
ప్రధాని మోడీ విధానాలకు, చర్యలకు మద్దతిస్తున్నానని మంగళవారం ఆంగ్ల వార్తా చానల్ రిపబ్లికన్ టి.వి. నిర్వహించిన ముఖాముఖిలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యక్తపర్చిన అభిప్రాయం దేశం, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇంకో ఏడాదిలో ఎన్నికలనగా చంద్రబాబు నోట మోడీ అనుకూలత 'జాలువారడం'తో సహజంగానే పరిపరి విధాల ఊహాగానాలకు కథా వస్తువుగా మారింది. మోడీ పాలనా వైఫల్యాలపై దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు పోరాటానికి సమాయత్తమవుతున్న సమయాన ఎన్‌డిఎ యేతర పార్టీ టిడిపికి జాతీయ అధ్యక్షునిగా ఉన్న బాబు, మోడీ ప్రభుత్వ విధానాలను బేషరతుగా సమర్ధించడం దేనికి సంకేతం? దేశాభివృద్ధి కోసం మోడీ ప్రతిపాదించిన 'విజన్ 2047'కు తాను అనుకూలమని బాబు ప్రకటించారు. తాను పాతికేళ్ల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 'విజన్ 2020'ని తీసుకురాగా అదే తరహాలో మోడీ రాబోయే కాలానికి దేశానికి విజన్ అందించారని బాబు శ్లాఘించడానికి 'విజన్' అనే పదమొక్కటే సారూప్యత కాదు. విజన్ మాటున దాగున్న ప్రభుత్వరంగ ధ్వంసరచన, కార్పొరేట్ల దోపిడీని సులభతరం చేసే ఎన్నో అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే చంద్రబాబు మోడీని రెండు చేతులా సమర్ధిస్తున్నారు.
తొమ్మిదేళ్ల మోడీ పాలనలో ఏ విధానాలు, చర్యలు చంద్రబాబుకు అమితంగా నచ్చాయో ఆయన చెబితేనే బాగుంటుంది. ప్రభుత్వరంగాన్ని చుట్టచుట్టి అమ్మడమా? దేశ ఆర్థిక వ్యవస్థను కబళించిన అదానీకి కొమ్ముకాయడమా? పార్లమెంట్‌ను నడవనీకుండా అధికారపక్షమే అడ్డుకొని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమా? గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకొని ప్రజలతో ఎన్నిక కాబడ్డ విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను మోడీ ప్రభుత్వం వేధిస్తోంది. లౌకికవాదాన్ని దెబ్బ తీస్తోంది. రాజ్యాంగ వ్యవస్థల్లోకి హిందూ మతోన్మాద శక్తులను చొప్పిస్తోంది. మత ఘర్షణలను తన కుట్రలతో ప్రేరేపిస్తోంది. మోడీ చర్యలతో రాజ్యాంగానికే పెను ప్రమాదం ఏర్పడిందని, దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లిందని ప్రతిపక్షాలు, మేధావులు, ప్రజలు ఘోషిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఇవన్నీ ఆమోదయోగ్యంగా కితాబిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో. కేంద్ర పెత్తనం, రాష్ట్రాల హక్కుల హననం, గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా నాడు పోరాడింది. మోడీ ప్రభుత్వం సమాఖ్య వాదాన్ని తుంగలో తొక్కుతుండగా చంద్రబాబు ఆ విధానాలపై హర్షం తెలపడం తన పార్టీ అసలు లక్ష్యాన్ని వదిలేయడమే. జమ్మూకాశ్మీర్ విభజన, పౌరసత్వ బిల్లు, యు.పి.లో ముస్లింల ఎన్‌కౌంటర్లు, ముస్లిం రిజర్వేషన్ల రద్దు, దళితులు, ముస్లింలపై గోగూండాల పాశవిక దాడులు... మోడీ జమానాలో జరుగుతున్న ఈ దారుణాలను చంద్రబాబు సమర్ధిస్తున్నారనుకోవాలా? ఆకలి, పేదరికం, ప్రజాస్వామ్యం, పౌర స్వేచ్ఛ అంశాల్లో దేశం అధమంగా ఉందని రేటింగ్ సంస్థలు చెబుతుండగా మోడీ దేశ విశిష్టతను ప్రపంచానికి చాటారనడం సబబేనా?
ప్రత్యేక హోదా సహా విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ ప్రభుత్వానికి బాబు మద్దతివ్వడం రాష్ట్రానికి అన్యాయం తలపెట్టడమే. ప్రజల మనోభావాలతో ముడిపడిన విభజన హామీల కోసం కేంద్రంపై పోరాడాను, విభేదించాను తప్ప ఏనాడూ కేంద్ర విధానాలను వ్యతిరేకించలేదన్నారు చంద్రబాబు. ఈ కాలంలో రాష్ట్రానికి కేంద్రం ఏం ఒరగబెట్టిందని మోడీ విధానాలకు ఇప్పుడు జై కొడుతున్నారు? విభజన హామీల సాధనకు వైసిపి సర్కారు కేంద్రంపై పోరాడకుండా గమ్మున కూర్చుంది. ఈ విషయంపై వైసిపిని తప్పుబడుతున్న చంద్రబాబు, ద్రోహం చేసిన మోడీకి మద్దతివ్వడం ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ అవుతుంది? మోడీ సర్కారు ఆదేశాలతో చెత్తపన్ను, ఆస్తి పన్ను, వ్యవసాయ విద్యుత్ మీటర్లు, నగదు బదిలీతో లబ్ధిదారుల కోతలు అమలవుతున్నాయి. ఈ చర్యలన్నీ ప్రజా సంక్షేమాన్ని కాలరాస్తాయి. వీటికే చంద్రబాబు మద్దతివ్వడం ప్రజలకు నష్టం తప్ప లాభం కాదు. వీటిపై టిడిపి, చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి.