
జైపూర్: పోటీ పరీక్షల హబ్‌గా పేరొందిన రాజస్థాన్ కోటాలో నీట్ విద్యార్థుల మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్ కోటాకు వచ్చిన విద్యార్థి నీట్ పరీక్షల కోసం తాను సొంతంగా సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కోటాలో బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజా మరణంతో ఈ ఏడాది విద్యార్థి ఆత్మహత్యల సంఖ్య 26కి చేరడం గమనార్హం.
నీట్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతామనే భయంతోనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కోటాలో విద్యార్థుల మరణాలను అరికట్టడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజా ఆత్మహత్యల నేపథ్యంలో నీట్‌తోపాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రొటీన్ పరీక్షలను రెండు నెలలపాటు నిలిపివేయాలని జిలా యంత్రాంగం ఇటీవల కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లను ఆదేశించింది.