
రాష్ట్రంలో చెరకు పరిశ్రమ సంక్షోభంలో వుంది. ఉన్న 29 చక్కెర కర్మాగారాల్లో 24 మూతపడ్డాయి. 2022-23 చెరకు క్రషింగ్ సీజన్ నాటికి ఐదు ఫ్యాక్టరీలు మాత్రమే క్రషింగ్ చేస్తున్నాయి. సంకిలిలో ప్యారీ, చోడవరంలో కోఆపరేటివ్ ఫ్యాక్టరీ, తాడువాయిలో ఆంధ్రా షుగర్స్ ఫ్యాక్టరీ, ఉయ్యూరులో కెసిపి కర్మాగారం, తిరుపతిలో ఎస్‌ఎన్‌జె ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. వీటికి కూడా స్థాపిత సామర్థ్యానికి సరిపడా చెరకు పంట జోన్ ఏరియాల్లో లేదు. తగినంత చెరకు లేకపోవడం వల్ల వచ్చే క్రషింగ్ సీజన్ నాటికి ప్రస్తుతం నడుస్తున్న ఫ్యాక్టరీల్లో మరికొన్ని మూతపడే అవకాశం ఉంది.
ఒకప్పుడు రాష్ట్రంలో రైతులు 5.5 లక్షల ఎకరాల్లో చెరకు పంటను సాగు చేసేవారు. ప్రస్తుతం సాగు విస్తీర్ణం 1.5 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. అనకాపల్లి, విజయనగరం, చిత్తూరు వంటి జిల్లాల్లో బెల్లం తయారీ కోసం అక్కడ కొంత వరకు సాగు ఉన్నా...చక్కెర ఫ్యాక్టరీలపై ఆధారపడే ప్రాంతాల్లో మాత్రం చెరకు పంటను వదులుకొని ఇతర పంటలకు రైతులు మళ్లిపోతున్నారు.
- చెరకు బకాయిల చెల్లింపు సమస్య
చెరకు ఏడాది కాలం పంట. విత్తనం వేసిన నాటి నుంచి పెట్టిన మదుపులు తిరిగి రాబట్టుకోవడానికి రైతు ఏడాది ఆగాలి. అప్పుడు ఫ్యాక్టరీలకు చెరకు సరఫరా చేసిన తరువాత కూడా డబ్బులు సకాలంలో రాక, రైతులు ఇక్కట్లు పడుతున్నారు. 'షుగర్ కంట్రోల్ యాక్టు-1966' ప్రకారం రైతులు ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన 14 రోజులలోగా డబ్బులు చెల్లించాలి. అలా చెల్లించకపోతే ఆలస్యమైన కాలానికి 15 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని చట్టంలో ఉన్నా మిల్లు యాజమాన్యాలు చట్టాన్ని లెక్కచేయడం లేదు. చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఏ సీజన్‌కు డబ్బులు ఆ సీజన్‌లో క్లియర్ చేయకుండా రెండు మూడు సంవత్సరాల తరబడి బకాయిలు చెల్లించకుండా రైతులను తిప్పుతున్న ఫ్యాక్టరీలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. పైగా బకాయిల కోసం ఆందోళనలు చేసిన చెరకు రైతులపైన పోలీసులను ఉసిగొలిపి కేసులు పెట్టిన ఉదంతాలు రాష్ట్రంలో ఉన్నాయి. బొబ్బిలిలో ఎస్‌సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 90 మంది రైతులపై పోలీసు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. ఇందులో 45 మంది మహిళా రైతులు. తిరుపతిలో మయూరా షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు లోని నేతమ్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో నేటికీ రూ.60 కోట్లు చెరకు బకాయిలు గత మూడేళ్లగా కొనసాగుతున్నాయి. అక్కడ కూడా ఆందోళన చేసిన రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోంది. డబ్బులు చెల్లించని యాజమాన్యాలను వెనకేసుకొస్తూ షుగర్ కంట్రోల్ యాక్టును ప్రభుత్వమే నీరుగారుస్తోంది.
