- అనుకూలం : 454, వ్యతిరేకం : ఇద్దరు
- తక్షణమే అమలు చేయాలి - ఒబిసిలను విస్మరించారు - చర్చలో విపక్షాలు
- సవరించుకోవచ్చు... ఆమోదించండి : అమిత్ షా - నేడు రాజ్యసభ ముందుకు
న్యూఢిల్లీ: మహిళా బిల్లుకు లోక్‌సభలో ఎట్టకేలకు ఆమోదం లభించింది. దీంతో నూతన పార్లమెంటు భవనంలో ఆమోదం పొందిన మొదటి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు నిలిచింది. చట్ట సభల్లో మహిళలకు 33శాతం సీట్లను రిజర్వుచేయడానికి ఉద్ధేశించిన ఈ బిల్లుపై ఎనిమిది గంటల పాటు చర్చ జరిగింది. చర్చ సందర్భంగా ఎన్నికల ప్రయోజనాలకోసమే బిజెపి ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువస్తోందని, చిత్తశుద్ది ఉంటే 2024 ఎన్నికల్లోనే రిజర్వేషన్ల అమలయ్యేలా బిల్లును రూపొందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఓబిసిలను విస్మరించడంపైనా విమర్శలు కుప్పించాయి. చర్చకు ముగింపుగా మాట్లాడిన హోంమంత్రి అమిత్‌షా ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చారు. ఓబిసిలతో పాటు ఇతర అంశాలేవైనా విస్మరణకు గురైనట్టు భావిస్తే ఎప్పుడైనా సవరించుకోవచ్చని చెప్పారు. బిల్లును ఆమోదించాలని కోరారు. చర్చలో 27 మంది మహిళా ఎంపిలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన ఓటింగ్‌లో 454 మంది బిల్లుకు అనుకూలంగా అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేశారు. మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. రాజ్యాంగ సవరణ కూడా ఉండటంతో మాన్యువల్ పద్ధతి అనుసరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, నూతన పార్లమెంటు భవనంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం విఫలమైందన్న వార్తలు కూడా వచ్చాయి. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను సభ్యులందరికీ అందజేశారు. ఓటింగ్ ప్రక్రియపై లోకసభ సెక్రటరీ జనరల్ వారికి వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపినట్లయితే 'ఎస్' అని ఆకుపచ్చ స్లిప్పుపై రాయాలి. వ్యతిరేకిస్తే ఎరుపు స్లిప్పుపై 'నో' అని రాయాలని చెప్పారు. ఓటింగ్‌కు కొద్దిసేపు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలోకి వచ్చారు. లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది.
- తక్షణమే అమలులోకి : సోనియాగాంధీ
మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలులోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ డిమాండ్ చేశారు. బిల్లుపై చర్చను బుధవారం నాడు లోక్‌సభలో ఆమె ప్రారంభించారు. ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్‌బిల్లును ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సోనియా అదే సమయంలో 2024 ఎన్నికలకు దీనిని వర్తింపచేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఇంకా ఎంత కాలం ఎదురుచూడాలి?' అని ఆమె ప్రశ్నించారు. 'ఈ బిల్లు ఆమోదం పొందాలని మేం కోరుకుంటున్నాం. అదే సమయంలో కొంత ఆందోళన కూడా ఉంది. మహిళలు 13 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. మీరు ఇంకా ఎదురుచూడమంటున్నారు. ఇలా ఎంతకాలం? తక్షణమే బిల్లును అమలులోకి తీసుకురావాలి. ఆలస్యమైతే అన్యాయం జరుగుతుంది. మొత్తం ఒకే కోటా అంటున్నారు. కానీ, ఎస్‌సి,ఎస్‌టి, ఓబిసి మహిళలకు సబ్ కోటా ఏర్పాటు చేయాలి. అప్పుడే వారికి పూర్తి న్యాయం జరుగుతుంది. దీనికోసం అవసరమైతే వెంటనే కుల గణన జరపాలి.' అని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్‌గాంధీ స్వప్నమని చెప్పారు. అందువల్లే తనకు ఉద్విగభరితంగా ఉందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజీవ్‌గాంధీ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టారని, అప్పుడది ఏడు ఓట్ల తేడాతో వీగిపోయిందన్నారు. ఆ తరువాత పివి నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో మరోసారి ఆ బిల్లును ప్రవేశపెట్టి, కాంగ్రెస్ పార్టీ అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ఫలితంగా స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు 15 లక్షల మంది మహిళలకు ప్రాతినిధ్యం దక్కిందని చెప్పారు. అంతకు ముందు మాట్లాడిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లుకు ఎన్డీయే ఎంపీలంతా మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు.
- ఇంకా ఎంతకాలం : కనిమొళి
డిఎంకె ఎంపి కనిమొళి మాట్లాడుతూ 'మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకెంతకాలం ఎదురుచూడాలి. అని ప్రశ్నించారు. తక్షణమే బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు నారీ శక్తి వందన్ అధినియమ్ అని పేరు పెట్టారు. మాకు సెల్యూట్ చేసి వందనాలు చేయనక్కర్లేదు. పీఠాలు వేసి పూజలు చేయాల్సిన అవసరం లేదు. సమానంగా గౌరవిస్తే చాలు' అని చెప్పారు.
- అసంపూర్తిగా ఉంది : రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మాట్లాడుతూ 'ఇది (మహిళా రిజర్వేషన్ బిల్లు) ఒక పెద్ద అడుగు. మన దేశంలోని మహిళలకు ఇది చాలా ముఖ్యమైన దశ అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అయితే నా దృష్టిలో ఒక అంశం ఉంది. ఈ బిల్లును అసంపూర్తిగా ఉంది, ఈ బిల్లులో ఒబిసి రిజర్వేషన్‌ను చేర్చాలని నేను కోరుకుంటున్నాను'' అని తెలిపారు.
- ఎన్నికలు ముగిసిన వెంటనే జనగణన
2024 ఎన్నికలు ముగిసిన వెంటనే జనగణన, నిమోజకవర్గాల పునర్‌విభజన చేపడతామని హోంమత్రి అమిత్‌షా అన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిప అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత అనేది కొన్ని పార్టీలకు రాజకీయాంశమని అన్నారు. 'ఈ బిల్లును గతంలో నాలుగుసార్లు తెచ్చినప్పటికీ ఆమోదం పొందలేదు. దేవేగౌడ హయాంలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు తెరపైకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉంది. ప్రధాని మోడీ కృషితోనే ఈ బిల్లు సాధ్యమయ్యింది.' అని అన్నారు.










