ప్రజాశక్తి - అరకులోయ రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : మణిపూర్‌లో గిరిజన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన అత్యంత అమానుషమైనదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మణిపూర్‌లో మతోన్మాద, కార్పొరేట్ మారణకాండను ఆపాలంటూ అరకులోయ మండలంలోని నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద శుక్రవారం సిపిఎం ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. 'మతోన్మాదం' దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మణిపూర్‌లో అత్యంత విలువైన ఖనిజ సంపదను కాజేసేందుకు కేంద్ర కుట్రలు పన్నుతోందని, ఆ కుట్రలను అడ్డుకుంటున్న గిరిజనులపై దాడులు చేయిస్తోందని తెలిపారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వానికిగానీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికిగానీ చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో విఫలమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లను ఖండిస్తూ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఆయన మౌనం వెనుక బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ హస్తముందని అన్నారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై వైసిపి ఎంపి విజయిసాయిరెడ్డి స్పందిస్తూ మణిపూర్ ఘటనపై కేంద్ర హోం శాఖ చూసుకుంటుందని, కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు, ప్రధాన మంత్రికి సంబంధంలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ మతం, కులం పేరిట చిచ్చుపెట్టి ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని, అల్లూరి స్ఫూర్తితో ప్రజలు మేల్కొని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, కిల్లో సురేంద్ర, అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, అనంతగిరి జెడ్‌పిటిసి దీసరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
మణిపూర్‌లో జరిగిన అమానుష ఘటనలకు నిరసనగా పలు జిల్లాల్లో ఆందోళనలు చేశారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలంలోని కవుతరంలో అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. చల్లపల్లిలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఎన్‌టిఆర్ జిల్లా తిరువూరులోని శ్రీవాహిని ఇంజనీ రింగ్ కళాశాలలో ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. శ్రీకాకుళంలో దళిత, ప్రజాసంఘాల ఆధ్వర్యాన అంబేద్కర్ జంక్షన్ నుంచి డేఅండ్‌నైట్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యాన ఎన్‌జిఒ హోం నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఆశావర్కర్లు నిరసన తెలిపారు. కడియంలో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ముస్లిములు తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో న్యాయవాదులు నిరసన తెలిపారు.










