Jul 16,2023 06:28

రవాణా రంగంలో అత్యధిక మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న వారిలో ఆటో రిక్షా డ్రైవర్లది కీలక స్థానం. అయినా కూడా ''దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు'' చందంగా వారి బతుకులున్నాయి. ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రాక, ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించక ఆటో డ్రైవర్లుగా జీవనోపాధి పొందుతున్నారు. నేడు గ్రామాలు, పట్టణాలలో నిరుద్యోగం పెరగడం, ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు ఆటో డ్రైవర్లుగా బతుకుతున్నారు. మారుమూల గ్రామాల నుండి పట్టణాలకు సమయంతో నిమిత్తం లేకుండా రాత్రి, పగలు ప్రయాణికులకు సేవలందిస్తూ అరకొర ఆదాయాలతో జీవనం సాగిస్తున్నారు.
ఆటోల కొనుగోలుకు గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారికి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను బ్యాంకుల నుండి ప్రభుత్వం అందించేది. ప్రస్తుతం ప్రభుత్వము, బ్యాంకుల ద్వారా ఎటువంటి ఆర్థిక సహాయం అందడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫైనాన్స్‌ కంపెనీల వద్ద అప్పు చేస్తున్నారు. ప్రయివేటు ఫైనాన్స్‌ కంపెనీలకు అధిక వడ్డీలు చెల్లించలేక అనేక అవస్థలు పడుతున్నారు. ఒక ఆటో ఖరీదు రూ.3,00,000 దాటిపోవడంతో ఫైనాన్స్‌ వడ్డీలు, కిస్తీలు మరింత భారంగా తయారయ్యాయి. కిస్తీలు పెండింగ్‌ ఉన్నాయని ఎటువంటి నోటీసులు గాని, చట్టబద్ధ నిబంధనలను పాటించకుండా దౌర్జన్యంగా ఆటోలను స్వాధీనం చేసుకొని, అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఫైనాన్సు కంపెనీలను అదుపు చేసే చట్టాలున్నా వాటి పట్ల ఆటో డ్రైవర్లకు సరైన అవగాహన లేకపోవడంతో జీవనోపాధిని కోల్పోతున్నారు. తద్వారా వారి కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతున్నాయి.
ఆటో డ్రైవర్లు రోజుకి 12 గంటలు పనిచేసినా రూ.600 నుండి రూ.800 వరకు మాత్రమే సంపాదించగలుగుతున్నారు. ఇందులో ఫైనాన్స్‌ కిస్తీలకు రూ.300 మినహాయిస్తే ఇంధనం ఖర్చు రూ.300 వుంటుంది. అన్ని ఖర్చులూ పోను రూ.200 నుండి రూ.300 మాత్రమే ఇంటికి చేరుతోంది. దీనికితోడు పోలీసులు విధించే చలానాలు కట్టాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
ప్రమాదాలు జరిగినా కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైనా వడ్డీలకు అప్పు చేసి వైద్యం చేయించడం తప్ప ఇఎస్‌ఐ సౌకర్యం కూడా లేదు. పిల్లల చదువుల నుండి పెళ్లిళ్ల వరకు ఏ కార్యక్రమానికైనా అప్పులు చేయాల్సిందే. సంవత్సరానికి ఒక్కసారి కూడా కొత్త బట్టలు కొనుక్కోలేని దయనీయ పరిస్థితి నెలకొన్నది. కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ స్వయం ఉపాధి పొందుతున్న రవాణా రంగ కార్మికులకు ప్రభుత్వ సహాయం ఎండమావిగా తయారైంది. రవాణా రంగంలో మిగిలిన వాహనాల డ్రైవర్లందరితో కలిపి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని....46వ లేబర్‌ కమిషన్‌ సిఫార్సు చేసినప్పటికీ... తెలుగు రాష్ట్రాలలో నేటికీ సంక్షేమ బోర్డు ఊసే లేదు.
