Oct 20,2023 08:24
  • ప్రజా ప్రణాళిక విడుదల
  • కులగణనకు చట్టబద్ధత కల్పించాలి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం రూపొందించిన ప్రజా ప్రణాళిక అమలు కోసం పోరాడాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సిపిఎం ఆధ్వర్యాన రూపొందించిన ప్రజా ప్రణాళికను గురువారం విజయవాడలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, డి రమాదేవి, వి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నవంబరు 15న ప్రజారక్షణ భేరి పేరుతో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి ముందు మూడు ప్రాంతాల నుంచి బస్సు యాత్రలు బయలుదేరుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాలు సొంత అజెండాల చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. వీటిని ప్రజా సమస్యల చుట్టూ మళ్లించాలనే ప్రయత్నం చేస్తున్నామని, దీనిలో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందని, 339 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయని, కృష్ణా డెల్టాలో కొన్ని వేల ఎకరాల్లో పంట ఎండిపోతోందని వివరించారు. దీనిపై ఎన్యూమరేషన్‌ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుభరోసా కేంద్రాలకు అదనపు సిబ్బందిని నియమించి కరువు నుంచి కాపాడాలని సూచించారు. పంట దెబ్బతినడం వల్ల వరిలో తాలు, తప్ప వస్తుందే తప్ప ఉపయోగం ఉండదని అన్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలకు తాగేందుకు మంచినీరు కూడా లేదని, జ్వరాలు పెరుగుతున్నాయని అన్నారు. వైరల్‌ ఫీవర్లు వస్తే ఎక్కువ రోజులు ఉండటం, వచ్చినవారు నిస్సత్తువగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటుచేసి జ్వరాలకు మూల కారణాలు గుర్తించి దాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కులగణనను తాము స్వాగతిస్తామని అయితే రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ నవంబరు 15 నుంచి కులగణన చేస్తామని చేసిన ప్రకటన నాన్‌ సీరియస్‌గా వుందని, దానికి ఎలాంటి చట్టబద్ధత గానీ, ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ గానీ లేదని తెలిపారు. కులగణనను వలంటీర్లతో చేయిస్తామని చెబుతున్నారని, దీనివల్ల కొత్త తగాదాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. రెవెన్యూ యంత్రాంగం ద్వారానే ఈ సర్వే జరగాలని అన్నారు. ఈ విషయం జాతీయస్థాయిలో వివాదాస్పదంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో సాంకేతికంగా, వివాదరహితంగా చేయాలని అయితే ప్రభుత్వంలో అటువంటి చర్యలేవీ కనిపించడం లేదని విమర్శించారు. కేబినెట్‌ నిర్ణయం తీసుకుని ఒక పద్ధతి ప్రకారం చేయాలని అన్నారు. బిసిలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి కంటే వారి ఓట్లు గుంజుకోవాలనే తాపత్రయమే ఇందులో ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు. అన్ని కులాల లెక్కలు వస్తే భవిష్యత్‌ చర్యలకు అవకాశం ఉంటుందని అన్నారు. గతంలో దసరా పండగ సందర్భంలో రేషన్‌కార్డుదారులకు బియ్యం, పప్పులు, నూనె ఇచ్చేవారని, ఈ ఏడాది అదేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి వాటిని అందించాలని కోరారు. టిటిడి నిధుల్లో ఒకశాతం తిరుపతి అభివృద్ధికి ఖర్చు చేయాలన్న నిర్ణయాన్ని బిజెపి, విహెచ్‌పి వ్యతిరేకించడం దుర్మార్గమని తెలిపారు. అందరికీ మేలు జరిగేలా టిటిడి అన్నిటికీ నిధులు ఇస్తోందని దీన్ని మతపరమైన కోణంలో వ్యతిరేకించడం సరికాదని పేర్కొన్నారు. వివాదం చేసి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బిజెపి కుట్రచేస్తోందని అన్నారు. మతోన్మాదంతో గుళ్లోకి ఇతర కులాల వారిని రానీయనివారు ఈ తరహా ప్రచారంతో మతవిద్వేషాలు రగిలించే పనిచేస్తున్నారని విమర్శించారు. వారికి ప్రజల్లో విలువ లేదని, ఉన్మాదాన్ని రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని, అటువంటి వాటికి ప్రభుత్వమూ చెక్‌పెట్టాలని కోరారు. కులగణన, జనగణన కలిపి చేయాలని సూచించారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే దీన్ని వాయిదా వేసుకుంటూ వస్తోందని అన్నారు. మహిళా బిల్లును 2029లో అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అసైన్డ్‌ భూముల వివరాలు తీయాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర సర్వేలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కొత్తగా ఇస్తున్న పట్టాలు బిఫారమా, ఒరిజినల్‌ పట్టాలా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు పంచేందుకు సిద్ధంగా ఉందని గుర్తించారని, అర్హులందరికీ ఆ భూములను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.
