యయం జరిగింది. 2019-20 నుంచి ఇప్పటివరకు రూ.13,678 కోట్లు కేటాయించగా, కేవలం రూ.788 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు.
నిధుల లేమి వల్లనే..
బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ, విడుదలలో మాత్రం ఆర్థికశాఖ విధానాలు సమస్యగా మారుతున్నాయి. శాఖల వ్యయం కన్నా ఇతర అవసరాలు పెరిగిపోతుండడంతో నిధుల విడుదల తగ్గిపోతున్నట్లు పలు శాఖల అధికారులు చెబుతున్నారు.











