- పునరుత్పాదక విద్యుత్ శాతం పెంపు.. కారణాలు వివరించని సర్కార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ రంగంలో కార్పొరేట్లకు మరింత అవకాశం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో పునరుత్పాదక విద్యుత్ శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది. పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యత (ఆర్‌పిపిఒ) కింద ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో 17 శాతం పునరుత్పాదక విద్యుత్‌ను డిస్కమ్‌లు తప్పనిసరి తీసుకోవాలనే నిబంధన ఉంది. దీనిని 2022-23లో 18 శాతం, 2023-24లో 19 శాతం, 2024-25లో 20 శాతం, 2025-26లో 22 శాతం, 2026-27లో 24 శాతానికి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) కార్యదర్శి కె రాజబాపయ్య గెజిట్ విడుదల చేశారు. అయితే ఈ విద్యుత్ ఎందుకు పెంచారో కారణాలను వెల్లడించలేదు. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ డిమాండ్ ఎంత ఉంది? ఇందులో ఎంత వరకు విద్యుత్ అందుబాటులో ఉంది? పునరుత్పాదక విద్యుత్‌ను ఎంతశాతం తీసుకుంటున్నాం? అనే అంశాలను ఇఆర్‌సి బయటకు చెప్పాల్సి ఉన్నా.. చెప్పలేదు. పునరుత్పాదక విద్యుత్‌ను పెంచడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటనే అంశాన్ని కూడా పొందుపరచలేదు. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి ఉన్నా పట్టించుకోకుండా గెజిట్ మాత్రం విడుదల చేసింది. ఇప్పటికే అవసరం లేకపోయినా పునరుత్పాదక విద్యుత్‌ను బయట మార్కెట్ నుంచి అధిక ధరకు విద్యుత్ పంపిణీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయనే విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అదానీకి లాభం చేకూర్చేలా ఉందని విద్యుత్ నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయానికి 30 ఏళ్లు ఉచిత విద్యుత్ అందిస్తామనే పేరుతో సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఈ విద్యుత్ అందించేది అదానీనే. అదేవిధంగా రూ.24,832.43 కోట్ల విలువైన 7 పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను అదానీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పాలని చూస్తుంది. అనంతపురం జిల్లాలో సోలార్ పవర్ ప్లాంటు కోసం అదానీకి 75 వేల ఎకరాలను కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
దీంతో రాబోయే కాలంలో అదానీ విద్యుత్ కంపెనీలతో రాష్ట్రవిద్యుత్ సంస్థలు తప్పనిసరి ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. ఇప్పటికే పునరుత్పాదక విద్యుత్ ఎక్కువగా తీసుకోవడం వల్ల థర్మల్ విద్యుత్ ఉత్పిత్తిని నిలిపివేయాల్సి వస్తుందని డిస్కమ్‌లు ఇఆర్‌సి ముందుకు పలు సందర్భాల్లో తీసుకొచ్చాయి. ప్లాంట్లను నిలిపివేసి అధిక ధరకు తీసుకోవడం వల్ల సుమారు రూ.5వేలకోట్లు నష్టం డిస్కమ్‌లకు వస్తుందని ఇఆర్‌సితో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాశాయి. థర్మల్ విద్యుత్ మిగులు ఉన్న కూడా పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ అంశంపై డిస్కమ్‌లు, విద్యుత్ నిపుణులు, విద్యుత్ ఇంజినీర్ల సంఘాలు ఇఆర్‌సి ముందు మొరపెట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాలు రాబోయే కాలంలో ప్రజలపై మరింత విద్యుత్ భారాలు మోపే ప్రమాదం ఉంది.










