Aug 31,2023 06:15

ప్రజలు ఎదుర్కొంటున్న అధిక ధరలు, నిరుద్యోగ సమస్యలపై దేశవ్యాప్తంగా సిపిఎం ప్రచార ఆందోళనలు చేపట్టింది. మన రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్‌ చార్జీల పెరుగుదలతో పాటు స్థానిక సమస్యలను జోడించి ఆగస్టు 30 నుండి సెప్టెంబర్‌ 4 వరకు సమరభేరి చేస్తున్నది. ప్రజలను విస్తృతంగా కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ సంతకాల సేకరణ, సచివాలయాల వద్ద నిరసనలు, నిరుద్యోగ సమస్యపై చర్చా వేదికలు, సదస్సులు, 4వ తేదీన తహశీల్దార్‌ కార్యాలయాల దగ్గర పెద్దఎత్తున ప్రజలను సమీకరించి ధర్నాలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అధికారం కోసం వ్యక్తిగత దూషణల రాజకీయం చేస్తుంటే, ప్రజల పక్షాన సిపిఎం శ్రేణులు ఉద్యమబాట పట్టాయి.

ఆకాశాన్నంటుతున్న ధరలు

నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన ఈ తొమ్మిది సంవత్సరాల్లో అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు వంద నుండి ఏడు వందల శాతం పెరిగాయి. ధరల పెరుగుదలను నివారించలేని ప్రభుత్వం మన దేశాన్ని ప్రపంచ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకు తీసుకుపోతామని ప్రగల్భాలాలు పలుకుతున్నది. ఇందుకు జి-20 దేశాల సమావేశాన్ని వేదికగా వాడుకుంటున్నది. రిటైల్‌ ధరల పెరుగుదల ఈ సంవత్సరం జూన్‌లో 4.87 శాతం వుండగా జులైలో 7.44 శాతానికి పెరిగింది. సరుకుల ధరల పెరుగుదల 11.5 శాతం, కూరగాయల ధరలు 37.3, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు 13, సుగంధ ద్రవ్యాలు 21.6, పాలు 8.34 శాతానికి పైగా పెరిగాయి. జూన్‌తో పోలిస్తే జులైలో కూరగాయల ధరలు 81.1 శాతం పెరిగాయి. గత పది సంవత్సరాల్లో ఇదే అత్యధిక పెరుగుదల. ఈ ధరల పెరుగుదల ప్రభావం పేద, మధ్యతరగతి ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూయిస్తుంది. ఆదాయంలో పెరుగుదల లేకుండా ధరలు పెరగడం వల్ల గతంలో పొందుతున్న ఆహారాన్ని కూడా ప్రజలు అందుకోలేకపోతారు. దీనివల్ల ఆహార సమస్య, తద్వారా ఆరోగ్య సమస్యలు ఈ వర్గాలపై ముప్పేట దాడి చేస్తాయి. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ తమ ఉత్పత్తులైన వీల్‌, రిన్‌, సర్ఫ్‌ ఎక్సెల్‌, లైఫ్‌బారు తదితర సబ్బులు, డిటర్జెంట్ల ధరలను 3 నుండి 20 శాతం వరకు పెంచింది. మోడీ గద్దెనెక్కిన నాటికి 450 రూపాయలున్న గ్యాస్‌ సిలిండర్‌ ధర నేడు 1150 రూపాయలకు ఎగబాకింది. పెట్రోల్‌, డీజిల్‌ చార్జీలు అంతు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. కందిపప్పు ధర 80 నుండి 160 రూపాయలకు పెరిగింది. మినప్పప్పు, వేరుశనగ, వంటనూనె ధరలు ఈ ఒక్క నెలలోనే 22 శాతం పెరిగాయి. ప్రజలకు బియ్యం అందివ్వడం కంటే ఇథనాల్‌ తయారదీదారుల ప్రయోజనాల కోసం తెల్ల బియ్యం, నూకల బియ్యం ఎగుమతి నిషేధించింది. ధరల పెరుగుదలకు తోడుగా పన్నుల మోత పెరుగుతున్నది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్‌టి పన్నుల విధానం వల్ల కేంద్రానికి పన్నుల ద్వారా వస్తున్న ఆదాయం ప్రతి మూడు నెలలకోమారు పెరుగుతూనే వుంది. ఈ పెరుగుదలను చూపించి మోడీ అనుకూల మీడియా దేశంలో మధ్యతరగతి పెరిగిందని వికృత వాఖ్యానాలు చేస్తున్నది. వాస్తవాన్ని తలకిందులు చేసి మన దేశానికి అతి పెద్ద మార్కెట్‌ పెరుగుతున్న మధ్యతరగతే అని ప్రధాని మాట్లాడుతున్నారు.
ఈ ధరల పెరుగుదలను అరికట్టడంలో ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది. సరుకులను అక్రమంగా దాచి ధరల పెరుగుదలకు కారణమవుతున్న వారి పట్ల తనిఖీలు చేయడం బిజెపి ప్రభుత్వం ఆపేసింది. దీంతో సరుకుల కృత్రిమ కొరత సృష్టించి బడా వ్యాపారులు లాభపడుతుండగా, వీటిని పండించిన రైతులు దివాళా తీస్తున్నారు. ధరల పెరుగుదల నుండి ప్రజలను ఆదుకోవడానికి ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి కనీస సరుకులను సరఫరా చేయాల్సిన కేంద్రం తన ఆధీనంలోని ఎఫ్‌సిఐ గోడౌన్లలో పోగుబడిన ధాన్యాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయకుండా అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నది. ధరల పెరుగుదలపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మోడీ విధానాలను అమలు చేయడానికి పోటీ పడుతున్నది. ధరల పెరుగుదల వల్ల పేదరికం, దారిద్య్రం, అకలి పెరుగుతాయి. 2019 నాటికి దేశంలో 3 కోట్ల 46 లక్షల మంది దారిద్య్ర రేఖకు దిగువన వున్నట్లు సంతోష్‌ మెహరోత్రా విశ్లేషించారు. పేదరికాన్ని గుర్తించే లెక్కలను 2019 తర్వాత నుండి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం నిలిపివేసింది. గణాంక శాఖను నిర్వీర్యం చేసింది.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలెక్కడీ

