ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ లోక్‌సభ సచివాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ ఎంపీ పార్లమెంటరీ కమిటీ ముందు బుధవారం హాజరైన తర్వాత సస్పెన్షన్‌ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది. మణిపూర్ హింసాకాండపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అధిర్ రంజన్ చౌదరి ప్రధాని నరేంద్ర మోడీని ధృతరాష్ట్రునితో పోల్చారు. దీంతో, ఆయనను ఈ నెల 11న స్పీకర్ సస్పెండ్ చేశారు. లోక్‌సభ ప్రివిలేజెస్ కమిటీ ముందు హాజరైన అధిర్ రంజన్ చౌదరి.. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదని అన్నారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటులో తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ప్రజల తరుపున మాట్లాడేటప్పుడు ఆవేదన ఉంటుందని, దాన్ని యథావిధిగా బయటపెడతామని చెప్పారు. ఆ క్రమంలో మనసుకు ఏం అనిపిస్తే అది మాట్లాడతామని తెలిపారు. దీంతో బిజెపి సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ కమిటీ అధిర్ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు నివేదిక సమర్పించింది. అనంతరం లోక్‌సభ సచివాలయం అధిర్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.










