
ఆత్మ నిర్భర భారత్‌లో కూడా బడా కార్పొరేట్ సంస్థలకు రూ.లక్షల కోట్లు కేంద్రప్రభుత్వం సమకూర్చింది. పన్నురాయితీలు ఇచ్చింది. బ్యాంకుల్లో ఉన్న లక్షల కోట్ల అప్పులను కూడా మాఫీ చేసింది. చిన్న తరహా స్టార్టప్‌్‌లకు మాత్రం ఆత్మనిర్భర పథకంలో కనీస స్థాయిలోనైనా నిధులు సమకూర్చలేదు. పన్ను రాయితీలు కూడా ప్రత్యేకంగా కల్పించలేదు. దీంతో ఈ సంస్ధల ఉనికికే నేడు ముప్పు ఏర్పడింది.
ప్రపంచ వ్యాప్తంగా అలుముకున్న ఆర్థిక మాంద్యంతో స్టార్టప్ కంపెనీలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలు మూతపడుతున్నాయి. నిర్వహణకు కూడా నిధులు లేక కార్యకలాపాలను కుదించుకుంటున్నాయి. లక్షల మంది ఉద్యోగులు తొలగించబడుతున్నారు.
స్టార్టప్‌లలో అగ్ర భాగంలో ఉన్న అమెరికాలో కూడా వీటి పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా వుంది. పెద్దయెత్తున ఉద్యోగుల తొలగింపు కార్యక్రమం ప్రారంభమయ్యింది. ప్రఖ్యాతిగాంచిన నెట్‌ఫ్లిక్స్, రాబిన్‌హుడ్, పేపాల్, వర్జిన్ పవర్ సంస్థలు గత ఆరు నెలల లోనే 22 వేల మందిని తొలగించాయి. దీనినిబట్టే స్టార్టప్ కంపెనీల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మన దేశంలో కూడా స్టార్టప్‌ల పరిస్థితి ఆందోళనకరంగా వుంది. 17 శాతం స్టార్టప్ లు మూతబడ్డాయి. బెంగళూరు వంటి నగరాల్లో స్టార్టప్ ఫర్ సేల్ అనే ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇప్పటికే దేశంలో ప్రముఖ స్టార్టప్ కంపెనీలైన ఓలా, బ్లింకిట్, బైజూస్, ఆన్ అకాడమీ, వేదాంతు, కార్స్ 24, మొబైల్ ప్రీమియర్ లీగ్, లిడో లెర్నింగ్ వంటి కంపెనీలు 12 వేల మందిని తొలగించాయి. కరోనా సంక్షోభ సమయంలో భారీగా లాభపడ్డ సంస్థలు కూడా ఇప్పుడు తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఆదాయాలు తగ్గిపోవడంతో వాటి మార్కెట్ విలువ క్రమంగా తగ్గిపోతున్నది. నిధుల సమీకరణ కష్టమైపోయింది. మొత్తంగా ఈ ఏడాది భారతదేశంలో 60 వేల మంది ఉద్యోగులు తొలగించబడతారని అంచనా.
ఈ సంక్షోభ వాస్తవ పరిస్థితి నుండి స్టార్టప్ లను కాపాడే చర్యలు కేంద్రప్రభుత్వం చేపట్టడం లేదు. పైపెచ్చు స్టార్టప్‌లు స్థాపిత సంఖ్య నమోదులో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో భారత్ ఉందని ప్రధాని దగ్గర నుండి మంత్రుల వరకు ప్రకటనలు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 16వ తేదీని జాతీయ స్టార్టప్ దినోత్సవంగా కూడా ప్రధాని ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేర రాష్ట్రాలకు, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ పేర నగరాలకు పోటీ పెట్టి ఎలా ర్యాంకులు ఇస్తున్నారో అలాగే గత మూడేళ్ల నుండి స్టార్టప్‌ల అభివృద్ధి పేర రాష్ట్రాలకు ర్యాంకులు ఇస్తున్నారు. ఈ ర్యాంకులను పరిశీలించినా దేశంలో అత్యధిక రాష్ట్రాలు స్టార్టప్ లలో చాలా వెనుకబడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో అట్టడుగు స్థానంలో ఉన్నట్లు స్టార్టప్ ర్యాంకులు తెలియజేస్తున్నాయి. అలాగే అతి పెద్ద స్టార్టప్‌లన్నీ బెంగళూరు, ముంబాయి, హైదరాబాద్, నోయిడా, కోల్‌కతా, చెన్నై వంటి మహా నగరాల్లోనే కేంద్రీకృతమైనాయి. బెంగళూరు నగరంలో వున్న సార్టప్‌లు మొత్తం దేశంలోని స్టార్టప్‌ల విలువలో 55 శాతం కలిగి ఉన్నాయి.
కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ గత మార్చిలో ప్రకటించిన లెక్కల ప్రకారం దేశంలో ప్రభుత్వం గుర్తించిన స్టార్టప్‌లు నేడు 66,810 ఉన్నాయి. వీటిల్లో 5.49 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాగే స్టార్టప్‌ల ఎకో సిస్టంలో అమెరికా, చైనా తరువాత భారత్ 3వ స్థానంలో ఉందని కూడా తెలిపింది. 2006కి ముందు దేశంలో 3500 స్టార్టప్‌లు వుండేవని బీజేపి అధికారం లోకి వచ్చిన తరువాత స్టార్టప్‌ల అభివృద్ధి బాగా జరిగిందని ప్రభుత్వ ప్రచారం. 2015 నుండే స్టార్టప్‌లు పుట్టగొడుగుల్లా పెరిగాయనేది వాస్తవమే అయినా 2015 తరువాత నుండి స్టార్టప్‌ల నమోదులో ఏడాదికేడాది క్రమేణా తగ్గుతూ వస్తోంది. 2015లో 8 వేల స్టార్టప్‌లు నమోదు కాగా, 2016కి 5200కి తగ్గాయి. 2017లో 4500, 2018లో 4300 నమోదయ్యాయి. ఈ సంఖ్య కోవిడ్ మహమ్మారి కాలంలో 2020లో 1250, 2021లో 1436కి దారుణంగా పడిపోయాయి. వీటిలో కూడా అత్యధిక భాగం చాలా చిన్నవి. ఒక్కొక్కరే మూడు, నాలుగు సంస్థలు రిజిస్టర్ చేసినవి కూడా ఎక్కువగానే ఉంటాయి.
ప్రపంచంలో యూనికార్న్‌లలో భారత్ మూడో స్థానంలో ఉందని, కోవిడ్ కాలంలో సైతం చాలా స్టార్టప్‌లు యూనికార్న్ స్థాయికి చేరుకున్నాయని ఘనంగా చెబుతున్నారు. వాస్తవం ఏమిటీ? ఒక బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా గుర్తిస్తారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా 1058 వుంటే అమెరికాలో 487, చైనాలో 301, భారత్‌లో 103 వున్నాయి. కోవిడ్ కాలంలో కొన్ని రంగాల్లో పనిచేస్తున్న స్టార్టప్ లలో ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెద్దయెత్తున పెట్టబడింది. దీంతో 60కి పైగా యూనికార్న్ కోవలోకి చేరాయి. దేశంలో 56 విభిన్న రంగాల్లో స్టార్టప్ లు పని చేస్తున్నాయి. అయితే మొత్తం స్టార్టప్ లలో 50 శాతం ఐటీ, హెల్త్ కేర్, విద్య, ప్రొఫెషనల్, వాణిజ్య సేవలు, ఆహారం, వ్యవసాయం వంటి ఐదు రంగాలలోనే వున్నాయి. చాలా రంగాల్లో నేటికీ అట్టడుగునే వున్నాం.
కోవిడ్ కాలంలో మన దేశంలో కూడా కొన్ని పెద్ద స్టార్టప్‌లు, యూనికార్న్‌లు బాగా లాభాలు గడించాయి. భారీగా నిధులను కూడా ప్రైవేట్ ఈక్విటీ వెంచర్ క్యాపిటల్ ద్వారా సమకూర్చుకున్నాయి. మార్కెట్ విలువను కూడా పెంచుకున్నాయి. కొన్ని సంస్థలు ఐపిఓ లకు వెళ్ళి స్టాక్ మార్కెట్ ద్వారా భారీగా ఆదాయం పొందటమేగాక మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను పెంచుకు న్నాయి. ఇవి చాలా పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. మొత్తం స్టార్టప్‌లలో కేవలం 8 శాతం మాత్రమే వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు పొందుతున్నాయి. ఇప్పుడు వీటి పరిస్థితుల్లో కూడా మార్పు వచ్చింది.
అమెరికా తీసుకునే ప్రతి చర్య, జరిగే పరిణామాలు మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఏదో ఒక రూపంలో ప్రభావం చూపుతాయి. ఈ కాలంలో అమెరికా కొన్ని చర్యలు చేపట్టింది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వు మార్కెట్ నగదు లభ్యతను మరింత సరళతరం చేసే దిశగా చర్యలు తీసుకుంది. మార్కెట్‌లో బాండ్లను అమ్మి నగదును సమకూర్చు కుంటున్నది. తిరిగి దీనిని మార్కెట్‌లోకి పంపిణీ చేస్తున్నది. అలాగే అమెరికాలో గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఆయిల్ ధరలు పెరిగాయి. ఈ పరిస్థితుల వల్ల వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీలు భారత దేశంలోని స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టటానికి ముందుకు రావడం లేదు. ఉన్న పెట్టుబడులను కూడా ఉపసంహరించుకుంటు న్నాయి. దీంతో భారత దేశంలోని పెద్ద స్టార్టప్‌లు కూడా తీవ్ర నిధుల సమస్యను ఎదుర్కొంటున్నాయి.