మొత్తం దేశ జనాభాలో 28 సంవత్సరాల లోపు వున్నవారు 65 శాతం వుండగా, అందులో 25 సంవత్సరాల లోపు వున్నవారు 45 శాతం మంది వున్నారు. 2050 నాటికి కూడా మన దేశ మధ్యస్త సగటు వయసు 38 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి అమెరికా సగటు మధ్య వయసు 40 నుండి 42 సంవత్సరాలు, చైనా 39 నుండి 44 సంవత్సరాలుగా వుంటుంది. రాబోయే 15-20 సంవత్సరాల మధ్య ప్రపంచ పారిశ్రామిక కార్మికశక్తి నాలుగు శాతం తగ్గుతుండగా, మన దేశంలో 32 శాతం పెరుగుతుంది. ప్రతి సంవత్సరం కొత్తగా ఒకటిన్నర కోటి మంది లేబర్‌ మార్కెట్‌లో పని చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరి ఓట్లను కొల్లగొట్టడానికి 2014 ఎన్నికల సమయంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతకు హామీ ఇచ్చి మోడీ అధికారంలోకి వచ్చారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా వున్న ఉద్యోగాలను రద్దు చేశారు. 2017-18లో నిరుద్యోగ రేటు 4.7 శాతం వుండగా, 2018-19 నాటికి 6.3 శాతానికి పెరిగింది. కరోనా వల్ల 2020 సంవత్సరంలో ఒకేసారి 9.1 శాతానికి చేరింది. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుందని తిరిగి వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పాలకులు బడాయి కబుర్లు చెప్పారు. నిజం దాచేస్తే దాగదు కదా! 2022 నాటికి 8.3 శాతం, 2023 మార్చి నాటికి 7.8 శాతానికి నిరుద్యోగం భారీగా పెరిగింది. ఈ జులై నాటికి గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి నిరుద్యోగ రేటు పెరిగింది. మానవ వనరులు అత్యధికంగా వున్న దేశాల్లో మనం మొదటి రెండు, మూడు స్థానాల్లో వున్నాము. ఈ యువత సంఖ్యను చూపించి మన పాలకులు మాది యువ దేశమంటూ భుజకీర్తులు తగిలించుకొని ఊరేగుతున్నారు.
కానీ ఈ యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించకపోతే వారు జీవించడం ఎట్లా? డిగ్రీ, పిజీలు చదివి ఉపాధి హామీ పనులకు వెళుతున్నవారు, వాలంటీర్లుగా, మాల్స్‌లో సేల్స్‌ వర్కర్లుగా, కాంట్రాక్టు కార్మికులుగా అనేకమంది పనిచేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఒక కోటి యాభై లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. వీటిని భర్తీ చేయడంలేదు. దళిత, గిరిజన బ్యాక్‌ లాగ్‌ పోస్టులు లక్షల సంఖ్యలో ఖాళీగా ఉంటున్నాయి. యువతకు కొత్త ఉద్యోగాలు పొందడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. మన దేశంలో 2030 నాటికి సుమారు 2 కోట్ల 90 లక్షల మంది యువత సరైన నైపుణ్యం లేక ఉపాధికి దూరమవుతారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఇటీవల ప్రకటించింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2021 నివేదిక ప్రకారం కూడా విద్యావంతుల్లో ఉద్యోగార్హత కేవలం 50 శాతం లోపు మాత్రమే వుంది. బి.టెక్‌ చదువుకున్న వారిలో 45 శాతం, ఐటిఐ చదువుకున్న వారిలో 75 శాతం మందికి ఉపాధి నైపుణ్యాలు లేవని ఇండియా స్కిల్‌ రిపోర్టు పేర్కొంది. వీరిలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి బదులు తలల్లోకి మతోన్మాదాన్ని ఎక్కించి రాజకీయ లబ్ధి పొందడానికి బిజెపి ప్రభుత్వం శతధా ప్రయత్నిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు, పేదలకు కొద్దిపాటి ఉపాధి కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బిజెపి ప్రభుత్వం నిధుల కోత కోస్తున్నది. ఈ సంవత్సరం బడ్జెట్లో రూ.30 వేల కోట్లు తగ్గించారు.