ప్రజా ప్రణాళికలో ముఖ్యాంశాలు
1 కరెంటు యూనిట్‌ రూపాయికే ఇవ్వడంతోపాటు పేదలకు 300 యూనిట్లు ఉచితం. స్మార్ట్‌మీటర్ల బిగింపు, ట్రూఅప్‌ ఛార్జీల రద్దు
2. రూ.400కే గ్యాస్‌, రూ.60కే లీటర్‌ పెట్రోలు, డీజిల్‌, ఇసుక ఉచితం
3. తలకు పదికేజీల ఉచిత బియ్యం, పప్పు నూనెల సరఫరా, నిత్యావసర ధరల తగ్గింపు
4. అందరికీ సంక్షేమం, పెన్షన్లు, రేషన్‌కార్డులు అన్నిరకాల పెన్షన్లు రూ.5000, పేద మహిళలకు ప్రత్యేక సాయం
5. రెండు సెంట్ల ఇల్లు, రూ.5 లక్షల ఆర్థికసాయం, నివాసిత ప్రాంతాల్లోనే ఇళ్లకు పట్టాలు, కొత్తకాలనీలకు అన్ని సౌకర్యాలు, చెత్తపన్ను, డ్రెయినేజీ ఛార్జీలు రద్దు, ఇంటిపన్ను తగ్గింపు
6. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ, అమరావతిలోనే రాజధాని
7. 40 వేల టీచర్‌పోస్టులకు మెగా డిఎస్‌సి, 2.50 లక్షల ప్రభుత్వ ఖాళీలు భర్తీ, నిరుద్యోగభృతి నెలకు రూ.5000
8. ఒపిఎస్‌ పునరుద్ధరణ, ప్రైవేటు ఉపాధ్యాయులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పెన్షన్‌.
9. భూమిలేని వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు రెండెకరాల భూమి, సేకరించిన భూముల్లో పరిశ్రమలు, లేదంటే రైతులకు వాపస్‌.
10. అసలు పట్టాదారుకే అసైన్డ్‌ భూములపై హక్కులు, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు
11. గ్రామీణ ఉపాధి 200 రోజులు, రోజు వేతనం రూ.600. పట్టణ ఉపాధి గ్యారంటీ చట్టం, సమానపనికి సమాన వేతనం.
12. చిన్న పరిశ్రమలు, వ్యాపారులకు రక్షణ, మెగా మాల్స్‌పై ఆంక్షలు, రాష్ట్రంలో ఐటి, ఫార్మా, టెక్స్‌టైల్‌, జూట్‌, పేపర్‌, అగ్రి, సినీరంగం, పరిశ్రమల అభివృద్ధి. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు.
13. అసంఘటిత కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు. సమగ్ర సంక్షేమ చట్టం, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్‌. ప్రభుత్వ ఉద్యోగులుగా స్కీం వర్కర్లు.
14. అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌, కిడ్నీ పేషెంట్లకు మందులు, పెన్షన్‌, సుజాతారావు కమిటీ సిఫార్సులు అమలు.
