Jun 15,2023 06:32

బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పెద్ద ఎత్తున వేగంగా అమలు జరుగుతున్నాయి. మోడీ ప్రభుత్వం చెబుతున్నదల్లా చేస్తున్న వైసిపి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఇవే విధానాలు అమలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ కాలంలో 6,16,323 ఉద్యోగాలు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటిస్తోంది. వాటిలో 3,71,777 ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు కాగా 37,908 కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు. మిగిలిన 2,06,638 రెగ్యులర్‌ ఉద్యోగాలని చెబుతున్నారు. వీరిలో 1,25,110 మంది గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగులు. 51,387 మంది ఆర్‌టిసి ఉద్యోగులు.
రాష్ట్ర అధికారిక లెక్క ప్రకారం 10,98,012 ఉద్యోగులు ఉండగా 2,61,311 మంది పాత పెన్షన్‌ విధానం అమలయ్యే రెగ్యులర్‌ ఉద్యోగులు. 3,08,984 మంది సిపిఎస్‌ ఉద్యోగులు. మిగిలిన 5,27,717 మంది ఏ పెన్షన్‌ లేని వారు. అంటే సుమారు 48 శాతం మంది ఉద్యోగులు ఏ భద్రత లేనివారు, మరొక 28.2 శాతం ఉద్యోగులు అరకొర భద్రత కలిగినవారు. పూర్తి భద్రత కలిగిన ఉద్యోగుల సంఖ్య 23.8 శాతం మాత్రమే.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి జాబ్‌ క్యాలండర్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని, సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తానని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తానని, 27 శాతం ఐ.ఆర్‌ ప్రకటించి దానికంటే మేలైన వేతన సవరణ అమలు చేస్తానని, డిఏలు రెగ్యులర్‌గా సకాలంలో చెల్లిస్తానని అనేక వాగ్దానాలు చేశారు. కాని, ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదు. గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు మినహా మరే కొత్త ఉద్యోగాలు సృష్టించలేదు సరికదా ఉన్న రెగ్యులర్‌ ఖాళీలేవీ భర్తీ చేయలేదు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల జెఏసిలు సమస్యలపై పోరాటం ప్రారంభించాయి. మరోవైపు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు కూడా సమస్యలపై కార్యాచరణకు పిలుపునిచ్చాయి. పరిస్థితులు వ్యతిరేకంగా మారుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి కొన్ని నిర్ణయాలు వెల్లడించింది. చర్చకు పెద్దగా అవకాశమివ్వకుండా వాటినే జూన్‌ 7వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదించినట్లుగా ప్రకటించారు.
మంత్రివర్గ నిర్ణయాలలో అతి ముఖ్యమైనది పెన్షన్‌ సమస్య. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 4 సంవత్సరాలు గడిచినా హామీ నిలుపుకోకపోవడంతో సిపిఎస్‌ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గం సిపిఎస్‌ రద్దు చేస్తున్నట్లు, దాని స్థానంలో ''గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌'' (జిపిఎస్‌) అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌గా ఇస్తామని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డియర్‌నెస్‌ రిలీఫ్‌ కూడా ఇస్తామని చెబుతున్నది.
పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరిస్తే 2041 నాటికి 65,234 కోట్లు పెన్షన్లకే చెల్లించాల్సి వస్తుందని, 2070 నాటికి అది 3,73,000 కోట్లకు చేరుతుందని లెక్కలు చూపుతున్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేని భారం పడుతుందని, అందుకే ఉభయ తారకంగా జిపిఎస్‌ తెచ్చామని చెబుతున్నారు. అంతేగాదు తమ విధానమే దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శమవుతుందని గొప్పలు చెబుతున్నారు.
దేశంలో సిపిఎస్‌ విధానం అమలులోకి తెచ్చేటప్పుడు ఆనాటి బిజెపి ప్రభుత్వం కూడా రిటైర్‌ అయిన తర్వాత లక్షలాది రూపాయలు ప్రయోజనం కలుగుతుందని, పాత పెన్షన్‌ విధానం కంటే ఎక్కువ పెన్షన్‌ లభిస్తుందని ఉద్యోగులను భ్రమలకు గురి చేసింది. దానికి కాంగ్రెస్‌ కూడా వంతపాడింది. 20 సంవత్సరాలు గడిచాక దాని అసలు స్వరూపం ఏమిటో అందరికీ అర్ధమైంది. అందుకే ఎవరు పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తామంటే వారికి ఉద్యోగులు అండగా నిలుస్తున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. తాజాగా జరిగిన హిమాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక ఎన్నికల ఉదంతం పరిశీలిస్తే అర్ధమవుతుంది. పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తానన్న కాంగ్రెస్‌కే పట్టం గట్టారు.
మన రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం టక్కర్‌ కమిషన్‌ను నియమించింది. దాని సిఫారసుల మేరకు 50 శాతం పెన్షన్‌ కూడా ఇస్తామని చెప్పింది. కాని, పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తానన్న జగన్‌కే ఉద్యోగులు ఓట్లు వేశారు. అధికారంలోకి తెచ్చారు. తీరా ఇప్పుడు జిపిఎస్‌ అమలు చేస్తామని మంత్రివర్గం ప్రకటించడంతో ప్రభుత్వం తమని మోసగించిందని ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు.