అలాగే సంస్థల మధ్య మార్కెట్ పోటీ పెరగడం, ఆర్థిక వ్యవస్థలో వీటి సేవల వినియోగం తగ్గిపోవడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాలు కూడా ఈ సంస్థలపై పడింది. వీటన్నింటి ఫలితంగా దేశంలోని పెద్దపెద్ద స్టార్టప్‌లు తమ వ్యాపార కార్యకలాపాలు కుదించుకోవడం, కొన్ని అనుబంధ సంస్థలను మూసివేయడం చేస్తున్నారు. వ్యయం తగ్గింపు, పొదుపు చర్యలు పాటించటం కూడా చేయడంతో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఈ బడా స్టార్టప్‌లో పనిచేసే కార్మికులకు నిర్దిష్ట వేతనాలు, సామాజిక భద్రత వంటివి లేకపోగా పెద్ద ఎత్తున దోపిడీకి గురౌతున్నారు. మధ్యస్థ ఏజన్సీలను పెట్టి గిగ్గ్ వర్కర్లుగా వున్న వీరి శ్రమను విపరీతంగా దోచుకుంటున్నాయి. వీరిని తొలగించినా ఎలాంటి నష్టపరిహారం ఈ సంస్థలు చెల్లించటంలేదు.
ఇప్పటికే దేశంలో నిరుద్యోగం తీవ్రంగా ఉంది. పట్టణ ప్రాంత యువతలో 23 శాతం నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. మొత్తం పట్టణ ప్రాంతంలో 9 కోట్ల మంది నిరుద్యోగులున్నారు. నిరుద్యోగంతో పాటు పేదరికం కూడా కోవిడ్ వల్ల రెట్టింపు అయ్యింది. ఇప్పుడు స్టార్టప్‌ల సంక్షోభం వల్ల నిరుద్యోగం మరింత పెరుగుతున్నది.
ఇక చిన్న, మధ్య తరహా స్టార్టప్‌ల పరిస్థితి దినదిన గండంగా మారింది. మొత్తం స్టార్టప్‌లలో మూడింట రెండొంతులు ఈ కోవకు చెందినవే. నిధులు, మార్కెట్ లేక సగం సంస్థలు కార్యకలాపాలు నామమాత్రం చేసుకున్నాయి. ఈ సంస్థలకి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ద్వారా పెట్టుబడులు సమకూరవు. ఎక్కువ భాగం సొంత నిధుల మీదే ఆధారపడి నడుస్తాయి. గతంలో పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీ వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోవిడ్ మహమ్మారితో ఈ సంస్థలన్నీ ఇప్పుడు నీరుగారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుండి ఈ తరహా స్టార్టప్‌లకు నిధుల మద్దతు, రాయితీలు లేవు. 2016లో స్టార్టప్ మిషన్ ద్వారా ముద్రా రుణాలు కొన్ని స్టార్టప్‌లకు ఇవ్వటం మినహా ఆ తరువాత ఈ సంస్థలకు ప్రభుత్వ సహాయంలేదు. ఆత్మ నిర్భర భారత్‌లో కూడా బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్లు కేంద్రప్రభుత్వం సమకూర్చింది. పన్ను రాయితీలు ఇచ్చింది. బ్యాంకుల్లో ఉన్న రూ. లక్షల కోట్ల అప్పులను కూడా మాఫీ చేసింది. చిన్న తరహా స్టార్టప్‌్‌లకు మాత్రం ఆత్మనిర్భర పథకంలో కనీస స్థాయిలోనైనా నిధులు సమకూర్చలేదు. పన్ను రాయితీలు కూడా ప్రత్యేకంగా కల్పించలేదు. దీంతో ఈ సంస్ధల ఉనికికే నేడు ముప్పు ఏర్పడింది.
స్టార్టప్‌లు పునరుజ్జీవనం పొందాలంటే కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్య తరహా స్టార్టప్‌ల ఎడల ప్రత్యేక చర్యలు చేపట్టాలి. నిధులు, రుణాలు, మౌలిక వసతులు, ఇంక్యూబ్‌మెంట్ వంటి సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలి. మార్కెట్ సదుపాయం కల్పించే చర్యలు చేపట్టాలి. అలాగే వీటి అభివృద్ధి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ వృద్ధి మీద కూడా ఆధారపడి ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం నుండి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే చర్యలు చేపట్టకుండా ఆర్థిక వ్యవస్థలో ప్రజల వినియోగ స్థాయి పెరగదు. అందుకు ప్రభుత్వం తన వ్యయాన్ని ప్రజలపై పెంచటానికి సిద్ధపడటం లేదు. ఫలితంగా స్టార్టప్‌లే కాదు. దేశంలో అన్ని రంగాలు తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి.
డా|| బి. గంగారావు / వ్యాసకర్త సెల్ : 9490098792 /