15. రైతులకు గిట్టుబాటు ధర. ప్రతి ఎకరాకు సాగునీరు, మోటార్లకు ఉచిత విద్యుత్‌, ప్రతి కౌలు రైతుకూ గుర్తింపు కార్డు, రుణం గ్యారంటీ, స్వామినాథన్‌, జయతీఘోష్‌, రాధాకృష్ణ కమిషన్‌ సిఫార్సుల అమలు
16. 2024 నుండే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు, మహిళల రక్షణ, అభివృద్ధికి కమిషన్‌. మద్యపానంపై నియంత్రణ, డ్రగ్స్‌ నిర్మూలన.
17. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, అటవీ సంరక్షణ చట్టసవరణ రద్దు. పోడు భూములకు పట్టాలు, ప్రత్యేక డిఎస్‌సి, ఏజెన్సీలో నాన్‌ షెడ్యూలు గిరిజన గ్రామాలు జిఓ 3 అమలు.
18. సామాజిక న్యాయం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, కులగణన, వివక్షపై కఠినచర్యలు, సబ్‌ప్లాను అమలు, దళితులకు రక్షణ, జస్టిస్‌ పున్నయ్య కమిటీ సిఫార్సుల అమలు, డప్పు, చర్మకారులందరికీ పెన్షన్లు.
19. వెనుకబడిన ప్రాంతాలకు రూ.లక్ష కోట్లతో ప్యాకేజీ, నిర్ణీత కాలపరిమితిలో వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులు పూర్తి. నిర్వాసితుల పునరావాసానికి ప్రాధాన్యత. 2013 భూసేకరణ చట్టం పకడ్బందీగా అమలు.
20. పరిశుభ్రమైన వాతావరణం, సముద్రతీర సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ. కాలుష్యరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌.
21. మైనార్టీల హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్లు, మత సామరస్యం, సచార్‌, రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ సిఫార్సుల అమలు.
22. వృత్తులకు రక్షణ, ఆధునిక పరికరాల సరఫరా. బిసిలకు సబ్‌ప్లాన్‌, ప్రత్యేక నిధులు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి కార్పొరేషన్లకు నిధులు, స్వయం ఉపాధికి రుణాలు, సబ్సిడీలు.
23. వికలాంగుల చట్టానికి రూల్స్‌ నోటిఫై. ఇతర పెన్షన్లతో సంబంధం లేకుండా నెలావారీ భృతి రూ.6000.
24.పాసింజర్‌ రైళ్ల పునరుద్ధరణ, జనరల్‌ బోగీల పెంపు, ఆర్‌టిసి బస్సుల్లో విద్యార్థులు, మహిళలు, వికలాంగులకు ఉచిత ప్రయాణం.
25. స్థానిక సంస్థలకు నిధులు, విధులు, స్థానిక సంస్థల పరిధిలోకి సచివాలయాలు. గ్రామీణాభివృద్ధికి నిధులు.
26. ప్రభుత్వ రంగం బలోపేతం, సహకార వ్యవస్థ పటిష్టం. డెయిరీ, చక్కెర మిల్లుల పున:ప్రారంభం.
27. కర్నూలుకు హైకోర్టు, విజయవాడ, విశాఖకు బెంచీలు. సత్వరన్యాయం, యువ న్యాయవాదులకు ప్రోత్సాహం. అవినీతిపై ప్రజా యుద్ధం, పకడ్బందీగా చట్టాల అమలు, బడా కార్పొరేట్లపై పన్ను, బ్యాంకు బకాయిలు వసూళ్లు.
28. పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు, ఆధునిక సౌకర్యాలతో కూడిన ఉచిత వృద్ధాశ్రమాలు, శ్రామిక మహిళల పిల్లలకు ఉచిత డేకేర్‌ సెంటర్లు. జానపద, వృద్ధ కళాకారులకు భృతి
29. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, రాజ్యాంగానికి లోబడి సుపరిపాలన, ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల బాండ్లు రద్దు, కార్పొరేట్‌ నిధులకు చెక్‌, పౌరుల వ్యక్తిగత గోప్యానికి భద్రత.
30. ప్రజాస్వామ్య, లౌకిక సంస్కృతి పరిరక్షణ, భారతీయ ఉత్తమ సంప్రదాయాలు, స్వాతంత్య్రోద్యమ వారసత్వం కొనసాగింపు.