- రాష్ట్ర సలహా ధర లేదు
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది టన్ను చెరకుకు ఎఫ్‌ఆర్‌పి (ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్) రూ. 3,050 ప్రకటించింది. ఈసారి కూడా స్వామినాథన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేదు. ఎఫ్‌ఆర్‌పి కి రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా 'రాష్ట్ర సలహా ధర' (ఎస్.ఎ.పి) ప్రకటించి రైతులను ప్రోత్సహిస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా 2002 సంవత్సరం వరకు ఎస్.ఎ.పి విధానం ఉండేది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్.ఎ.పి ని రద్దు చేసింది. ఆ తరువాత దాన్ని పునరుద్ధరిస్తానన్న వై.ఎస్ రాజశేఖరరెడ్డి గాని, ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రి గాని ఎవ్వరూ ఆ పని చేయలేదు. మన రాష్ట్రం మినహా దేశంలో చెరకు పండిస్తున్న అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్.ఎ.పి ఇస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ఎఫ్.ఆర్.పి, రాష్ట్ర సలహా ధర (ఎస్.ఎ.పి)తో కలిపి టన్ను చెరకుకు హర్యానాలో రూ. 3,662, పంజాబ్‌లో రూ. 3,874 ఇస్తున్నారు. తమిళనాడులో ఎస్.ఎ.పి రూ. 200 ఇస్తున్నారు. కర్ణాటకలో చెరకు కటింగ్, రవాణా ఖర్చులు ఫ్యాక్టరీ యాజమాన్యాలే చెల్లిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల చెరకు రైతులతో పోల్చితే మన రైతులు టన్నుకు రూ.1000 నష్టపోతున్నారు.
- నూతన చెరకు వంగడాల కొరత
కేంద్రం ప్రకటించిన ఎఫ్.ఆర్.పి ధర రూ.3,050 చెల్లించడానికి పంచదార 10.25 శాతం రికవరీకి ముడిపెట్టింది. గత సంవత్సరం మన రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీల సగటు రికవరీ 9.5 శాతంగా ఉంది. రికవరీ తగ్గిన పాయింట్ల నిష్పత్తిలో ఎఫ్.ఆర్.సిలో కోతపెట్టి ప్రస్తుత సీజన్‌లో టన్నుకు రూ.2,750 యావరేజిగా రాష్ట్రంలో చెల్లిస్తున్నారు. అంటే రాష్ట్రంలో కనీసం ఎఫ్.ఆర్.పి ధర కూడా చెరకు రైతులు పొందలేకపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో 13-11.5 శాతం రికవరీ సాధిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన చెరకు వంగడాలను అభివృద్ధి పరిచి రైతాంగానికి అందిస్తూ రికవరీలను సాధిస్తున్నారు. మన రాష్ట్రంలో ఆ ప్రయత్నం కొరవడింది. రైతుకు టన్నేజీ, రికవరీ ఇచ్చే నూతన వంగడాలను అందించడంలో వెనుకబడిపోతున్నాము.
- చక్కెర పరిశ్రమ పాలసీ ఏది?
లక్షల మంది రైతులు, వేల మంది కార్మికులకు ఉపాధిని, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే చక్కెర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదు. ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్రలో.. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తానని వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు. తీరా ముఖ్యమంత్రి అయిన తరువాత ఫ్యాక్టరీల పరిస్థితిపై రెండు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. నిపుణులు, మంత్రులతో రెండు కమిటీలు వేశారు. వారు రిపోర్టులు ఇచ్చినా వాటిని బయటపెట్టలేదు. రాష్ట్రంలో వున్న 9 కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలలో (చోడవరం మినహా) 8 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇందులో 6 ఫ్యాక్టరీలను పునరుద్ధరించే ఆలోచనతో రిపోర్టులు తెప్పించుకున్నారు. ముందుగా శ్రీవెంకటేశ్వర, కడప, అనకాపల్లి ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తామంటూనే 6 ఫ్యాక్టరీలకు లిక్విడేట్ ప్రకటించి రైతుల ఆశలపై నీళ్లు చల్లారు.
రాష్ట్రంలో ప్రధానమైన చెరకు పంట కనుమరుగు కాకుండా కాపాడుకోవాలి. ఉపాధి, ఆదాయ వనరుగా ఉన్న చెరకు పరిశ్రమను రాష్ట్రంలో అభివృద్ధి పరుచుకోవాలి. సరైన చక్కెర పరిశ్రమ విధానాన్ని రూపొందించి అమలు చేయాలి. అందుకు రైతులు, కార్మికులు ఫ్యాక్టరీల వారీగా సంఘటితమై రాష్ట్ర స్థాయి ఉద్యమం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే మార్గం.
వ్యాసకర్త ఎ.పి చెరకు రైతు సంఘం కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