Sep 09,2023 16:45

ఉక్రెయిన్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ఆజ్యం పోయకూడదన్న ఉద్దేశంతోనే స్టార్‌ లింక్‌ సేవల విషయంలో కీవ్‌ అభ్యర్థనను తోసిపుచ్చినట్లు టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. యుద్ధం మరింత ముదిరేందుకు తమ స్టార్‌ లింక్‌ సేవలు దోహదపడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్‌ తెలిపారు.రష్యా యుద్ధ నౌకలపై ఉక్రెయిన్‌ తలపెట్టిన రహస్య డ్రోన్‌ దాడులను నిలువరించేందుకు సివెస్తోపోల్‌లో స్టార్‌లింక్‌ సేవలను స్విచ్ఛాఫ్‌ చేయాలని ఎలాన్‌ మస్క్‌ సూచించారంటూ సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ మస్క్‌ బయోగ్రఫీని ఉటంకిస్తూ ఓ వార్తను ప్రచురించింది. దీనిపై మస్క్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో స్పందిస్తూ.. సివెస్తోపోల్‌లో స్టార్‌ లింక్‌ సేవలను యాక్టివేట్‌ చేయాలంటూ ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన అత్యవసర వినతిని తిరస్కరించానని పేర్కొన్నారు. రష్యాకు చెందిన యుద్ధ విమానాలను నాశనం చేసేందుకు ఉద్దేశించిన ఈ దాడికి తాను అంగీకరించి ఉంటే యుద్ధం మరింత తీవ్రమయ్యేదని తెలిపారు. యుద్ధానికి ఆజ్యం పోయడం తనకిష్టం లేదని మస్క్‌ పేర్కొన్నారు. ఇదంతా ఏ తేదీన జరిగింది అనే వివరాలను పేర్కొనలేదు.
ఒకవేళ దాడి జరిగితే పుతిన్‌ అందుకు ప్రతిగా అణ్వాయుధాలతో విరుచుకుపడే వారని, దీంతో క్రిమియా కాస్తా మరో మినీ పెరల్‌ హార్బర్‌గా మారేదని వాల్టర్‌ ఐజాక్సన్‌ 'ఎలాన్‌ మస్క్‌' బయోగ్రఫీలో పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 12న ఈ పుస్తకం విడుదల కానుంది. మరోవైపు మస్క్‌ కామెంట్‌పై ఉక్రెయిన్‌ సీనియర్‌ ఉన్నతాధికారి మైఖెలో పొడొల్యాక్‌ స్పందించారు. డ్రోన్‌ దాడికి మస్క్‌ అనుమతివ్వకుండా పెద్ద తప్పు చేశారని ఎక్స్‌ వేదికగా విరుచుకుపడ్డారు. అదే సమయంలో ఎలాన్‌ మస్క్‌ ఉక్రెయిన్‌ నగరాలపై దాడులకు సహకరించారని, దీంతో అమాయక పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.