కరోనా కాలంలోను, ఆ తర్వాత కిరాయిలు లేక కుటుంబ పోషణ కష్టమై తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచుతూ మరింత భారాలను మోపాయి. రిజిస్ట్రేషన్‌ చార్జీలు, ఫిట్‌నెస్‌, పర్మిట్‌, ఇన్సూరెన్స్‌ చార్జీల పెంపు, స్పేర్‌ పార్ట్స్‌ (విడిభాగాల)పై జి.ఎస్‌.టి పేరుతో కోట్లాది రూపాయలు ప్రభుత్వాలకు సంపాదించి పెడుతున్నా కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఆటో డ్రైవర్లపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కనీసం ఆటోలను నిలుపుకునేందుకు పార్కింగ్‌ స్థలాలను కూడా కేటాయించక పోవడంతో ఆటోవాలాలు తమ రోజువారీ సంపాదనలో అధిక భాగం పోలీసులు విధించే 'నో పార్కింగ్‌' చలానాలకు చెల్లించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రవాణా రంగ చట్ట సవరణ ఫలితంగా వాహనాలపై విధించే ఫైన్లు అనేక రెట్లు పెరిగిపోయాయి. కార్పొరేట్‌ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా, సింగిల్‌ ఓనర్లను నష్టాలుపాలు చేసేలా, కేంద్ర ప్రభుత్వం రవాణా రంగ చట్ట సవరణ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్ట సవరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన జీవో నెంబర్‌ 21 ఆటో డ్రైవర్లకు ఉరితాడులా తయారైంది.
ఒకపక్క పోలీసులు మరోవైపు ఆర్టీవో ఆఫీసులో ఏజెంట్ల వేధింపులు మరింత భారంగా మారాయి. పేరుకి ఏజెంట్ల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసినా, ఆర్టీవో ఆఫీసుల్లో ఏజెంట్లు లేకుండా నేరుగా వెళ్లిన వారికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. రూ. 450 ఉన్న రిజిస్ట్రేషన్‌కు రూ.1200 వసూలు చేస్తున్నారని, రూ. 660 ఉన్న ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రెన్యువల్‌ కోసం రూ. 2000 చెల్లిస్తున్నామని, రూ. 600 ఉన్న పర్మిట్‌ ఫీజును రూ. 1000 ఏజెంట్లకు ఇవ్వకుంటే పని జరగడం లేదని, ఆటోవాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించే ఆటో రిక్షా రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఆటో డ్రైవర్లు నిత్యం రోడ్లపై ప్రమాదాలకు గురవుతున్నారని, అటువంటి సమయంలో సరైన వైద్యం అందక, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
సంక్షేమ పథకాలను తనకంటే ఎక్కువగా ఎవరూ అందించడం లేదని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వాహనమిత్ర పథకాన్ని కొద్ది మంది ఓనర్లకు ఇచ్చి ఆటో రిక్షా డ్రైవర్లందరికీ ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో దాదాపు 12,64,000 పైగా ఆటోలు ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కో ఆటోకు ఇద్దరు డ్రైవర్ల చొప్పున దాదాపు 25 లక్షల మంది ఉన్నారు. ఉదాహరణకు 2022 సంవత్సరంలో వాహన మిత్ర లబ్ధిదారుల సంఖ్య 2 లక్షల 61 వేలు మాత్రమే. ఈ లెక్కన లబ్ధి పొందిన వారు 15 శాతం మించలేదు. ఉద్యోగ కల్పన పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు వేల ఎకరాలు కేటాయించే ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లకు ఉండేందుకు గృహ వసతి కల్పించకపోవడం అత్యంత దారుణం. లక్షల మందికి ఉపాధి కల్పించే ఆటో రిక్షా రంగానికి ప్రభుత్వం అందించే సాయం గుండు సున్నా.
ఉద్యోగాల కల్పన పేరుతో, కార్పోరేట్లకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం, స్వయం ఉపాధి పొందుతున్న ఆటో రిక్షా కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎటువంటి సామాజిక భద్రత లేని ఆటో డ్రైవర్ల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.

gopi

 

 

 

 

 

/ వ్యాసకర్త : జె. గోపి ఆటో అండ్‌ ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌ ఏలూరు జిల్లా కార్యదర్శి (సి.ఐ.టి.యు.),
సెల్‌: 9948049554 /