సిపిఎస్‌ రద్దు కోసం పోరాటం అంటే ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా యుటిఎఫ్‌ నాయకత్వం 65 మందిపై అనేక రకాల సెక్షన్లు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. అంతే తప్ప పాత పెన్షన్‌ విధానం కోసం పోరాడుతున్న సంఘాలతో ముఖ్యమంత్రిగాని, రాష్ట్ర ప్రభుత్వం గాని జిపిఎస్‌పై చర్చించలేదు. కేవలం తమకు అనుకూలమైన జెఏసి నాయకులతోనే చర్చించి నిర్ణయాన్ని ప్రకటించారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామని చెబుతున్న గ్యారంటీ పెన్షన్‌ విధానం పట్ల కూడా ఉద్యోగుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిపిఎస్‌ విధానం ఆచరణలో కాగితాలకే పరిమితమవుతుందా? పిఎఫ్‌ఆర్‌డిఏ చట్టం నుండి వైదొలగకుండా ఏ విధంగా అమలు చేస్తారు? జిపిఎస్‌కు చట్ట బద్ధత ఏమిటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మంత్రివర్గ నిర్ణయాల్లో మరొక ప్రధానాంశం కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో సుమారు 18 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరుగాక వివిధ కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్శిటీలు, స్థానిక సంస్థలలో పనిచేసే టైమ్‌స్కేల్‌, ఫుల్‌టైం కంటింజెంట్‌, డైలీ వేజ్‌, పార్ట్‌టైమ్‌ కంటింజెంట్‌ ఉద్యోగులు మరో 50 వేల మంది ఉంటారని అంచనా. పాదయాత్ర సందర్భంగా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానం ద్వారా నియమితులైన ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్‌ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్‌ 2 నాటికి ప్రభుత్వ విభాగాలలో నోటిఫికేషన్‌ ఇచ్చి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లకు అనుగుణంగా నియమితులైన వారు 10,117 మంది ఉన్నారు. వీరిలో రాష్ట్ర విభజన నాటికి 5 సంవత్సరాల సర్వీస్‌ ఉన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు మంత్రివర్గం ప్రకటించింది. అంటే, మొత్తం కాంట్రాక్టు ఉద్యోగుల్లో కేవలం 6,666 మంది మాత్రమే రెగ్యులరైజ్‌ అవుతారు. మిగిలిన వారి సంగతి ఏమిటన్నది స్పష్టత లేకపోవడంతో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తమను కూడా రెగ్యులర్‌ చేయాలని వారు కోరుతున్నారు.
మరొక ముఖ్య నిర్ణయం 12వ పిఆర్‌సి ఏర్పాటు. గత పిఆర్‌సి సందర్భంగా కనీసం రిపోర్టు కూడా బయటపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఉద్యోగులు ఇంకా మరచిపోలేదు. ఇచ్చిన ఐ.ఆర్‌. 27 శాతం కంటే తక్కువ 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి పిఆర్‌సి అమలు చేశారు. మొత్తం డిఏలన్నిటిని ముద్దగా కలిపేశారు. పిఆర్‌సి, డిఏ అరియర్లు రూ.7,382 కోట్లు ఇప్పటివరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. పైగా నాలుగేళ్లలో వాయిదాల రూపంలో చెల్లిస్తామని చెబుతున్నారు. ఎన్నికలు జరిగే నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఒక వాయిదా అంటే 175 కోట్లు మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన బకాయి సంగతేమిటి?
ఇలాంటి పరిస్థితుల్లో గత పిఆర్‌సి బకాయిలు చెల్లించకుండానే ఇప్పుడు కొత్త పిఆర్‌సి అని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ప్రకటించిన 12వ పిఆర్‌సి ఎప్పుడు తన నివేదిక ఇస్తుందో, పిఆర్‌సి ఎప్పుడు అమలుకు నోచుకుంటుందో, పిఆర్‌సి అరియర్లు ఏ విధంగా చెల్లిస్తారో తెలియదు. అంటే ఈ ప్రకటన రానున్న ఎన్నికల నేపథ్యాన్ని పురస్కరించుకుని చేసినది తప్ప మరొకటి కాదు.
జిల్లా కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వడం, వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులకు 010 హెడ్‌ ద్వారా జీతాలు చెల్లింపు, సొసైటీలు, యూనివర్శిటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంపు వంటి నిర్ణయాలు కొద్దిమందికి ప్రయోజనం కలిగించే అంశాలుగా ఉన్నప్పటికీ ప్రధానంగా పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, బకాయిల చెల్లింపులపై అరకొర నిర్ణయాలు ఎవరికీ సంతృప్తికరంగా లేవు.
కాబట్టి, రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు పున:సమీక్షించాలి. ప్రకటించిన గ్యారంటీ పెన్షన్‌ విధానానికి బదులుగా పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలి. కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెంపుదల చేయాలి. వీటి సాధనకై ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ ఐక్య ఉద్యమాలకు కదలి రావాలి.

utf prasad

 

 

 

 

 

 

వ్యాసకర్త యుటియఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