మోడీ భజనలో తరిస్తున్న జగన్‌ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వ వినాశకర విధానాలను జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్నది. విద్యుత్‌ సంస్కరణలను అమలు చేస్తూ స్మార్ట్‌ మీటర్లు, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నది. గత నాలుగు సంవత్సరాల్లో 7 సార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచి వేల కోట్ల భారాల్ని ప్రజలపై వేసింది. ట్రూఅప్‌ చార్జీలు, సర్‌ చార్జీలు, ఫిక్స్‌డ్‌ చార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ మొదలగు పేర్లతో రెట్టింపు భారాన్ని ప్రజలపై రుద్దారు. వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను, దళితులకు, గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తున్నది. పట్టణ ప్రజలపై ఆస్తిపన్ను, చెత్తపన్నుల భారాన్ని వేసింది. ప్రజలకు ప్రభుత్వం అందించే అన్ని సేవలకు చార్జీలను నిర్ణయించి అమలు చేస్తున్నది. పజా పంపిణీ ద్వారా కేవలం బియ్యాన్ని మాత్రమే అందిస్తున్నారు. గతంలో పేదలకు అందుతున్న కందిపప్పు, నూనె, ఇతర సరఫరాలను పునరుద్ధరించాలి. ఖాళీగా ఉన్న గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు, డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ హామీని అమలు చేయాలి. గిరిజన యువతకు స్పెషల్‌ డిఎస్సీ పెట్టాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పట్టణ పేదలకు జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేయించాలి.
కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు వేలకోట్ల రాయితీలిస్తూ, లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలను అప్పగిస్తుంది. మణిపూర్‌ ఘోరాల గురించి దేశం మొత్తం ఆందోళన చెందుతుంటే కార్పొరేట్‌ సంస్థలు అటవీ సంపదను, భూగర్భ ఖనిజాలను లూటీ చేసుకునేందుకు వీలుగా మొన్న జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో చట్టాలను సవరించింది. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సిలిండర్‌ ధరను తగ్గించింది. గతంలో బీహార్‌ ఎన్నికల సమయంలో లక్ష కోట్ల ప్యాకేజి, వివిధ రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రోలు, డీజల్‌ ధరలు పెంచకపోవడం లేదా కొంత తగ్గించడం, కర్ణాటక ఎన్నికల్లో ఉచిత వాగ్దానాలతో ప్రజలను మోసపుచ్చి వారి ఓట్లను కొల్లగొట్టడం వంటివి బిజెపి కపట రాజకీయాలకు నిదర్శనం. ఈ విధానాలను గుడ్డిగా బలపరిచే ఏ పార్టీ అయినా అంతిమంగా ప్రజా విశ్వాసాన్ని కోల్పోక తప్పదు.cpm

 

 

 

 

వ్యాసకర్త : వి. రాంభూపాల్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు