Oct 11,2023 10:32
  • వేలాది ఎకరాలపై దోమపోటు
  • సిక్కోలు రైతుకు మరో కష్టం

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : వర్షాభావంతో అసలే పంటలు సరిగా వేయలేని పరిస్థితుల్లో ఉన్న సిక్కోలు రైతులకు మరో కష్టం వచ్చి పడింది. వర్షపాతం కాస్తాకూస్తో నమోదై, సాగునీరు అందించిన ప్రాంతాల్లో పంట సాగవుతోంది. కరువు పరిస్థితుల నుంచి బయటపడిన రైతాంగానికి సుడిదోమ రూపంలో మరో కష్టం వచ్చింది. జిల్లా వ్యాప్తంగా వరికి సుడిదోమ ఆశించించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి పురుగుల మందులు వినియోగిస్తున్నా, అవి ఎంతవరకు పనిచేస్తాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులే సుడిదోమ పోటుకు ప్రధాన కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటల సాగు విస్తీర్ణం తగ్తింది. 4,37,153 ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా, 3,81,833 ఎకరాల్లో మాత్రమే వేయగలిగారు. ఇందులో వరి పంట 3,98,750 వేయాల్సి ఉండగా, 3,53,325 ఎకరాల్లోనే ప్రస్తుతం సాగులో ఉంది. పంట పూర్తి స్థాయిలో చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వేలాది ఎకరాల్లో సుడిదోమ ఆశించింది. దీంతోపాటు కొన్నిచోట్ల కుళ్లు తెగుళ్లు సోకాయి.

33


            ప్రధానంగా స్వర్ణ (ఎండియు 7029), సాంబమసూరి (బిపిటి 5204), శ్రీధృతి (ఎంటియు 1121), మార్టురు సాంబ (ఎంటియు 1224) రకాలతోపాటు ఇతర ప్రయివేట్‌ వరి వంగడాలు సాగు చేస్తున్న పొలాల్లో దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. పొందూరు మండలంలో 2,500 ఎకరాలు, కోటబొమ్మాళి మండలంలో సుమారు 1500 ఎకరాలు, సోంపేటలో 200 ఎకరాలు, జి.సిగడాం మండలంలో వంద ఎకరాల వరకు వరి పంట దోమపోటుకు గురైంది. వ్యవసాయ శాఖాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఎన్ని వేల ఎకరాలకు సుడిదోమ ఆశించిందనే వివరాలు తెలియనున్నాయి. పంట దిగుబడుల పైనా ప్రభావం చూపనుందని అధికారులు చెప్తున్నారు.
 

                                                    శాస్త్రవేత్తలు గుర్తించిన కారణాలు ఇవే...

సుడిదోమ సోకిన పంట పొలాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, రాత్రులు ఒక్కసారిగా చల్లబడడం వంటి తేడాల వల్ల సుడిదోమ వ్యాప్తికి కారణమైందని గుర్తించారు. ఎరువుల కొరత వల్ల పొటాష్‌ తగినంతగా వాడకపోవడమూ మరో కారణంగా భావిస్తున్నారు.
 

                                                          ప్రభుత్వం నుంచి ఏదీ సాయం ?

వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెగుళ్లు, దోమపోటు ఉంటుందనే అంచనా అధికారులకు ఉన్నా, రైతులను అప్రమత్తం చేయలేదు. విత్తనం నుంచి ధాన్యం కొనుగోలు వరకు ఆర్‌బికెలు అంటూ ప్రచారం చేస్తోన్న ప్రభుత్వం... విపత్తు సమయంలో రైతు భరోసా కేంద్రాల నుంచి సబ్సిడీలపై ఉచిత మందులను పంపిణీ చేసే ఆలోచన చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

44

                                                                   పొలమంతా వ్యాపించింది

నేను రెండు ఎకరాల్లో వరి వేశాను. పంట అంతా బాగుందనుకున్న సమ యంలో పొలమంతా సుడిదోమ ఆశించింది. వెంటనే గుర్తించి పురుగుల మందులు వాడాను. వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందోనని ఆందోళనగా ఉంది.
                                                                                - సనపల వెంకటరావు, రైతు, నందిగాం

55

                                                   పురుగుమందుల కోసం రూ.3 వేలు ఖర్చు

సుడిదోమ సోకడంతో రెండు ఎకరాల్లో తెగులు సోకింది. దోమపోటు నివారణ కోసం రూ.మూడు వేలు ఖర్చు చేసి మందులు చల్లాను. దిగుబడి తగ్గవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  - మరిడా ఈశ్వరరావు, రైతు, నందిగాం